Share News

వందేళ్ల నల్గొండ ఆర్యసమాజ్

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:26 AM

దేశంలో అనేక సంఘ సంస్కరణలు ఆర్యసమాజ్ కేంద్రంగా అమలయ్యాయి. సాధారణ ప్రజల్లోనూ మూఢనమ్మకాలు, అసాంఘిక కట్టుబాట్లపై ఆర్యసమాజ్ కేంద్రంగా పలు ఉద్యమాలు జరిగాయి. ఆర్యసమాజాన్ని 1875 ఏప్రిల్ 10న బొంబాయి...

వందేళ్ల నల్గొండ ఆర్యసమాజ్

దేశంలో అనేక సంఘ సంస్కరణలు ఆర్యసమాజ్ కేంద్రంగా అమలయ్యాయి. సాధారణ ప్రజల్లోనూ మూఢనమ్మకాలు, అసాంఘిక కట్టుబాట్లపై ఆర్యసమాజ్ కేంద్రంగా పలు ఉద్యమాలు జరిగాయి. ఆర్యసమాజాన్ని 1875 ఏప్రిల్ 10న బొంబాయి (ముంబాయి)లో మహర్షి స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. హిందూ ధర్మాన్ని అన్ని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే ఆర్య సమాజం ముఖ్య ఉద్దేశం. ముంబాయిలో ప్రారంభమైన సుమారు 50 ఏళ్ల అనంతరం, నల్లగొండ పట్టణంలో 1924లో ఆర్యసమాజాన్ని షేర్ బంగ్లాలో ప్రారంభించారు.

నల్లగొండలో జరిగిన నిజాం విముక్తి పోరాటంలో ఆర్య సమాజ్ ముందు వరసలో నిలిచింది. జిల్లాలోని ప్రముఖ కమ్యూనిస్టు యోధులైన ధర్మబిక్షం కూడా ఆర్యసమాజ్ బాధ్యులుగా ఉన్నారు. సంఘ సంస్కరణ, సమాజ పరివర్తన, హిందూ ధర్మ రక్షణలో కీలక పాత్ర వహించిన ఆర్య సమాజం విగ్రహారాధన, మూర్ఖపు మతాచారాలు, కుల, లింగ భేదాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అందరూ వేదాలు చదవాలని, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా చదువుకోవాలని పాఠశాలలు ఏర్పాటు చేసింది. మొట్టమొదటి ‘స్వదేశీ’ పదాన్ని వాడింది ఆర్య సమాజమే.

కుల దురాచారాలను వ్యతిరేకించే వారంతా కూడా అప్పట్లో ఆర్య సమాజాన్ని సమర్థించారు. కొమర్రాజు కోటేశ్వరరావు నల్లగొండలో ఆర్య సమాజాన్ని నడిపించడంలో గొప్ప పాత్ర పోషించారు. ఆర్య సమాజం షేర్ బంగ్లాలో ఉండేది. నల్లగొండ వాస్తవ్యులు బలిజ బొంతయ్యని హరిద్వార్ పంపి సంస్కృతం, వేదాలు చదివించి పండిత భద్రదేవ్‌గా నల్లగొండలో ఆర్య సమాజ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 1922లోనే గ్రంథాలయం కూడా స్థాపించి పుస్తక పఠనానికి అవకాశం కల్పించారు. ఆడపిల్లలకు స్కూల్ నడిచేది. వాళ్ళకు అక్కడ చదువుతో పాటు కర్రసాము, కత్తి సాము కూడా నేర్పేవారు. పండిత భద్రదేవ్, మాత వేదవతిలు కలిసి అనేక కార్యక్రమాలు చేసినారు.

1938లో ఆల్ ఇండియా ఆర్య సమాజ్ మీటింగ్ నల్లగొండలో పెద్ద ఎత్తున నిర్వహించారు. 1965లో బాలికల పాఠశాల కోసం చందాలు కలెక్ట్ చేసి (1943లో రామగిరిలో పులిజాల రంగారావు గారి దగ్గర కొన్నభూమిలో) గదులు కట్టించారు. మొదట కట్టినవి గవర్నమెంట్ బాయ్స్ హైస్కూలుకి ఇచ్చారు. తరువాత కట్టినవి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలుకి ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన దివంగత దోమలపల్లి యాదగిరి రావు ఆర్యసమాజానికి, ఆర్య సమాజం ఆధ్వర్యంలో పేదలకు విద్యను అందించేందుకు గాను ఈ కొనుగోలు చేసిన భూమిని దానం చేశారు. అదే భూమిలో నల్లగొండకు మేధావులనందించిన రామగిరి బాలుర, బాలికల పాఠశాలలను ఏర్పాటు చేశారు. వెంకట నారాయణ ప్రెసిడెంట్‌గా ఉండగా రామగిరిలో ఆర్య సమాజం మందిరం నిర్మితమైనది. శ్రీవిశ్వామిత్ర, మాతల ఆధ్వర్యంలో పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, సమావేశాలు, సత్సంగాల నిర్వహణ ప్రారంభమైంది. ఆర్యసమాజానికి కొమర్రాజు మురిదార్ రావు దాదాపు 20ఏళ్ల పాటు అధ్యక్షులుగా ఉండి విశేష సేవలందించారు. వీరి హయాంలో ఆర్య సమాజ్ భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడారు. అవసరమైతే న్యాయస్థానాలకు సైతం వెళ్లారు. కొన్నేళ్లుగా నిలిచిపోయిన, పాత బస్తీ ఆర్యసమాజ్ నుంచి రామగిరి ఆర్యసమాజ్ వరకు ప్రతీ దసరాకు జరిగే శోభాయాత్రను కొమర్రాజు మురళీధర్ రావు పునరుద్ధరించారు.

ఆ తరువాత బీద పిల్లలకు 5వ తరగతి దాకా పాఠశాల, కరాటే, వారం వారం యజ్ఞం, సమావేశాలు నిరంతరం జరిగేవి. ఫ్యూడల్ పాలనను వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం లోనూ ఆర్య సమాజం పాత్ర కీలక పాత్రనే పోషించింది. ఒకవైపు మత మార్పిడిలను కట్టడి చేస్తూనే మరోవైపు సాంఘిక దురాచారాలను రూపు మాపడంలో ఆర్య సమాజం కృషి చేసింది. నల్లగొండలో ప్రతి దసరాకు షేర్ బంగ్లా ఆర్య సమాజం నుంచి రామగిరి ఆర్య సమాజ మందిరం దాకా ఒక నగర ప్రముఖుడిని గుర్రంపై ఆసీనులు చేయించి శోభాయాత్ర నిర్వహిస్తారు. అదొక గొప్ప వేడుకగా నిలిచింది.

నల్గొండ ఆర్యసమాజ్ శత జయంతి ఉత్సవాలను మార్చి 1, 2, 3 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా స్వామి రాందేవ్ బాబా హాజరుకానున్నారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్య సమాజం వ్యవస్థాపకుడు మహర్షి దయానంద సరస్వతి ద్విశత జన్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. మహాసభల ప్రారంభం రోజున తలపెట్టిన చారిత్రాత్మకమైన మహాయజ్ఞంలో స్వామి ప్రణావానంద సరస్వతి పాల్గొననున్నారు.

కన్నెకంటి వెంకట రమణ

(నేటి నుంచి నల్గొండ ఆర్యసమాజ్ శత జయంతి ఉత్సవాలు)

Updated Date - Mar 01 , 2024 | 05:26 AM