Share News

దక్షిణాదిని బీజేపీ గెలుచుకోగలదా?

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:25 AM

లక్షద్వీప్ సముద్ర తీరంలో విహారాలు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గుడులు, గోపురాల సందర్శన, ఆలయ సేవలు...! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రెండు నెలల్లో దక్షిణ భారతీయ...

దక్షిణాదిని బీజేపీ గెలుచుకోగలదా?

లక్షద్వీప్ సముద్ర తీరంలో విహారాలు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో గుడులు, గోపురాల సందర్శన, ఆలయ సేవలు...! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రెండు నెలల్లో దక్షిణ భారతీయ రాష్ట్రాలలో నాలుగుసార్లు విస్తృత పర్యటనలు జరపడం కేవలం యాదృచ్ఛికమేనా? ఉత్తర, పశ్చిమ భారత రాష్ట్రాలలో ఎన్నికల విజయాలలో బీజేపీ ఒక గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించి, సార్వత్రక ఎన్నికలలో సాధించే స్థానాల సంఖ్యా బలాన్ని మరింతగా పెంపొం దించుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు. ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఆందోళనకరంగా పెరుగుతున్న రాజకీయ అంతరాలను 2024 సార్వత్రక సమరం అంతమొందిస్తుందా?

2019 సార్వత్రక ఎన్నికలకు ముందు ‘యాక్సిస్ మై ఇండియా’ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తదుపరి ప్రధానమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా ఒక్క దక్షిణాది మినహా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అత్యధికులు రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోదీనే ఇష్టపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలలో 40 శాతం మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం 37 శాతం మంది మాత్రమే మద్దతునిచ్చారు. కర్ణాటకలో మటుకు మోదీకే ఎక్కువ మద్దతు లభించింది. ఆ రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలలో 25ను బీజేపీ కైవసం చేసుకున్నది. తెలంగాణలో బీజేపీ ఆశ్చర్యకరంగా నాలుగు స్థానాలను గెలుచుకున్నది. వింధ్య పర్వత శ్రేణులకు దిగువున ఉన్న మరే రాష్ట్రంలోనూ బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయింది.

కాలాన్ని లంఘించి 2024కి వద్దాం. త్వరలో మళ్లీ సార్వత్రక ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి దక్షిణాది రాష్ట్రంలోనూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది. కర్ణాటకలో దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (సెక్యులర్ )పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో అదే పార్టీని ‘తండ్రీ – తనయుడి’ కుటుంబ నిర్వహణ సంస్థగా బీజేపీ పదే పదే పరిహసించింది. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, ఆయన కుమారులకు పార్టీలో మళ్లీ కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా గతంలో వలే లింగాయత్ సామాజిక వర్గానికి మళ్లీ అధిక ప్రాధాన్యమిచ్చేందుకు బీజేపీ పూనుకున్నదని స్పష్టమయింది. యడ్యూరప్ప ఇప్పుడు అష్టపదులకు పైబడిన వయసున్న వృద్ధ నాయకుడు. అయినప్పటికీ మార్గదర్శక్ మండల్ పదవీ విరమణ నియమాలను ఆయనకు వర్తింపచేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సంసిద్ధంగా లేదు. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీకి ప్రజల మద్దతు పొందగల ఏకైక నాయకుడు యడ్యూరప్ప మాత్రమే.

కేరళ విషయానికి వస్తే గత సార్వత్రక ఎన్నికలలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటును కూడ గెలుచుకోలేకపోయింది. అయితే 12.9 శాతం ఓట్లను మాత్రం మూట గట్టుకున్నది. ఈ సారి కేరళలో తమ పార్టీ పదికి పైగా సీట్లను గెలుచుకోగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢంకా బజాయంచి చెబుతున్నారు. దీన్ని ఒక బడాయి మాటగా కొట్టివేసినప్పటికీ వామపక్షాలు–కాంగ్రెస్ ప్రాబల్య ద్విధ్రువ రాజకీయ రంగంతో ఒక ప్రభావశీల ప్రతిపక్షంగా రూపొందడం ద్వారా ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంపొందించుకునేందుకు బీజేపీ స్పష్టంగా ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. మరి, అధికారం కోసం తిరువనంతపురంలో తీవ్రంగా పోటీ పడుతూ, కేంద్రంలో జట్టు కట్టడంలో అసంబద్ధంగా లేదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటికీ సరైన ఉనికి లేని పార్టీగా మాత్రమే ఉన్నది. దేశంలో ప్రాంతీయ స్థాయిలో రెండు పార్టీల మధ్య నిజమైన పోరు జరుగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడులలో ఎవరు గెలిచినా గెలిచినవారి పక్షంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణలో బీజేపీ ఎదుర్కొంటున్న చిక్కులు మరింత తీవ్రమైనవి. గత సార్వత్రక ఎన్నికలలో ఆ రాష్ట్రంలో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకున్నది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. అయితే లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి కొత్త అవకాశాలు కల్పించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం నుంచి భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ కోలుకోకపోవడంతో బీజేపీ విజయాకాశాలు మెరుగుయ్యాయని చెప్పవచ్చు.

ఇక మిగిలింది తమిళనాడు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడమనేది బీజేపీకి పలు విధాల ముఖ్యం. ఎందుకంటే ఒక విశిష్ట రాజకీయ సంస్కృతి ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఆ విలక్షణ రాజకీయ సంస్కృతి బీజేపీ ప్రపంచ దృక్పథానికి సైద్ధాంతిక సవాళ్లను విసురుతోంది. ఉదాహరణకు ఇటీవల ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని’ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలనే తీసుకోండి. తమ ఓటు బ్యాంకును మరింతగా పటిష్ఠం చేసుకోవడంతో పాటు బీజేపీ హిందూత్వకు తమ బ్రాహ్మణేతర ద్రావిడియన్ గుర్తింపును దీటుగా నిలబెట్టడమే ఉదయనిధి లక్ష్యం. ద్రావిడ రాజకీయ సంస్కృతి ప్రకారం బీజేపీ రాజకీయాలు అగ్రవర్ణ బ్రాహ్మణ హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించేవి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో సామాజిక న్యాయం అసాధ్యమని, ఆ భావనకు బీజేపీ రాజకీయాలలో తావులేదని డీఎంకే విశ్వసిస్తోంది.

హిందూత్వ వ్యతిరేక, బ్రాహ్మణ వాద విరుద్ధ ద్రావిడ ఉద్యమ సైద్ధాంతిక దృక్పథం కాల పరీక్షకు నిలిచి గెలిచింది. అయితే క్రమంగా కొత్త తరాలు కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రాజకీయాలలోకి ప్రవేశించిన 39 ఏళ్ల ఐపీఎస్ అధికారి కె.అన్నామలై ఈ కొత్త మార్పులకు ఒక నిదర్శనం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుగా ‘కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా’ ఆయన పోరాడుతున్నారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 100 రోజుల యాత్ర రాష్ట్ర రాజకీయాలో మౌలిక మార్పులను తీసుకురాలేదుగానీ రాష్ట్రంలో బీజేపీ మనుగడను సుస్థిరం చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె జయలలిత మరణానంతరం అంతర్గత కుమ్ములాటలతో కూలిపోయిన తరుణంలో అన్నామలై బీజేపీకి ఎనలేని ప్రాధాన్యాన్ని సాధించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో సీట్లు పెద్దగా రానప్పటికీ 20 శాతానికి పైగా ఓట్లను బీజేపీ గెలుచుకోగలదని ఇటీవల ఒక సర్వేలో వెలువడడం గమనార్హం.

దక్షిణాది రాష్ట్రాలలో అధికారాన్ని స్వాయత్తం చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ వలే అఖిల భారత రాజకీయ పక్షంగా ఆవిర్భవించాలని ఆ పార్టీ ఎంత ప్రగాఢంగా ఆకాంక్షిస్తుందో స్పష్టం చేస్తున్నాయి. సంఘ్ పరివార్ రాజకీయంగా, సైద్ధాంతికంగా ఒక సహనశీల దృక్పథాన్ని అలవరచుకునేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. ‘ఒకే జాతి, ఒకే నాయకుడు, ఒకే మతం’ అన్న విశ్వాసం నుంచి సంఘ్ పరివార్ దూరం జరగడానికి ఇది తప్పక దోహదం చేస్తుంది.

లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గెలిచినప్పటికీ బీజేపీ మూలాలు ఇప్పటికీ ఉత్తర భారతావని హిందీ–హిందూ– హిందుస్థాన్ రాజకీయాలలో ఉన్నాయి. కర్ణాటకతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ జయపతాక ఎగురవేయాలంటే బహుళ సంస్కృతులకు ప్రాధాన్యమిచ్చే భారతీయ నాగరికతా ధర్మం వర్ధిల్లేందుకు మరింత సమ్మిళిత ప్రపంచ దృక్పథాన్ని బీజేపీ అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. హిందూత్వ జాతీయ వాదం తమిళ ఉప జాతీయ వాదంతో సర్దుబాటు చేసుకొని దానికి స్థానం కల్పిస్తుందా? కొత్త పార్లమెంటు భవనంలో ఒక సెంగోల్ (రాజదండం)ను ప్రతిష్ఠించడమనే ప్రతీకాత్మక చర్యకు మాత్రమే పరిమితం కాకుండా హిందీ భాషను దేశ ప్రజలు అందరిపై ఏ విధంగాను రుద్దకుండా భాషా వైవిధ్యాన్ని గుర్తిస్తుందా?

మరీ ముఖ్యంగా అధికార కేంద్రీకరణకు ఆరాటపడే ఢిల్లీ పెత్తందారీ ధోరణులను విడనాడి సమాఖ్య పాలనా విధాన స్ఫూర్తికి బీజేపీ చిత్తశుద్ధితో నిబద్ధమవ్వాల్సిన అవసరమున్నది. తద్వారా మాత్రమే దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ రాజకీయ పురోగతి సుసాధ్యమవగలదు. ఆర్థిక వనరులను కేటాయించడంలో తమ రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని దక్షిణాది ముఖ్యమంత్రులు తరచూ చేస్తున్న ఫిర్యాదులను నిష్పాక్షికంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల ప్రయోజనాల నిమిత్తమే ఆ ముఖ్యమంత్రులు అలా మాట్లాడుతున్నారని కొట్టి పారవేయడం వల్ల ఆ ఫిర్యాదులు సమసిపోవు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుపరిచిన పాపానికి, భవిష్యత్తులో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించే అసంబద్ధ చర్యలకు ఎట్టి పరిస్థితులలోను పాల్పడకూడదు. నిజమేమిటంటే అక్షరాస్య, విద్యా సంపన్న, ఆర్థికంగా అభివృద్ధి చెందిన, సామాజికంగా ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే ‘వికసిత’ సమాజాలుగా వర్థిల్లుతున్నాయి. విశాల భారతదేశంలోని ఇతర రాష్ట్రాలూ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరేందుకు దృఢ సంకల్పంతో, పటిష్ఠ కార్యాచరణతో ముందడుగు వేయాలి.

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Mar 08 , 2024 | 01:25 AM