Share News

మారుపాకలో బాల్య మధురిమలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:18 AM

నా చిన్ననాటి జ్ఞాపకాలు, వేములవాడ మండలం మారుపాక గ్రామం – కోనరావుపేట మండలం నాగారం గ్రామాల నుండి మొదలవుతాయి. అందులో మారుపాకలో మా కుటుంబం నివసించిన ఊరి ఆవలి గుడిసె ప్రత్యేకం...

మారుపాకలో బాల్య మధురిమలు

నా చిన్ననాటి జ్ఞాపకాలు, వేములవాడ మండలం మారుపాక గ్రామం – కోనరావుపేట మండలం నాగారం గ్రామాల నుండి మొదలవుతాయి. అందులో మారుపాకలో మా కుటుంబం నివసించిన ఊరి ఆవలి గుడిసె ప్రత్యేకం. మాకు రెండు గ్రామాలలో ఆస్తులు ఉన్నాయి. పంచుకుంటే మారుపాకలో ఇళ్లు (గడీ) రాలేదు. అందుకే ఊరి బయట గుడిసెలో కాలం గడిపి నాగారంలో ఒక చిన్న ఇల్లు కట్టారు. అయితే మా తాత గారు (అమ్మ తండ్రిగారు) ఇంటి నిర్మాణానికి బాగా సహాయం చేశారని చెబుతుండేవారు. ఆ గ్రామం పెద్ద అడవిలో ఉండేది కాబట్టి ఎక్కువ కాలం మారుపాకలో గుడిసెలోనే కాలం గడిచిపోయింది. కానీ చివరికి నాన్న నాగారంలోనే చనిపోవడం జరిగింది. అందుకే ఆ గ్రామాన్నే నా వ్యవసాయ క్షేత్రంగా ఎంచుకున్నాను. ఎన్నిసార్లో ఆ గ్రామాన్ని వదిలిపెట్టే పరిస్థితులు వచ్చినా నన్ను మాత్రం వెంటాడి తిరిగి గ్రామానికి తెచ్చుకున్నది నాగారం గ్రామం. ఆ అనుబంధం కూడా చెరిగిపోనిది. ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినా సంతోషంగా భరించాను. నా సమయం వృథా అయినా, ఎంతో మంది తీవ్రమైన విమర్శలు చేసినా నాకు మాత్రం సంతృప్తినిచ్చింది నాగారం.


మారుపాక గుడిసెలలో పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు దోమలు, ఈగలు, కోళ్లు, పశువులు, లేగదూడలు, చెట్లు, చేమలు, పువ్వులు, పొదలు, పురుగులు దాదాపు వెన్నంటే ఉండేవి. అప్పుడప్పుడు తేళ్లు, పాములు దర్శనమిచ్చేవి. చాలా వరకు పారిపోయేవి. దొరికిన వాటిని చంపేవారు. అప్పుడు సినిమాలు, టీవీలు లేవు కాబట్టి సమయం అంతా పరిసరాల కమనీయ దృశ్యాలే కంటి నిండ కదలాడేవి. వర్షాకాలం రాగానే ముళ్ల కంపతో గుడిసె చుట్టూ కొంచెం ఎత్తుతో గోడ మాదిరి నిర్మాణం చేసి, చిన్నగా దాన్ని ఒక చోట వదిలి కట్టెలలో చిన్న తలుపు మాదిరిగా అడ్డం ఉంచేవారు. మా గుడిసెకు తలుపు, తాళం లేదని గర్వంగా రాసుకుంటున్నాను. ముళ్లకంప పైన రకరకాల మొక్కలు తీగలు పారి పువ్వులు పూసి, కాయలు కాసి కంపను కనపడకుండా దాచేవి. గుడిసె చుట్టూ అల్లుకుపోయిన పచ్చదనం, పువ్వుల అందం కొన్ని మాసాలు అద్భుతంగా ఉండేది. విద్యుత్‌ లేదు కాబట్టి రాత్రి కిరోసిన్‌ నూనెతో ఎక్కాలను, ఖందిల్లను వెలిగించేవారు. సాయంత్రం అయితేనే ఇది ఒక పెద్దపని. రాత్రిపూట మసిబడ్డ బుగ్గలను తుడవడం, కాలిన వత్తులను సరిచేయడం జాగ్రత్తగా నూనె పోయడం ఒక నైపుణ్యంతో కూడుకున్న పని. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉన్న గూళ్లల్లో మట్టి ప్రమిదలలో నూనె పోసి ఇంట్లో దూదితో తయారుచేసిన వత్తులను వెలిగించేవారు. దేవుళ్ళ దగ్గర మట్టి మాణిక్యాలను వెలిగించేవారు. ఇవన్ని ఉన్నా ఎక్కువ సమయం చీకట్లోనే గడిచేది. వెన్నెల రాత్రులు ఎప్పుడెప్పుడని ఎదురుచూసేవాళ్లము. పంకాలు లేవు కాబట్టి ఉడకపోసినా సహజంగా అనిపించేది. వానకాలంలో కంపనాటడం, ఎండకాలంలో తీయడం, ఒక పెద్ద ప్రక్రియ. కంప తీయటానికి ఉపయోగించే రాగోల (పంగలాంటి పెద్ద కట్టె) పనితనం ఆకర్షణీయంగా ఉండేది. రాత్రిపూట చలికాలంలో గుడిసె ముందు కట్టెలు కాల్చి మంట పెట్టేవారు. అందులో ఒక పెద్ద మొద్దు ఎప్పుడూ మెల్లమెల్లగా కాలుతూనే ఉండేది. అవసరం అయినప్పుడు దాని పైననే ఎండిన పుల్లలు, ఒక చిన్న కంప, ఆకులు వేసి ఊదితే కొంతసేపు చలి కాపుకునే మంట వచ్చేది. దాని చుట్టు గుండ్రంగా కూర్చునేవారము.


గుడిసె ముందు రోలు, రోకలి, గుడిసె లోపల కాగులు, కుండలు, కూజాలు, గిలాసలు, చెంబులు, గంగాలాలు, కొప్పెరలు, దేకీసలు, పొయ్యిలు, దాలి, శిబ్బి, కవ్వం, వేలాడుతున్న ఉట్లు, చల్ల కుండ, పల్లాలు, కూర్చుండే చాపలు, పండుకునే చాపలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, మెత్తలు, జంబుకానాలు, తెల్లవారంగానే బట్టలను చుట్టి ఒక్కొక్కదాన్ని గడెంచ మీద పేర్చేవారు. అల్మారాలు మాత్రం ఉండేవి కావు. మా నాన్న నవారు మంచం మీద, మిగిలిన వారందరం నులక మంచాల మీద, చాపల మీద పండుకునేవారం. పొద్దున లేవంగానే బొగ్గు పొడితో అందరం పండ్లు తోముకునేది. మా నాన్నగారు పండ్ల పుల్ల వేసుకునేది. పండ్ల పుల్లలు కట్టలుగా ఉంచేవారు. అందులో కొన్న యాప పుల్లలు, మధ్యలో ముద్రబెండ చెట్ల పుల్లలు ఉండేవి. అప్పుడప్పుడు అవి వేసుకొని మా గొప్పతనాన్ని ఎవరికీ తెలియకుండా చాటుకునేవారం. ఆ కాలం నుండే టీ త్రాగుటం అందరికి అలవాటు అయ్యింది. ‘‘దాలి’’ అనేది వంటింట్లో భూమిలో రెండు, మూడు అడుగుల లోతున చతురస్రాకారంలో త్రవ్వి దానిలో పిడకలు వేసి, పైన కుండ పెట్టి దానిలో పాలు పోసి, పిడకలకు నిప్పంటిస్తే అది పొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు మెల్లమెల్లగా కాగుతుండేది. కుండకు ఒక శిబ్బి (మేదరి వాళ్లు అల్లినవి) అడ్డంగా మూత మాదిరి పెట్టేది. మొత్తం దాలిపైన సందులుగా కట్టెతో చేసిన తలుపుతో మొత్తం దానిని మూసేది. దానిని దాలిపైన ఉండే జాలి అని పిలిచేవారు. అది ఒక కట్టె కిటికిగా ఉండేది. పాలు పొంగి, మెల్లమెల్లగా కాగుతుండేవి. వేడి మాత్రం శిబ్బి నుండి బయటకు పోయేది. మధ్యాహ్నం పాలు గోధుమ రంగు వచ్చేంత వరకు కాగిన తర్వాత, తీసేసి చల్లార్చి తోడు పెట్టేవారు. ఈ కుండను ఉట్టిమీద పెట్టేవారు. పాలమీది మీగడకు ఒక అద్భుతమైన రుచి, పెరుగైన తర్వాత కూడా ఈ మీగడ మరొక రకమైన రుచినిస్తుంది. పాలు కాగిన తరువాత వాటినే తోడుకని వేరే కుండలో పోసినప్పుడు వేడికి అడుగంటిన పాలు గోధుమ రంగుతో కుండకు అతుక్కుపోయి ఉండేది. దాన్ని కైశిప్ప (కష్కే)తో రాకి తీసిన దాన్ని గోకు అనేవారు. కొన్ని చెంచాలు మాత్రమే వచ్చే దీన్ని చెక్కరలో కలుపుకొని పిల్లలు తినేవారు.


నల్ల తుమ్మ చెట్ల పొదలలో పూసిన పసుపు పచ్చని పువ్వులు ఇంటి చుట్టూ ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ పాకిన కట్లె పూవులు, గన్నేరు, మల్లె, ఆకాశ మల్లెపూలు వాటి వాసన అద్భుతంగా ఉండేది. బంతిపూలు, చామంతి, నందివర్ధన పూవులు, గునుక, తంగేడు, మందారం తదితర పూవులు బతుకమ్మ పండుగ నాడు ప్రతి ఇంట్లో చేరేవి. గునుక పూవులకు రకరకాల రంగులు వేసి వరుసలుగా పేర్చి వాటి మధ్యన తంగేడు ఇతర పూవుల వరుసలతో గండ్రంగా బతుకమ్మను పేర్చేవారు. ఊరిలో ఎవరి బతుకమ్మ పెద్దది అనే చర్చ కొన్ని రోజులు నడిచేది. సద్దుల బతుకమ్మనాడు ఊరి చెరువులో బతుకమ్మలను విడిచేవారు. ఈ పండుగనాడు మహిళలు దాదాపు అన్ని కులాలవారు కలిసిమెలిసి గుండ్రంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడడం చరిత్రాత్మకం. చివరగా అందరూ తెచ్చుకున్న పిండివంటల పంపకాలు ఆహ్లాదకరంగా ఉండేది. ఈ పండుగలు తెలంగాణా వారు ఎక్కువ ఉన్న ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కూడా జరుగుతుండేవి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా దీని ప్రచారం ఎక్కువై ప్రపంచంలోని చాలా దేశాల్లో బతుకమ్మ ఆటలు మహిళలు ఆడి–పాడి ప్రత్యేక తెలంగాణా ఆకాంక్షను తెలియజేశారు. నేలరాలిన మోదుగు పూవులను ఏరుకొని రంగులను తయారు చేసుకునేవారం. ఇప్ప పూవులను ఏరుకునేవారం. కొన్నిసార్లు వేకువజామున గ్రామ ప్రజలు, మహిళలు ఇప్ప పూవులను ఏరుకునే సందర్భంలో ఎలుగుబంట్ల దాడులకు గురయ్యేవారు. మల్లెపూలల్లో బొడ్డుమల్లె, సన్నజాజి మల్లె ఇంకా రకరకాల మల్లె పూలను పిచ్చిగా ప్రేమించేవాడిని. వాటిని నా జేబులో వేసుకోవడం రాత్రి మంచంలో పరచుకోవడం, పడుకొని ఆకాశంలో నక్షత్రాలను, మేఘాలను, చంద్రుని చూస్తూ నిద్రలోకి జారుకోవడం దినచర్యగా ఉండేది. మా బాపు (నాన్న) తోట్లోకి పోయేటప్పుడు చేతిలో కర్రా, రూమి టోపీ పెట్టుకునేవాడు. ఇంటికి వచ్చిన తరువాత టోపీ తీస్తే అందులో దాచిన ఎన్నో మల్లెలు కిందపడితే వాటిని ఏరుకునేవారం, నవ్వుకునేవారం, మా నాన్నగారు కూడా సంతోషంగా ఉండడం అప్పుడే చూసేది. మా నాన్నగారితో కలిసి ఉండే క్షణాలు అసలు జ్ఞాపకమే లేవు. ఎప్పడూ దూరంగానే ఉండేది. పూజ చేసుకుంటున్నప్పుడు మాత్రం మేము ముందర కూర్చుండేవారం. వారు కళ్ళు మూసుకొని జపం చేస్తున్నప్పుడు మేము కళ్ళు తెరుచుకొని కొబ్బరి ముక్కలు చెక్కర కలిపిన పలహారం వైపు చూస్తుండేవారం. మాకు పలహారం పెట్టిన తరువాత పరుగు తీసేవారం. నాకు ఒక చిత్రమైన ఆలోచన ఉండేది. మా నాన్న ఎప్పుడైనా పనిమీద ఏదైనా ఊరికి పోతారా అని ఎదురుచూసేవారం. ఆనాడే మాకు ఆడినంత ఆట, పాడినంత పాట.

చెన్నమనేని విద్యాసాగర్‌రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌

(స్వీయచరిత్ర ‘ఉనిక’ నుంచి)

Updated Date - Dec 29 , 2024 | 12:18 AM