Share News

గుడ్డి కొంగలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:33 AM

నువ్వు ఊరికి పోయి 24 గంటలే గడుస్తోంది నాకు మాత్రం 24 వేల వత్సరాల కాలంగా తోస్తుంది ఇంట్లో వుంటే మన్మరాండ్ల సెలయేరు గల గల బడికి పోతే వరద తీసిన యేరులా వెలవెల...

గుడ్డి కొంగలు

నువ్వు ఊరికి పోయి

24 గంటలే గడుస్తోంది

నాకు మాత్రం 24 వేల

వత్సరాల కాలంగా తోస్తుంది

ఇంట్లో వుంటే మన్మరాండ్ల

సెలయేరు గల గల

బడికి పోతే వరద తీసిన

యేరులా వెలవెల

పొద్దున నిద్ర లేచి

టీచర్‌ కోప్పడ్డప్పుటిలా మొఖం పెట్టి

అమ్మమ్మ ఎప్పుడొస్తుంది అడుగుతారు

సాయంత్రం వచ్చి వాకిట్లో

నీ చెప్పులు లేక అమ్మమ్మ

ఇంకా రాలేదని నిరాశతో

చిన్నబుచ్చుకుంటారు

పైకి వాళ్లు మాట్లాడుతున్నారు

నేను లోన నీ గురించే సంభాషిస్తున్నాను

పూట పూటకు మాత్రలు?

అని ఎవరు పలకరిస్తారు

బీడుగా మారిన నేల గర్భంలో

తవుటం పెట్టి విత్తనం నాటి

నీళ్లనెవరు చిలుకరిస్తారు

ఇక తోవ నడువ

పాదాల తప్ప అడుగుల

చెయ్యి పట్టుకుని

చిన్నపిల్లాడిలా ఎవరు నడిపిస్తారు

జ్ఞాపకాలు కోల్పోయిన

మెదడు కరప్టు అయ్యి

పేరు సెల్‌ నంబర్‌ చిరునామా

మెడలో గుర్తింపు కార్డు వేలాడుతూ

తప్పిపోయిన ఆల్జీమర్స్‌

అతన్ని వెతికి నెవ్వారు

ఇంటికి తీసుకు వస్తారు

పొద్దుపోక చుట్టుపక్కల

ఇంటి తలుపు తడితే

అలల అలికిడి లేని

సముద్ర తీరంగా వుంది

కంగున మోగే రింగు సౌకర్యం

ఉంటే ఎంత బాగుండేది

ముక్కు మీద మక్కువగా వేలాడుతున్న

కండ్ల అద్దాలను దొరుకపట్టి ఎవరు ఇస్తారు

నువ్వు లేకుంటే ఊపిరి ఆడక బతుకు

బిక్క మొక వేసి కుమిలి ఏడ్సుంది

జీవిత ప్రయాణం ట్రాఫిక్‌ జామ్‌ లో

చిక్కుకుపోయి గిల గిల్లాడుతుంది

ఎక్కడి వారు అక్కడికి

ఎల్లలు దాటి ఎగిరి పోయాక

ఏ ఇంటిలోనైనా కనిపించే

ఒకే ఒక్క నిశ్చల సచిత్రం

గుడుగుక్కిన జంట గుడ్డికొంగలు

నొసట బస్వాన్ని ధరించిన జంగాలు

జూకంటి జగన్నాథం

Updated Date - Apr 08 , 2024 | 12:33 AM