...ఇవన్నీ వైఫల్యాలేనా?
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:51 AM
సీపీఐ 99వ జన్మదినోత్సవాన ఆంధ్రజ్యోతిలో మిత్రులు చెరుకూరి సత్యనారాయణ వ్యాసం వచ్చింది. సారాంశం ‘‘భారతదేశంలో కమ్యూనిస్టులు సాయుధపోరాటంలో విఫలమయ్యారు.’’ ఇందులో వాస్తవం ఎంత? పరిశీలించడానికి ఇది సరైన సమయం....

సీపీఐ 99వ జన్మదినోత్సవాన ఆంధ్రజ్యోతిలో మిత్రులు చెరుకూరి సత్యనారాయణ వ్యాసం వచ్చింది. సారాంశం ‘‘భారతదేశంలో కమ్యూనిస్టులు సాయుధపోరాటంలో విఫలమయ్యారు.’’ ఇందులో వాస్తవం ఎంత? పరిశీలించడానికి ఇది సరైన సమయం.
అక్టోబర్ విప్లవం ఇచ్చిన ఉత్తేజంతో ప్రపంచంలో అనేక దేశాలలో లాగే భారత్‌లో కూడా 1925 డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెట్టిన అనేక ‘కుట్ర కేసుల్లో’ పార్టీ నాయకులు సుదీర్ఘ జైలుశిక్షలు అనుభవించారు. ప్రజాసంఘాలు ఏర్పాటు చేసి శ్రామికులు, రైతులు, మేధావులు, కళాకారులు, విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు నడిపింది. అనేక హక్కులు సాధించారు. విజయాలు సాధించారు. నేను వాటి వివరాల్లోకి వెళ్ళటం లేదు.
హైదరాబాద్ సంస్థానంలో సాయుధ పోరాటాన్ని సీపీఐ 1947 సెప్టెంబరులో ప్రారంభించింది. అది సోషలిస్టు విప్లవం కోసం ఇచ్చిన పిలుపు కాదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాం హైదరాబాదు సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తే, దానిని భారత యూనియన్‌లో విలీనం చేయాలని, వెట్టిచాకిరి రద్దు చేయాలని, భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలని పోరాటం జరిగింది.
సాయుధ పోరాటంలో లక్షలాది మంది పాల్గొన్నారు. 4500 మంది మరణించారు. ప్రధానంగా సాయుధ పోరాట ఫలితంగా యూనియన్ సైన్యాలు ‘పోలీసు యాక్షన్’ పేరుతో హైదరాబాదును స్వాధీనం చేసుకున్నాయి. నిజాం భారత యూనియన్‌లో విలీనమౌతున్నట్లు ప్రకటించాడు. తిరువాన్కూర్ కొచ్చిన్ సంస్థానంలో సీపీఐ సాయుధ పోరాటం నడిపింది. సంస్థానం రద్దయింది. భారత యూనియన్‌లో విలీనమైంది.
తెలంగాణ సాయుధ పోరాటం 1948 సెప్టెంబరు తర్వాత కొనసాగించడం సరైంది కాదు. సాయుధ పోరాట లక్ష్యం నెరవేరింది. దాని విజయాలను అతిగా భావించుకొని ఇతర ప్రాంతాలకు విస్తృతం చేయడం సరైంది కాదు. సాయుధపోరాటం ద్వారా భూకేంద్రీకరణ బద్దలైంది. కానీ పేద ప్రజలకు న్యాయమైన భూమి దక్కలేదు. కౌలు రైతులకు న్యాయం జరిగింది. యూనియన్ సైన్యాలు రజాకార్లకు నామమాత్రపు శిక్షలు వేసి, కమ్యూనిస్టులపై వేట సాగించడంతో, పోరాటం తక్షణం విరమించలేని పరిస్థితి ఏర్పడింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నించడంతో పాటు, చట్టబద్ధ పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు నడపడం, ప్రజల గొంతుక వినిపించడం అంతే ప్రధానమైనవి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న పరిమితుల్లో సీపీఐ అనేక విజయాలు సాధించింది. మొదటి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైంది. ప్రజల వాణి సమర్థంగా వినిపించింది.
ప్రపంచంలో మొదటిసారి బ్యాలెట్ ద్వారా కేరళలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పార్టీ చీలి నష్టపోయింది. అయినా కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. 140 కోట్ల ప్రజలున్న దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా అధికారంలో భాగస్వామ్యం వహించి హోం, వ్యవసాయ శాఖల మంత్రిత్వ బాధ్యత తీసుకుంది.
రాజభరణాలు రద్దు చేయడంలో, బ్యాంకులు, బొగ్గు గనుల జాతీయకరణలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రధానపాత్ర నిర్వహించాయి. ప్రభుత్వరంగ పరిరక్షణలో ముందు భాగాన నిలబడ్డాయి. యూపీఏ–1 హయాంలో కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా ఆహారభద్రతా చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని, గృహహింస నిరోధక చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని సాధించింది. అలీన విదేశీ విధానాన్ని కొనసాగించడంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. కార్మికుల హక్కులకై, విద్యార్థి యువజన హక్కులకై పోరాడింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు సాధించింది. ఫాసిస్టు తరహా పాలనను ఎండగట్టేందుకు సెక్యులర్, ప్రజాతంత్ర వామపక్షాల ఐక్యత కోసం పోరాటం నడిపింది. ఇవి కొన్ని మాత్రమే.
ఇవన్నీ వైఫల్యాలా? మీరే ఆలోచించుకోండి. కమ్యూనిస్టులుగా మేము తప్పులు చేయలేదని కాదు. కొన్ని తప్పులు జరిగాయి. చారిత్రక పొరపాట్లు జరిగాయి. ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత సాధించలేకపోతున్నాం. మరికొన్ని తప్పులుండవచ్చు. చెప్పండి. ఆలోచిద్దాం. నూతన తరం వీటిని సవరించుకుని ముందుకు సాగిపోవాలి. ఇంకా అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాల్సి ఉండింది. మరింత మిలిటెంట్ పోరాటాలు నడపాల్సి ఉండింది. వినమ్రతతో అంగీకరిస్తాం. ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు. మా పోరాటాలలో ఎర్రజండాతో సాగిపోతాం.
ఈనాడు దేశ ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తూ శ్రామికవర్గ వ్యతిరేక, అభివృద్ధి నిరోధక చట్టాలను చేస్తున్న ఆరెస్సెస్, కార్పొరేట్ చేతుల్లో ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వం నుండి ప్రజలను రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కలిసి వచ్చే అన్ని శక్తులతో కలిసి పోరాటాలు చేయడానికి పునరంకితమవుదాం. ఈ బాధ్యతలు నిర్వహించగల మరొక సిద్ధాంతం, రాజకీయ శక్తులు దేశంలో ఉన్నాయా? చర్చించుకుందాం. నిరాశావాదం వద్దు. ఉజ్వలమైన లక్ష్యాల వైపు విశ్వాసంతో సాగిపోదాం. కమ్యూనిస్టు సిద్ధాంతం అజరామరం.
సురవరం సుధాకర్‌రెడ్డి
పూర్వ ప్రధాన కార్యదర్శి, సీపీఐ