Share News

ఉద్యమాల భూమిలో యుద్ధగీతిక

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:03 AM

ఆధునిక సామాజిక, రాజకీయ ఉద్యమాలను చూస్తే పాట నిర్వహించిన చరిత్రకు ప్రశస్తమైన పాత్ర ఉన్నది. జాతీయోద్యమ కాలాన బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ‘వందేమాతరం’, బంగ్లాదేశ్‌ ఆవిర్భావంలో...

ఉద్యమాల భూమిలో యుద్ధగీతిక

ఆధునిక సామాజిక, రాజకీయ ఉద్యమాలను చూస్తే పాట నిర్వహించిన చరిత్రకు ప్రశస్తమైన పాత్ర ఉన్నది. జాతీయోద్యమ కాలాన బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ‘వందేమాతరం’, బంగ్లాదేశ్‌ ఆవిర్భావంలో టాగూరు రాసిన ‘సోనార్‌ బంగ్లా’ పాటలు చారిత్రాత్మకమైన పాత్ర నిర్వహించాయి. సరిగా అదే పరంపరలోనిదే గాయకుడు, కవి అందెశ్రీ రాసిన పాట ‘జయ! జయ! జయహే తెలంగాణ!’ అన్నది. అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా యుద్ధగీతమై నిలిచింది. ఈ నేపథ్యంలో అందెశ్రీ తెలంగాణ సమాజం చవి చూసిన ఉద్యమాల భూమికలో వెలువడిన పాటల సంకలనాన్ని కూర్చి తానే సంపాదకత్వం వహించి నిప్పులవాగు (1940-2014) పేరుతో 1307 పేజీలతో బృహత్తర గ్రంథరాజాన్ని వెలువరించాడు. తెలంగాణ, తెలుగు సాహిత్యచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ గ్రంథానికి ముందు మాటలు రాసిన వారిలో ప్రముఖవిమర్శకులు అంబటి సురేంద్రరాజు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్‌ ఉన్నారు.


తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధునిక కవితా సంకలనాలు తెలంగాణ నుంచి వెలువడ్డాయి. నిజాం కాలం నాటి తెలంగాణలో గోలకొండ కవుల సంచిక వెలురించి సురవరం ఆనాటి కాలపు పురిటి నొప్పులను గ్రంథస్థం చేస్తే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చవి చూసిన భిన్న ఆలోచనా స్రవంతులను, వెవిధ్యమైన అభివ్యక్తి రూపాలను, అందులో ప్రచలితమైన ఆశయాలను, ఆదర్శాలను, ఆశ నిరాశ విషాధాలను ఈ సంకలనం నిక్షిప్తం చేసుకున్నది. పాటలు, వచన కవితల ఎంపికలో చరిత్రాత్మక దృష్టి ఉండడం వల్ల ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రతిఫలించింది. ఎందుకంటే అమరుల త్యాగాలను కీర్తించే గీతాలతోపాటు ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని విమర్శనాత్మకంగా చూసిన (నెగేషన్‌ ఆఫ్‌ నెగేషన్‌) గీతాలు కూడ ఈ సంకలనంలో ఉన్నాయి. 1940ల నుంచి రాష్ట్రం ఏర్పాటైన కాలం వరకు తెలంగాణ సమాజంలో పరివ్యాప్తమైన పరిస్థితులను, వైరుధ్యాలను తేటతెల్లం చేసే ఈ గ్రంథం పరిశోధకులకు ఒక కరదీపిక.


సాధారణంగా ఉద్యమ కవితా సంకలనాలలో ద్వేషం, కసి, హింసా ధోరణి ఉన్న రచనలు ఉండడం పరిపాటి. కాని అటువంటి పరిమితులను అధిగమించిన సంకలనమిది. దీనికి కారణం సంపాదకుడైన అందెశ్రీ వ్యక్తిత్వమే. జీవితం పట్ల చాలా సానుకూల దృక్పథం ఉన్న ఆయన సంపాదకత్వం వహించడమే. స్త్రీలతో పాటు గిరిజనులు, ఇతర భిన్నమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్న సంకలనమిది. గిరిజనులు, ముస్లింలు తెలుగులిపిని తీసుకుని వారి భాషలో రాసిన పాటలను చేర్చడం ద్వారా అందెశ్రీ తెలంగాణ అనేది బహుళ సాహిత్య, భాషా సంప్రదాయాలున్న సమాజమని తేల్చి చెప్పాడు. తెలంగాణ ఘనకీర్తిని, ప్రకృతి, పల్లెల జన జీవిత సౌందర్యాన్ని చిత్రించిన అందెశ్రీ తాత్వికతను అవగాహన చేసుకుంటే బెంగాల్‌ సమాజంపై అక్కడి ప్రకృతిని, ప్రశస్తిని విశదం చేస్తూ వందలాది పాటలను రాసిన టాగూరు గుర్తుక రాక మానడు.

సామిడి జగన్‌ రెడ్డి

85006 32551

Updated Date - Jun 24 , 2024 | 06:03 AM