Share News

అభివృద్ధి పటాటోపం వెనక అసమానతల కూపం!

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:50 AM

అంబానీ కుటుంబం వారి కుమారుడు అనంత్ అంబానీ కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన విలాసవంతమైన ప్రీ–వెడ్డింగ్ వేడుక వేడుక దృశ్యాలు ప్రధాన స్రవంతి టీవీ చానళ్ళు, సోషల్ మీడియా పుణ్యాన...

అభివృద్ధి పటాటోపం వెనక అసమానతల కూపం!

అంబానీ కుటుంబం వారి కుమారుడు అనంత్ అంబానీ కోసం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన విలాసవంతమైన ప్రీ–వెడ్డింగ్ వేడుక వేడుక దృశ్యాలు ప్రధాన స్రవంతి టీవీ చానళ్ళు, సోషల్ మీడియా పుణ్యాన దేశం మొత్తం గుడ్లప్పగించి చూసింది. మీడియా కథనాల ప్రకారం ఈ వేడుకకు ఫేస్‍బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్‌తో పాటూ దేశంలో అగ్రశ్రేణి నటులు, క్రికెటర్లు హాజరయ్యారు. అతిథులకు సంపన్నమైన గుడారాలలో విలాసవంతమైన వసతితో పాటూ 2,500 కంటే ఎక్కువ వంటకాలతో అద్భుతమైన ఆహార అనుభవాన్ని అందించారు. అతిథుల కోసం ప్రైవేట్ విమానాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం తాత్కాలికంగా జామ్‌నగర్‌ రక్షణ ఎయిర్‌పోర్ట్ పౌర విమానాల సేవలు అందించే ఎయిర్‌పోర్ట్‌గా రూపాంతరం చెందింది. ఈ మూడు రోజుల వేడుకకు అంబానీలు రూ.1259 కోట్లు వెచ్చించారని అంచనా. ఈ కార్యక్రమం భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన వేడుకలలో ఒకటిగా చెప్పొచ్చు.

దేశం అంతా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుక కోసం మాట్లాడుకుంటున్న సమయంలో వ్యాస రచయితకు ఒడిశా రాష్ట్రంలో బలంగీర్, కలహంది తదితర జిల్లాలలో జరుగుతున్న పెళ్లిళ్ల కథలు, అవి వెట్టికి దారితీస్తున్న పరిస్థితుల గూర్చి తెలుసుకునే ప్రత్యక్ష అవకాశం చిక్కింది. బలంగీర్ జిల్లా వాసి అయిన 56 ఏళ్ళ ఆదివాసీ మహిళ కుంతి... తన కొడుకు సదానందకు ఆరేళ్ళ క్రితం 3 లక్షల రూపాయల ఖర్చుతో పెళ్లి చేసింది. ఐతే పెళ్ళికి అయిన ఖర్చులో రూ.1.5లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. వడ్డీ 10శాతం, అంటే నెలకు రూ.15వేలు. కుంతి మాటల్లో చెప్పాలంటే ‘‘ఇప్పుడు ఐదేళ్ళ వయస్సు ఉన్న నా మనుమడి పెళ్లి సమయానికైనా కూడా ఈ అప్పు తీరుతుందన్న ఆశ లేదు.’’

ఈ పెళ్లి అప్పు తీర్చడానికి కుంతి కుటుంబం మొత్తం కలిసి గత ఏడాది ఆరు నెలల పాటు ఆంధ్ర లోని విజయనగరం జిల్లాకు ఇటుక బట్టీ కార్మికులుగా వలసకు వెళ్ళింది. అలా వలసకు వెళ్లినందుకు వారికి మనిషికి రూ.45వేల చొప్పున మొత్తం ముగ్గురికి కలిపి రూ.1.35లక్షలు ముట్టాయి. అంటే దాదాపు మనిషికి రోజుకు సగటున భోజన ఖర్చులు పోగా రూ.300 వేతనం లభించింది. కానీ కుటుంబం ఆరు నెలల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము పేరుకుపోయిన వడ్డీకి మాత్రం సరిపోయింది, అసలు అలానే ఉంది. కానీ ఆ ఇటుక బట్టీలలో పడిన కష్టాల చేదు జ్ఞాపకాలు మాత్రం ఆ కుటుంబంతో మిగిలిపోయాయి. పెళ్లిళ్ల కోసమే కాదు అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగు చేయించడానికి డబ్బు కావాలి కాబట్టి వలస మార్గాన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్యా తక్కువేమీ కాదు.

నిజానికి పైన మనం మాట్లాడుకున్న రెండు పెళ్ళిళ్ళూ దేశంలో ఉన్న రెండు భిన్న ప్రపంచాలను మనకు అద్దంలో చూపుతున్నాయి. నేడు మన దేశంలో వేడుకల కోసం వేల కోట్లు ఖర్చు చేయగలిగే కుటుంబాలు ఒక వైపు – ఇంట్లో చిన్న చిన్న అవసరాల కోసం దాదాపు వెట్టి చాకిరీ కూపంలోకి తోయబడుతున్న కుటుంబాలు మరొక వైపు కనిపిస్తున్నాయి.

స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో మునుపు ఎప్పుడూ లేనంతగా అసమానతలు పెరిగిపోయాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ పరిశోధకులు ఇటీవల వెలువరించిన పరిశోధనా పత్రం 'Income and wealth inequality in India'లో స్వాతంత్య్రం ముందు దేశంలో కంటే పేదలు – ధనికుల మధ్య ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయని నిర్ధారించారు. ఈ అంతరాలు దేశ సగటు ఆదాయంలో వాటా, సంపద విషయంలో వాటాలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్లు ఆ పరిశోధనా పత్రం తేల్చింది.

దేశ జాతీయ ఆదాయం 100 రూపాయలు అనుకుంటే అందులో సుమారుగా 60 రూపాయలు జనాభాలోని అగ్రశ్రేణి 10శాతం ప్రజల ఆదాయం కాగా, దీనికి విరుద్ధంగా దిగువన ఉన్న 50శాతం జనాభా ఆదాయం కేవలం రూ.15 మాత్రమే. అలానే దేశ పౌరుల సగటు ఆదాయం 100 రూపాయలు అనుకుంటే, భారతదేశంలో అగ్రశ్రేణి ఒక శాతం జనాభా ఆదాయం మాత్రం రూ.2,300 (అంటే జాతీయ సగటు ఆదాయం కంటే 23 రెట్లు ఎక్కువ). ఈ అంకెనే ఘోరం అనుకుంటే దేశంలో గల 10 వేల మంది ధనవంతుల సగటు ఆదాయం మాత్రం రూ.2,06,900. అంటే సగటు భారతీయుల కంటే వీరు 2,069 రెట్లు ఆదాయాన్ని సంపాదిస్తారు.

ఐతే ఈ ఆందోళన కలిగించే ధోరణలు కేవలం ఆదాయానికి పరిమితం కాదు, సంపద విషయంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరాలుగా దేశంలో సంపద కేంద్రీకరణ గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు, 1961లో దేశ సంపద రూ.100 అనుకుంటే, టాప్ 10శాతం జనాభా దగ్గర రూ.45 ఉండగా, 2023 నాటికి ఈ సంపద 65 రూపాయలకు పెరిగింది. అలానే ప్రస్తుతం భారతదేశంలో అగ్రశ్రేణి ఒక శాతం జనాభా సగటు సంపద జాతీయ సగటు కంటే 40 రెట్లు ఎక్కువ. అంటే సగటు భారతీయుడి వద్ద రూ.100 ఉంటే, అగ్రశ్రేణి ఒక శాతం జనాభా దగ్గర రూ.4000 ఉన్నాయి. అలానే అగ్రశ్రేణి ఒక శాతం జనాభా సంపద వాటా 1961 నుండి 2023 నాటికి మూడు రెట్లు పెరిగింది. ఇక 40శాతం గల మధ్యతరగతి ఆర్థిక సరళీకరణ తర్వాత గణనీయంగా నష్టపోయింది, దశాబ్దాలుగా వారి సంపద వాటా స్థిరంగా పడిపోతూ వచ్చింది.

దేశ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండీ అరకొరగా అయినా అమలు చేసిన సోషలిస్టు ఆర్థిక విధానాలు దాదాపు 1982 వరకూ పేద–ధనిక అంతరాలు కొంతమేరకైనా తగ్గడానికి కారణం అయ్యాయి. ఆ తరువాత పరిస్థితి తారుమారు అయ్యింది. ముఖ్యంగా 1990ల దశకం నుండీ దేశం అవలంబించిన ఆర్థిక సరళీకరణ విధానాలు అంతరాలను పెంచుతూ పోయాయని ఆర్థిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలానే ఉన్నత వర్గాలకి మాత్రమే నాణ్యమైన విద్య పరిమితం కావడం భారతదేశంలో ఆదాయ అసమానతలకు గణనీయంగా దోహదం చేస్తుంది. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో అధిక జనాభా మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలు ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడినప్పటికీ అవి అణగారిన వర్గాలు తమ వ్యక్తిగత సామర్థ్యాలతో సామాజిక–ఆర్థిక నిచ్చెన పైకి ఎగబాకడానికి అవకాశాలను పరిమితం చేస్తున్నాయి.

అలానే భారతదేశ ఆర్థిక వృద్ధి చాలా మటుకు సేవా రంగంలో సాధించినదే. ఐతే ఈ రంగం ఆదాయ అసమానతలను కూడా తీవ్రతరం చేసింది. ఎందుకంటే, శ్రామికశక్తిలో గణనీయమైన భాగానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయం, నిర్మాణం, తయారీ వంటి రంగాలలో వేతనాలు సేవల రంగంతో పోలిస్తే చాలా తక్కువ. అందువలన పేద-–ధనికుల మధ్య అంతరం మరింత పెరుగుతూ వస్తుంది.

అసమానతలు తగ్గించడానికి చేపట్టాల్సిన, చేపట్టగలిగే చర్యలు ఎన్నో ఉన్నాయి. సంపన్నులపై అధిక పన్నులు విధించే ప్రగతిశీల పన్ను విధానాలను అమలు చేయడం వల్ల సంపద, ఆదాయాన్ని మరింత సమానంగా పునఃపంపిణీ చేయవచ్చు. దేశంలో కేవలం అత్యంత 162 సంపన్న భారతీయ కుటుంబాల నికర సంపదపై కేవలం 2శాతం పన్ను విధిస్తే ప్రభుత్వాలు గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని ఆర్థికవేత్తలు సెలవిస్తున్నారు.

అధిక నాణ్యత గల విద్య, నైపుణ్యాల శిక్షణా కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం వలన వ్యక్తులు, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు చెందిన వారు మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు, సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగ భృతి, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత వంటి సామాజిక భద్రతా కార్యక్రమాలను బలోపేతం చేయడం వల్ల పేదలకు ఆర్థిక పరిపుష్టి లభించడమే కాక, ఆర్థిక మాంద్యం సమయంలో వారు పేదరికంలో లోతుగా పడిపోకుండా కాపాడుకుంటారు. తగిన కనీస వేతన ప్రమాణాలను అమలు చేయడం వల్ల కార్మికులు వారి శ్రమకు న్యాయమైన పరిహారం పొందడం జరిగి తద్వారా ఆదాయ అసమానతలు తగ్గుతాయి.

కులం, జాతి, లింగం, ఆర్థిక స్థితి ఆధారిత వివక్షను రూపుమాపడం కోసం కార్యక్రమాల రూపకల్పన, అమలు సమ సమాజాన్ని సృష్టించడానికి, వ్యక్తులందరికీ ఆర్థిక అవకాశాలకు సమాన ప్రాప్యతను నిర్ధారించడానికి కీలకమైనది. ఆదాయం–సంపదలలో తీవ్ర అసమానతలను రూపుమాపకపోతే అవి ఆర్థిక అస్థిరతకు దారి తీసి, సామాజిక ఐక్యతను నాశనం చేసే అవకాశం ఉంది, సామాజిక చలనశీలతకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా, సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉద్రిక్తతలకు, సామాజిక అశాంతికి, సంఘర్షణలకు దారితీస్తాయి. పౌరులందరికీ అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు కలిగిన సమసమాజ కల్పన మన రాజ్యాంగ ఆదర్శం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆర్థిక సమానత్వం కోసం కార్యక్రమాలు రూపొందించాలని పాలకులను నిలదీయడమే.

చక్రధర్ బుద్ధ

సీనియర్ పరిశోధకుడు, లిబ్‌టెక్ ఇండియా

Updated Date - Apr 09 , 2024 | 01:50 AM