వల విసురుతున్న కృత్రిమమేధ
ABN , Publish Date - Jan 18 , 2024 | 02:06 AM
ఒక కొత్త యంత్రమో పరికరమో రంగ ప్రవేశం చేసినపుడు దాని మంచీ చెడుల గురించి సమాజంలో చర్చ జరగడం సహజం. ఇటీవల ప్రాచుర్యంలోనికి వచ్చిన కృత్రిమ మేధ – ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మీద....
ఒక కొత్త యంత్రమో పరికరమో రంగ ప్రవేశం చేసినపుడు దాని మంచీ చెడుల గురించి సమాజంలో చర్చ జరగడం సహజం. ఇటీవల ప్రాచుర్యంలోనికి వచ్చిన కృత్రిమ మేధ – ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మీద అలాంటి చర్చ ఒకటి ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. తాము సేకరించి ప్రచురించిన సమాచార భాండాగారాన్ని ‘చాట్ జిపిటి’ తదితర ఏఐ వేదికల ప్రమోటర్లయిన ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ అనుమతి లేకుండా వినియోగించుకుంటున్నాయని విఖ్యాత మీడియా సంస్థ ‘న్యూయార్క్ టైమ్స్’ ఆరోపించింది. నష్టపరిహారంగా ఆ సంస్థలు తమకు భారీ మూల్యం చెల్లించాలని ఆ పత్రిక కోర్టులో దావా వేసింది. ‘న్యూయార్క్ టైమ్స్’ కేసు సాంకేతిక అభివృద్ధికి సంబంధించి అనేక పాత అంశాలతోపాటు కొన్ని కొత్త అంశాలనూ చర్చా వేదిక మీదికి తెచ్చింది.
ఏది మేధో సంపత్తి హక్కు అవుతుంది, ఏది కాదు? అనేవి చట్టానికీ, ఆర్థిక రంగానికీ సంబంధించిన అంశాలు. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఏర్పడినప్పుడు వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కుల మీద (ట్రిప్స్) సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చట్టాలే ఇప్పుడు అమల్లో వున్నాయి. అవే కృత్రిమ మేధకు కూడ వర్తిస్తాయి.
కృత్రిమ మేధ చాలా పనులు చేస్తుంది. మనం రోజుల కొద్దీ కసరత్తు చేసే పనుల్ని సెకన్లలో చేసి పడేస్తుంది. అదీ ఇదని కాదు ఏదైనా చేసేస్తుంది. మన గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్‌ని లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ పెయింటింగ్‌లా వేయమంటే వేసేస్తుంది. కాన్సెప్ట్, పాత్రలు, సన్నివేశాలూ ఇచ్చి ఒక స్క్రిప్టు రాయమంటే రాసేస్తుంది. ఎస్.ఎస్. రాజమౌళీ, స్పీల్‌బర్గ్ పాటించే చట్రంలో రాయమన్నా రాసేస్తుంది. బాయ్‌ఫ్రెండ్‌గా, గర్ల్‌ఫ్రెండ్‌గా ఎలా ఉండమన్నా అలా ఉంటుంది. కావాలంటే సెక్స్ కూడ చేస్తుంది. నమ్మకం కుదరకపోతే 2013 నాటి స్పైక్ జోన్జ్ సినిమా ‘హర్’ చూడండి.
అయితే, కృత్రిమ మేధ కొన్ని పనులు చేయదు. లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను యథాతథంగా నకలు చేసేయమంటే చేయదు. 1963 నవంబరు 22న అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్యకు గురైన సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును చూపించు అని అడిగితే చాట్ జిపిటి చూపదు. అలా చేయడం చట్ట విరుద్ధం అని కూడా యూజర్‌ను హెచ్చరిస్తుంది. అంతగా మీకు కావాలంటే ఆ రిపోర్టు సారాంశాన్ని చెపుతానంటుంది. ఏ నవల గురించి అడిగినా వెంటనే సారాంశాన్ని చెప్పేస్తుంది. అంతేగానీ, ఆ నవల కాపీ కావాలంటే ఇవ్వదు. అంచేత ఏఐని చట్టపరంగా తప్పు పట్టాల్సింది ఇక్కడ కాదు. దాన్ని ఎక్కడ తప్పు పట్టాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు మనిషికీ యంత్రాలకూ ఉన్న అనుబంధాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకుందాం.
సృష్టిలో ప్రతి జీవి తన సంతతిని సృష్టిస్తుంది. తన సంతతి మనుగడ కోసం ఆహారాన్ని సేకరించి పెడుతుంది. మనిషి అంతటితో ఊరుకోడు; సహజసిద్ధంగా ఆహారం దొరక్కపోతే తన సంతతి జీవికను కాపాడడానికి తనే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడు. దాని కోసం అనేక పనిముట్లను పరికరాల్ని సృష్టిస్తాడు. ‘మన అవసరమే సిసలైన సృష్టికర్త’ అన్నాడు గ్రీకు తత్వవేత్త ప్లేటో క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో. ‘అవసరమే ఆవిష్కరణలకు తల్లి’గా ఈ మాట స్థిరపడిపోయింది. 18వ శతాబ్దపు స్కాటిష్ ఆర్థిక శాస్త్రవేత్త ఆడమ్ స్మిత్ ఇంకో అడుగు ముందుకేసి ‘పనిముట్లు తయారు చేసే జీవి మనిషి’ అన్నాడు.
కొత్త యంత్రాలు ప్రవేశించినపుడు ఆయా వృత్తుల్లో సాంప్రదాయికంగా ఉంటున్నవారికి తప్పక ఇబ్బంది కలుగుతుంది. గ్రామాల్లోనికి ట్రాక్టర్లతోపాటు దున్నడానికీ, ఊడ్పులు – పంటకోతలకు మెషీన్లు ప్రవేశించినపుడు రైతు కూలీలు ఉపాధిని కోల్పోతారు. ఆ సమయంలో వారికి భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంది. దానికి పరిష్కారం ట్రాక్టర్లను, ఆధునిక వ్యవసాయ యంత్రాలను అడ్డుకోవడం కాదు. పాత ఉపాధిని కోల్పోతున్నవారికి కొత్త ఉపాధుల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలి. లేకుంటే, పునరావాసం కల్పించాలి. అయితే, ఇదంతా తాత్కాలికమే. క్రమంగా కొత్త టెక్నాలజీలో కొత్త ఉపాధి కలుగుతుంది. కంప్యూటర్లను ప్రవేశపెడుతున్న కొత్తలో ‘ఆఫీసుల యాంత్రీకరణ నశించాలి’ అంటూ ఉద్యోగులు నినాదాలు చేసేవారు. ఇప్పుడు ఆఫీసుల్లోనే కాదు ఇంట్లోనూ కంప్యూటర్లు వచ్చేశాయి. పిల్లల్ని బుజ్జగించడానికి చేతిలో ట్యాబ్‌లు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో ఐటీ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఐటీ అంటే సాఫ్ట్‌వేర్ విభాగం ఒక్కటే కాదు సెల్‌ఫోన్ రిపేరు కూడ అందులో భాగమే. ఈ పరిణామాల్ని మనం 1980ల ఆరంభంలో ఊహించలేదు. మళ్ళీ ఇప్పుడు కృత్రిమ మేధను చూసి అదే రకం భయం! ఏఐతో మానజాతి అంతరించిపోతుందనే వరకు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. అంతగా భయపడాల్సిన అవసరంలేదు. కొంతకాలం కొన్ని నిర్మాణపరమైన సర్దుబాట్లు వుంటాయి. అంతే.
కార్పొరేట్లు నిరంతరం తమ యంత్రాలను ఆధునీకరించుకుంటూ, ఉత్పత్తిని పెంచుకుంటూ, మార్కెట్‌ను విస్తరించుకుంటూ, ఫ్యాక్టరీలో తయారైన సరుకును ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ వుండాలి. అమ్మలేకపోతే, కార్పొరేట్లకు లాభాలు రాకపోగా పెట్టిన పెట్టుబడి కూడ తిరిగిరాదు. ఉత్పత్తిని అమ్మితీరాలనే నియమం వుంది కనుక పెద్ద సంఖ్యలో కొనుగోలుదారుల్ని, విస్తారమైన మార్కెట్‌ను కూడ కార్పొరేట్లే సృష్టించుకుంటూ వుంటారు. అప్పటి వరకు మానవ మనుగడకు ముప్పు వుండదు.
మనకున్న జ్ఞానం మొత్తంగా మనది కాదని మనకు చాలా స్పష్టంగా తెలుసు. అనేక మూలాల నుంచి మన మెదడులోనికి ముడి సమాచారం కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతుంటుంది. దాన్ని మన మెదడు రసాయన ప్రక్రియ ద్వారా వడగట్టి ఒక అవగాహనగా మార్చుతుంటుంది. అప్పటి నుంచి అది మన జ్ఞానంగా చెలామణీ అయిపోతుంటుంది. ఇది శరీరధర్మం. సరిగ్గా ఈ ప్రక్రియకు నకలుగానే ఆధునిక కంప్యూటర్లు ఆవిర్భవించాయి.
కంప్యూటర్లు ముడి సమాచారాన్ని ప్రాసెస్ చేసి సంస్కరించి సమాచారంగా మారుస్తాయి. ఇక్కడ సమాచారం అంటే సంస్కరింపబడిన, సూక్ష్మీకరింపబడిన ముడి సమాచారంగా భావించాలి. సమాచారమే దాని అంతిమ ఉత్పత్తి కనుక దాన్ని సమాచార సాంకేతికత అంటాం. చాలామంది టెకీలకు కూడ కంప్యూటర్ టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అని ఎందుకు అంటారో తెలీదు.
అయితే ఇక్కడో కీలకమైన ప్రక్రియ ఒకటి జరుగుతుంటుంది. బయటి నుండి వచ్చిన ముడి సమాచారాన్ని మెదడు ఒక అవగాహనగా మార్చే సమయంలో ఆ మనిషి సామాజిక ఉనికి కీలక పాత్ర పోషిస్తుంది. ‘మనుషుల ఉనికిని నిర్ణయించేది వారి చైతన్యం కాదు; తద్విరుద్ధంగా, మనుషుల సామాజిక ఉనికి వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది’ అన్నాడు కార్ల్ మార్క్స్. (“It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness”). సామాజిక ఉనికి చైతన్యాన్ని మార్చడానికి కృత్రిమ మేధను ఉపయోగిస్తారనేది ఒక అనుమానం. అలా చేయడం ఆచరణ సాధ్యమేనా అనేది అసలు ప్రశ్న.
గోరింటాకులో చర్మానికి ఎరుపు రంగును పూసే నిర్దిష్ట రసాయనాన్ని కనుక్కోగలిగితే దాన్ని ప్రయోగశాలల్లో కృత్రిమంగా సృష్టించవచ్చు. అప్పుడు గోరింటాకు పెట్టుకోకుండానే చర్మానికి ఎరుపు రంగు పూయవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి అలాగే జరుగుతుంది. మనిషి మెదడు పని విధానంలో అతని సామాజిక ఉనికి పాత్ర గురించి తెలిసిపోయాక మనుషుల ఆలోచనల్ని నియంత్రించడం సాధ్యం కావచ్చు. కృత్రిమ మేధ ‘చైతన్యం’లో కార్పొరేట్ల ప్రయోజనాల్ని ఇమిడ్చే ప్రమాదం వుంది. అంటే కృత్రిమ మేధ తనను సృష్టించిన వారికి అనుగుణంగా యూజర్స్‌ను వశీకరణం చేసే అవకాశం ఉంది.
పాలస్తీనా–ఇజ్రాయిల్ యుద్ధంలో రెండు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉనికిలో వున్నట్టు మనకు తెలుసు. మొదటిది, పాలస్తీనా పక్షం. రెండోది; ఇజ్రాయిల్ పక్షం. కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తిదారులు ఇజ్రాయిల్ అభిమానులయితే అది ఆ అభిప్రాయాలనే యూజర్స్ మెదడుల్లో జొప్పిస్తుంది. అప్పుడు కృత్రిమ మేధ అభిప్రాయాల్ని కూడా శంకించక తప్పదు. ఒక ప్రాయోజిత కార్యక్రమంగా లక్ష్య వ్యక్తి (Target Person) ఉపచేతన లోనికి చొరబడి మూలవ్యక్తి (Sponsor) ఆలోచనల్ని జొప్పించే ప్రక్రియను క్రిష్టోఫర్ నోలాన్ 2010 నాటి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఇన్సెప్షన్’లో మనం చూస్తాము. ఇప్పుడు నిజజీవితంలోనూ కృత్రిమ మేధ అలా చేస్తుంది. అంటే మనుషుల్ని హిప్నటైజ్ చేస్తుంది. అదీ అసలు ప్రమాదం.
డానీ
సమాజ విశ్లేషకులు