సినీ మా(యా) పరిశ్రమ
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:40 AM
సినిమా నటులంటే బతుకుతెరువు కోసం లేదా వారికున్న నటనా వ్యామోహంతో నటించడానికి వస్తారు. ప్రజలు ఓహో అనేలా నటించవచ్చు. నిజమే అనుకునేంతగా భ్రమింపజేయవచ్చు, తమ నటనతో ప్రేక్షకులను...

సినిమా నటులంటే బతుకుతెరువు కోసం లేదా వారికున్న నటనా వ్యామోహంతో నటించడానికి వస్తారు. ప్రజలు ఓహో అనేలా నటించవచ్చు. నిజమే అనుకునేంతగా భ్రమింపజేయవచ్చు, తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేయవచ్చు. దానికి తగిన పారితోషికం తీసుకుని వారి నటనలో వైవిధ్యాలను జోడిస్తూ కొత్త కొత్త నటకౌశలాలను ప్రదర్శించి మెరుగులు దిద్దుకోవచ్చు. అంతమాత్రాన వాళ్ళు దైవాంశ సంభూతులు అయిపోరు. అభిమానం ఉండొచ్చు, కానీ కని పెంచిన తల్లితండ్రులను, కష్టసుఖాల్లో ఆదుకునే తోడబుట్టినవాళ్ళు, కలిసి పనిచేసే సహోద్యోగులు, అవసరాల్లో ఆసరా అయ్యే మన చుట్టుపక్కల వారికన్నా వాళ్ళే గొప్పనుకునేంత శృతిమించిన దురభిమానంలోకి యువత జారిపోవటం దురదృష్టకరం.
మనిషికి అవసరం వినోదం. ఆ వినోదం శత్రువులను చెండాడే దేశభక్తికి, సమాజాన్ని ఉద్ధరించేందుకు అలాగే తనను తాను ఉద్ధరించుకునేందుకు తోడ్పడాలి. ఈ రోజున టీవీ షోలు మొదలుకుని సినిమాలు, సోషల్ మీడియా మాత్రమే కాదు, చివరికి ఒకటి, రెండు సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల్ని కూడా అశ్లీల బట్టలతో నాట్యం చేయిస్తూ పైపెచ్చు... బట్టలెందుకు చూస్తారు, టాలెంట్ చూడండి అంటూ నిర్లజ్జగా సమర్థించుకోవడం కనిపిస్తుంది. పూర్వం అభిమానం సహజంగా పుడితే, నేడు సోషల్ మీడియా వేదికగా ‘వైరల్’ అనే వైరస్ జొరబడి కల్పించుకున్న అభిమానులకు.. తమకు తామే సృష్టించుకునే స్టార్‌డమ్‌ల వరకు ఎదిగి ఎదిగి... వందలు వేలల్లో ఉన్న పారితోషికాలు కోట్లల్లోకి వెళ్ళింది. అయితే, దర్శక నిర్మాతలు మాత్రం ‘మేము సమాజంలో జరిగే నిజాల్ని జనాలకు చూపిస్తున్నాం’ అంటూ తేనెపూసిన మాటలెన్ని మాట్లాడినా... ఒక హత్యో, అత్యాచారమో జరిగిందని తెలపడానికి, దాన్ని ఎలా తప్పించుకోవచ్చో కూడా జతచేసి వివరంగా సినిమా తీసి జనాల్లోకి వదలటం వల్ల పిల్లలు, యువత ప్రేరేపితమై చెడుదారి పట్టే అవకాశం కల్పించడానికి చాలా తేడా ఉంటుందని తెలిసి కూడా ధనవ్యామోహంతో ముందుకెళ్తున్నారు.
ఒక సెలబ్రిటీగానో, ప్రజా నాయకుడిగానో గుర్తింపు పొందిన పౌరులు సమాజం పట్ల మరింత బాధ్యతగా ప్రవర్తించడం, మాట్లాడటం తమకు తామే అలవరుచుకోవాలి. ఎందరికో జీవనోపాధిని ఇస్తున్నామన్న పేరుతో సినిమానొక పరిశ్రమగా చేసి, వ్యాపారంగా మార్చామంటూ సమర్థించుకోవడం అంతకన్నా సరికాదు. జనం కూడా పాతకాలంలో లాగా తెరవెనుక నటులుంటారని, జరిగేదంతా నిజమనుకునే భ్రమ నుంచి తేరుకుని తామే నటులై సోషల్ మీడియాలో రాజ్యమేలుతూ కూడా, సినిమా నటుల్ని ఆకాశానికెత్తేస్తూ మొదటిరోజే సినిమా చూడకుంటే ప్రాణం పోతుందన్నంత మూర్ఖత్వంతో బతకడం శోచనీయం.
సమాజమా గుర్తించు... ఎవరి స్వార్థప్రయోజనాల కోసమో తయారై ప్రయోగించబడుతున్న మాయల ఉచ్చులోకి నిన్ను నువ్వే తోసేసుకుని నశించి పోకుండా జాగ్రత్తపడు. సైబర్ నేరాలు మాత్రమే కాదు అంతకు మించిన మాయ వలలు మనచుట్టూ అల్లుకుని ఉన్నాయని గుర్తెరిగి మసలుకుంటే కుటుంబాలు, దేశం బాగుంటాయి. దానివల్ల నీ జీవితమూ సుఖమయమౌతుంది.
డేగల అనితాసూరి, హైదరాబాద్