Share News

కులగణన దుష్ప్రచారాలూ, అసలు నిజాలు!

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:19 AM

గత 77 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎవరు లబ్ధి పొందారు, బడుగు బలహీన వర్గాల బతుకులు ఎంతవరకు బాగుపడ్డాయి అనే విషయం కుల గణన ద్వారా తేటతెల్లమవుతుంది. దాన్నిబట్టి...

కులగణన దుష్ప్రచారాలూ, అసలు నిజాలు!

గత 77 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎవరు లబ్ధి పొందారు, బడుగు బలహీన వర్గాల బతుకులు ఎంతవరకు బాగుపడ్డాయి అనే విషయం కుల గణన ద్వారా తేటతెల్లమవుతుంది. దాన్నిబట్టి తగు ప్రణాళికలను రచించి వేల ఏళ్ళుగా అన్ని రంగాల్లోనూ అణగదొక్కబడిన బలహీనవర్గాలకు సామాజిక న్యాయం అందించడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ఓబీసీ సంఘాలు, కుల గణన మద్దతు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు. ఈ దేశ పాలనలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు.

కాని కొందరు కుల గణన వ్యతిరేకులు అనేక దుష్ప్రచారాలు కొనసాగిస్తూ కుల గణనకు అడ్డుపడాలని చూస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కపై ‘పిచ్చి కుక్క’ అన్న ముద్ర వేయాలి అని సామెత. కొందరు ఈ పద్ధతిలోనే తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దుష్ప్రచారాలను ఖండించేందుకు కొన్ని వివరణలు అవసరమని బీసీ ఇంటెలెక్చువల్‌ ఫోరమ్ భావిస్తున్నది.


కులగణన కష్టమైనది, పరిపాలన దృష్ట్యా సాధ్యం కానిదీ అన్న ప్రచారంతో పాటు, ఇదే వాదనతో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ 841/2021 దాఖలు చేసింది. కుల గణన కష్టమైనది కాదు, క్లిష్టమైనది అంతకంటే కాదు. ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యాలు లేని కాలంలో నిరుపేద, నిరక్షర, బానిస భారతదేశంలో బ్రిటిష్‌వారు, మన రాష్ట్రంలో నిజాంవారు, 1881 నుంచి 1931 వరకు అన్ని కులాల గణన ప్రతి పదేళ్ళకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కలలో భాగంగా సేకరించారు. అది ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కష్టం అవుతుందా? ఈ వాదన సరైంది కాదు. ఇప్పటికే సెన్సస్‌లో ఎస్సీ, ఎస్టీ కులాల వివరాలు సేకరిస్తున్నారు. అందులో ఓబీసీ కేటగిరీ కాలమ్ చేర్చితే సరిపోతుంది. అదేవిధంగా సరి ఐన శిక్షణ ఇచ్చి, తగు ఫార్మాట్‌లు అభివృద్ధి చేస్తే ఈ దేశంలోని సుమారు 6000 ఓబీసీ కులాల లెక్కలు సేకరించడం అసాధ్యమేం కాదు.

కులగణన - హిందూ సమాజాన్ని విభజిస్తుందీ, కులతత్వం పెంచుతుందీ అన్న ప్రచారంలోనూ వాస్తవం లేదు. భారతీయ సమాజం, ముఖ్యంగా హిందూ సమాజం, గత మూడు వేల సంవత్సరాలుగా కులాల పేరుతో, వర్ణాల పేరుతో విడిపోయే ఉన్నది. కొత్తగా విడిపోయేది ఏమీ లేదు. ఈ వర్ణాలూ కులాలూ అగ్రవర్ణాలు తమ ఆధిపత్యం కొరకు సృష్టించినవే, శూద్రులనూ అతిశూద్రులనూ అణచివేయడానికి ఏర్పాటు చేయబడినవే. కావున ఈ వాదనలో పసలేదు.


ఓబీసీలు ఒక రాష్ట్రంలో బీసీలుగానూ, మరొక రాష్ట్రంలో ఎస్సీలుగానూ లేదా ఎస్టీలుగానూ ఉన్నారు కాబట్టి ఈ సంక్లిష్టతపై ముందు అధ్యయనం చేయాలని కొందరు అంటున్నారు. జన గణన (సెన్సెస్)లో 1234 ఎస్సీ, 698 ఎస్టీ కులాల లెక్కలు సేకరిస్తారు. మన రాష్ట్రంలో లంబాడాలు ఎస్టీలు, కానీ పక్కన మహారాష్ట్రలో ఓబీసీలు; మన రాష్ట్రంలో రజకులు ఓబీసీలు, కానీ బిహార్‌లో ఎస్సీలు; మహేంద్ర (మేదరి) కులంవారు తెలంగాణలో బీసీలు, కర్ణాటకలో ఎస్టీలు, మహారాష్ట్రలో ఎస్సీలు. మరి ఇలా ఉన్నా సరే ఎస్సీ, ఎస్టీల లెక్కలు సేకరించడం లేదా?

--కుల గణన వలన రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుంది అన్నది మరికొందరి వాదన. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాలు 15 శాతం ఉండగా, అందులో 5 శాతం కూడా లేని అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్‌ పేరిట విద్యా ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ దేశ మూలవాసులైన ఓబీసీలు 60శాతం ఉంటే వారికి 27శాతం కేవలం విద్య, ఉద్యోగాలలో ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. చట్టసభలలో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థలలో 50శాతం సీలింగ్‌కు లోబడి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగిలితే బీసీలకు ఇవ్వాలి.


రిజర్వేషన్ల వలన మెరిట్‌కు అన్యాయం జరుగుతున్నదన్న వాదనకు వస్తే– మెరిట్ అనేది సాపేక్షిక అంశం. అనాదిగా అగ్రవర్ణాలు వర్ణ వ్యవస్థలో రిజర్వేషన్లు అనుభవించలేదా? బ్రాహ్మణులు పౌరోహిత్యం, వేద పురాణాలు పఠించడం, గురువుల పాత్ర వహించడం చేయలేదా? క్షత్రియులు రాజరికం, వైశ్యులు వ్యాపారం చేయగా, శూద్రులు కేవలం వారికి సేవలు చేసే బానిస వర్గాలుగా మార్చబడలేదా? విద్యలు నేర్చిన శూద్రులకు ఎలాంటి గతి పట్టించారో తెలియడానికి పురాణాలలోని ఏకలవ్యుడు, శంభూకుని కథలు మనకు కనిపించవా! ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలల్లో తల్లిదండ్రుల ప్రోత్సహంతో లక్షలు ఖర్చుపెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివినవారికీ, అరకొర వసతులు గల ప్రభుత్వ పాఠశాలల్లో మాతృభాషలో చదివినవారికీ మధ్య పోటీ ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారతదేశంలో గత 77ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. మరి మన దేశం అభివృద్ధి పథంలో పయనించడం లేదూ? రిజర్వేషన్లు శాస్త్ర, న్యాయ, ఉన్నత వైద్య, టీచింగ్ రంగాలలో ఎక్కడున్నవి? ప్రైవేటు రంగంలో ఎక్కడ ఉన్నవి? కేవలం కొన్ని విద్యా, ప్రభుత్వ ఉద్యోగ, రాజకీయ రంగాలలో కల్పిస్తేనే ప్రతిభ (మెరిట్) దెబ్బతింటుందా? మరి మీ ఈడబ్ల్యూఎస్‌ మెరిట్ ఏమిటి? బీసీల కంటే తక్కువ లేదా? తమిళనాడులో విద్య ఉద్యోగాలలో ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మరి అక్కడ ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ కుప్పకూలిందా? తమిళనాడు మిగతా రాష్ట్రాల కంటే అన్ని రంగాలలో ముందు లేదా?


ఈ దేశంలో కుల వ్యవస్థ రూపుమాయాలంటే, హిందువులందరూ ఏకం కావాలంటే, అనాదిగా అణగదొక్కబడిన ఓబీసీ (శూద్ర) వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వారిని ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేలాగా అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది, కులరహిత సమాజం ఏర్పాటు సుగమమవుతుంది, రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం అందరికీ అందుతుంది, రాజ్యాంగ నిర్మాతల కలలు నెరవేరుతాయి.

కులం అనేది విదేశీయుల కుట్ర అన్న వాదన ఒకటి ప్రస్తుతం పైకి వస్తున్నది. ఇది కూడా శుద్ధ అబద్ధం. ఋగ్వేద కాలం నుండి ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నది. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రజాపతి శిరస్సు నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించినట్లు శ్లోకం లేదా? మనుస్మృతిలో శూద్రులను ఏ విధంగా అణగదొక్కాలో వివరించబడలేదా? ఈ దేశంలో గత వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ వర్ణ వ్యవస్థకు వృత్తులు తోడై కుల వ్యవస్థ ఏర్పడి ఉండవచ్చును. కేస్ట్‌ అనే పదం పోర్చుగీస్‌ పదం కావొచ్చు, కానీ ఇది ఉత్తర భారతదేశంలోని జాతి పదానికి సమానంగా వాడటం జరిగింది. తెలుగులో ఇదే కులంగా పిలవబడింది. ఈ దేశం పరాధీనంలో బతకడానికి, శూద్రులను అతిశూద్రులను క్రూరంగా అణచివేయడానికి, ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, మనస్మృతులే కారణం.


కుల గణన డిమాండ్‌ విదేశీ శక్తుల కుట్ర అని కూడా ఒక దుష్ప్రచారం జరుగుతున్నది. -భారతదేశం ప్రగతిని చూసి ఓర్వలేక విదేశీ శక్తులు ఈ దేశ సంస్కృతిని, సమైక్యతను, సమగ్రతను దెబ్బతీయడానికి పన్నిన పన్నాగమే కులగణన అనే ఈ ప్రచారం శుద్ధ అబద్ధం. ఇదే నిజమైతే బీజేపీ 2010 పార్లమెంట్‌లో 2011 సెన్సెస్‌లో కులగణన చేయాలని డిమాండ్ చేసి పార్లమెంటులో తీర్మానం ఆమోదానికి అనుకూలంగా ఓటు వేయలేదా? ఆగస్టు 31, 2018న పార్లమెంటులో ఆనాటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2021 సెన్సెస్‌లో కులగణన చేస్తామని ప్రకటించలేదా? వారు విదేశీ శక్తుల ప్రభావానికి లోనయ్యే ఈ ప్రకటన చేశారా?

పై దుష్ప్రచారాలు, అవాస్తవాలూ, వితండవాదనలూ అన్నీ కులగణనను అణగదొక్కేందుకు కుట్రలే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకున్నదే తడవుగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అడగకుండానే అగ్రవర్ణాలకు 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, జమిలి ఎన్నికల బిల్లు తీసుకువచ్చారు. కానీ వారికి కులగణన చేయడానికి మనస్సు లేక రకరకాల సాకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. 60 శాతం జనాభా ఉన్న ఓబీసీ ప్రజలకు ఈ దేశ పాలన వ్యవస్థలో భాగస్వామ్యం లేనప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశం కాబోదని గుర్తెరగాలి. అంతా ఏకమై సమగ్ర కులగణనకు నినదించాలి.

టి. చిరంజీవులు

కన్వీనర్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ హైదరాబాద్

Updated Date - Dec 27 , 2024 | 06:19 AM