Share News

స్వయంకృతాపరాధాల అంపశయ్యపై బీఆర్‌ఎస్

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:47 AM

aకాల పరిణామ క్రమంలో బీఆర్‍ఎస్ పార్టీ ఉత్థాన పతనాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఉంది. నిజాం పరిపాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని...

స్వయంకృతాపరాధాల అంపశయ్యపై బీఆర్‌ఎస్

aకాల పరిణామ క్రమంలో బీఆర్‍ఎస్ పార్టీ ఉత్థాన పతనాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఉంది. నిజాం పరిపాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ఏ వర్గాలైతే దోచుకుని నిర్బంధానికి లోనుచేసి తీవ్ర అణచివేతకు పాల్పడ్డాయయో అవే ఆధిపత్య వర్గాలు 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోకి ఖద్దర్ తొడుక్కొని ప్రవేశించాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఆ వర్గాలే తిరిగి అధికార పీఠాన్ని అధిరోహించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక అసంతృప్తులు తీవ్ర రూపం దాల్చి దఫదఫాలుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి.

ప్రజాస్వామ్యంలో కనబడని హింస, విధ్వంసం దశాబ్దాలుగా కొనసాగింది. ఇటువంటి పరిస్థితులలో 1970 దశకంలో ఉత్తర తెలంగాణలో ఒక నిప్పురవ్వ అంటుకుంది. ప్రజాపోరుగా మొదలైన నక్సలైట్ ఉద్యమం జ్వాలా తోరణంలా అల్లుకుపోయింది. ముందెప్పుడూ కనీ వినీ ఎరుగని స్థాయిలో పీడితుల ఆక్రోశం హోరుగాలి వలె తెలంగాణ భూస్వామ్య వర్గాలను చుట్టుముట్టింది. ఆ కాలంలో తెలంగాణ ప్రజలపై రాజ్య హింస అనేక రూపాల్లో కొనసాగింది. వందలాది గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. వేలాదిమంది బహుజన యువకులు ప్రజా ఉద్యమంలో చనిపోయారు. ఒకవైపు రాజ్యం అణచివేత, నిర్బంధం; మరోవైపు అజ్ఞాతంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమాల మధ్య సామాన్యులు నలిగిపోయారు. అనేకమంది తీవ్ర నిర్బంధాన్ని అనుభవించారు. భూస్వాములు, ప్రజా పీడకులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, నగరాలకు పారిపోయారు.


అదిగో అటువంటి పరిస్థితుల్లో వామపక్షవాదుల వెన్నుదన్నుతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరోసారి పురుడు పోసుకున్నది. మేధావులు, కవులు, రచయితలు కలిసి చీమల పుట్టలా కట్టిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలోకి క్రమంగా రాజకీయ నాయకులు నాగుపాముల్లా చొరబడ్డారు. ఆవు తోలు కప్పుకున్న పులి లాంటి తెలంగాణ రాష్ట్ర సమితి అవతరించింది. తదనంతర పరిణామాలు, అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో వెలగపెట్టిన పాలనా విధానాలు తెలంగాణ ప్రజలకు కటిక చేదుజ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

ఇది ఒక్కరోజులోనో, సంవత్సరం లోనో, దశాబ్ద కాలంలోనో జరిగిన రాజకీయ వైపరీత్యం కాదు. 2001లో కొండా లక్ష్మణ్ జలవిహార్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైన నాటి నుంచి కేసీఆర్ మార్క్ రాజకీయం చాపకింది నీరులా కొనసాగుతూనే వచ్చింది. అప్పుడు ఉన్నవారు 2002 కరీంనగర్ సభలో లేరు. అనంతరం జరిగిన సభలలో నికార్సయిన తెలంగాణ వాదులు కేసీఆర్ అహంకారపూరితంగా ఎదుటి వారిని అవమానిస్తూ గాయపరుస్తున్న తీరును గమనించి ఒక్కొక్కరుగా దూరమైపోయారు. బహుశా కేసీఆర్ పరివారం కోరుకున్నది కూడా ఇదే! అలా క్రమ క్రమంగా తెలంగాణ ఉద్యమంలో అసలైన తెలంగాణ వాదులు కనుమరుగయ్యారు. అనంతరం కేసీఆర్ పైకి ఒకటి మాట్లాడుతూ లోపల కుట్రపూరితంగా తనదైన కుట్రపూరిత రహస్య ఎజెండాను అమలు చేశాడు.

కేసీఆర్ మాటలకు చాలామంది మేధావులు బోల్తాపడ్డారు. 2004 శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని టికెట్ల దందాకు తెర లేపాడు. జాగ్రత్తగా అవలోకిస్తే కేసీఆర్ ప్రతి ఎన్నికల సందర్భంలో ఇదే దృశ్యం కనబడుతుంది. మొదటి నుండి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలను గాలికి వదిలేసాడు. అవకాశం రాగానే నమ్మిన వారిని నట్టేట ముంచాడు. ఈ స్వభావం కేసీఆర్ వ్యక్తిత్వ నిర్మాణంలోనే దాగి ఉంది. ఆలె నరేంద్రని, ఆయన సహచరులను బయటకు పంపిన తీరులోనే చాలామంది అడిగేవారి పైన, ప్రశ్నించే వారి పైన తెలంగాణ ద్రోహులన్న ముద్ర వేసి పార్టీ నుంచి నెట్టి వేశాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని, దాని నాయకత్వాన్ని కనురెప్పలు ఉండగానే కనుగుడ్లు మాయం చేసినట్టు మోసం చేసిన తీరు అందరికీ తెలిసిందే.


2014 జూన్ 2 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి లోపలి అసురుడు అసలు రూపాన్ని అమలుపరిచాడు. తన హిడెన్ ఎజెండాను అమలుపరిచాడు. తమ వర్గాలకు మేలుచేసే విధంగా అనేక కాంట్రాక్టులు ఇచ్చాడు. అందరూ కలిసి తెలంగాణ సహజ వనరులైన పంచభూతాలను చెరపట్టారు. దానికి తోడు పార్టీలోకి బిడ్డ, కుమారుడు ప్రవేశించిన తర్వాత కుటుంబ పరిపాలన పట్టపగ్గాలు లేకుండా కొనసాగింది. ఈ పర్యంతం కేసీఆర్‌ను గాంధీ, మార్క్స్, మావో అని ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా కీర్తించిన అపర అవకాశవాద మేధావులు, వందిమాగద మహానుభావులు ఎందరో ఉన్నారు. అంతా కలిసి పదేళ్ల పరిపాలనలో ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారు. దొరికిన కాడికి బరికారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రవేశంతో వారు చేసిన నిర్వాహకాలతో టీఆర్‌ఎస్ పూర్తిగా ప్రతిష్ట కోల్పోయింది.

నేడూ ఆ పార్టీ దాదాపుగా అంపశయ్య మీదికి చేరింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీని ఒక్కొక్క నాయకుడూ వీడుతుంటే నాకు భారతంలోని స్వర్గారోహణ పర్వం యాదికి వస్తున్నది. ఇప్పుడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఒక విధంగా అలాగే ఉంది. బీఆర్‍ఎస్‌లో రోజురోజుకు బలపడుతున్న వాయుగుండం తుఫానుగా మారి ఏ తీరాన్ని దాటనుందో వేచి చూడాలి. కేసీఆర్ వెంట ఉన్నవారు చేయి దాటిపోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు ‘వచ్చేది మన ప్రభుత్వమే’ అని గుండె ధైర్యం చెడిపోయిన శాసనసభ్యులు, నాయకులు వేరే పార్టీలలో చేరకుండా రోజుకో పూట నీళ్ల మీద దెబ్బ కొట్టినట్లు మాట్లాడుతున్నారు.

తెలంగాణ ప్రజల్లో మాత్రం కేసీఆర్‌పై విశ్వాసం ఇప్పట్లో తిరిగి కోలుకోనంతగా సన్నగిల్లిపోయింది. రోజు రోజుకూ వారి పాలనలో చేసిన దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో ప్రజలు దీర్ఘాలోచనలో పడిపోయారు. కేసీఆర్ అండ్ పార్టీ ఎంతగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడినప్పటికీ అది ఉనుక మీది రోకండ్లలా అనిపిస్తుంది తప్ప మరో రకంగా ఇప్పట్లో ప్రతిధ్వనించే అవకాశం లేదు.

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

Updated Date - Apr 25 , 2024 | 02:47 AM