Share News

విప్లవ నిర్మాణ సూత్రకారుడు

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:26 AM

కొండపల్లి సీతారామయ్య గొప్ప మార్క్సిస్టు– లెనినిస్టు. ఆయన భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) మహోన్నత నాయకులు. శ్రామికవర్గ విప్లవ సారథి...

విప్లవ నిర్మాణ సూత్రకారుడు

కొండపల్లి సీతారామయ్య గొప్ప మార్క్సిస్టు– లెనినిస్టు. ఆయన భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాత. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) మహోన్నత నాయకులు. శ్రామికవర్గ విప్లవ సారథి. భారత ప్రజాస్వామిక విప్లవ సుదీర్ఘ కాలంలో ఆయన మార్క్సిజం–లెనినిజం మావో ఆలోచనా విధానాన్ని మన దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి నక్సల్బరీ విప్లవ పథాన్ని కాంతివంతం చేశారు. రివిజనిజాన్ని తిప్పికొట్టి ప్రజాపంథా ఆధారంగా విప్లవాచరణను సుసంపన్నం చేశారు.

ఆయన సిద్ధాంత రాజకీయ రంగంలో అవిరళ కృషి జరిపారు. మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించారు. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, కుల సమస్య, జాతుల పోరాటాలు, కార్మిక సంఘాలు మొదలుకొని పాక్షిక పోరాటాలు, భారత ప్రజాస్వామిక విప్లవ వ్యూహం ఎత్తుగడలు, అంతర్జాతీయ పరిస్థితి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, పార్టీ నిర్మాణం వరకు అనేక సమస్యలను చర్చించి వాటిని మార్క్సిజం వెలుగులో విశ్లేషించారు. కొత్త విధానాలను, నిర్మాణ సూత్రాలను ఆవిష్కరించారు.

మహోజ్వలమైన తెలంగాణ పోరాటకాలంలో ఆయన రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ అత్యున్నత నాయకత్వ కమిటీలో ఉండి ఉద్యమాన్ని నడిపారు. దేశం మొత్తంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగిన కృష్ణా జిల్లాకు కార్యదర్శిగా బాధ్యతల్ని నిర్వహించటం ప్రత్యేకించి పేర్కొనదగింది. అపుడు ఆయన కొన్ని వ్యాసాలు మాత్రమే రాశారు. గ్రామసీమలలో ఐక్య సంఘటన, వలంటీర్ల శిక్షణలపై ఆయన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కె.ఎస్‌ రచనా వ్యాసంగం నక్సల్బరీ పోరాటకాలం నుంచే ప్రధానంగా ఆరంభమయింది. అప్పటి నుంచి ఆయన విస్తృతంగా రచనలు చేశారు. సత్యప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌, కృష్ణమూర్తి, విశ్వేశ్వరయ్య వంటి పలు కలం పేర్లతో ఆయన అనేక వ్యాసాలు రాశారు. ఇవి ‘పిలుపు’, ‘క్రాంతి’ పత్రికలలో అచ్చయ్యాయి. ఆయన రచనలలో అత్యధిక భాగం పార్టీ డాక్యుమెంట్స్‌, సర్క్యులర్స్‌ రూపంలోనే ఉన్నాయి. అవన్నీ గతంలో ప్రచురించబడి రహస్యంగా సర్క్యులేట్‌ అయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మా–లె) ఆంధ్ర రాష్ట్ర కమిటీ పేరుతోనో, కేంద్ర కమిటీ పేరుతోనో అవి పార్టీ కేడర్‌కు అందాయి. పార్టీ శ్రేణులు వాటిని విస్తృతంగా అధ్యయనం చేశారు. ఇంకా ఆయన జైలు జీవితం గడిపినపుడు అనేక లేఖలు రాశారు.

కొండపల్లి సీతారామయ్య అద్భుతమైన రచయిత. ఆయన శైలి విలక్షణమైనది. పది లైన్లతో కూడుకున్న ఒక పేరాలో ఒకే వాక్యం ఉన్నా, అది సూటిగా చాలా స్పష్టంగా ఎలాంటి గందరగోళానికీ, సంక్లిష్టతకూ తావు లేకుండా ఉండేది. భావంలో ఉన్న స్పష్టత వల్లనే పాఠకులు ఆయన రచనల్ని సులభంగా ఆకళింపు చేసుకునేవారు. సాధారణ కార్మికులకు సైతం అవి సుబోధకమయ్యేవి. అవసరమైన చోట సామెతలను వాడుతూ ఆయన చేసిన వాదనలు అందరినీ ఒప్పించేవి. వివిధ కోణాల నుంచి సమస్యను తడిమి, సమస్య పూర్వాపరాలను వివరించి నాటి పరిస్థితులను విప్పి చెప్పి సమగ్రమైన అవగాహనను కలిగించేవారు. ఆయన మార్క్సిస్టు విషయ పరిజ్ఞానం అద్వితీయమైనది.

కొండపల్లి సీతారామయ్య రచనలన్నింటినీ సేకరించి వాటిని మొదట వరస తేదీల వారీగా కూర్చి ఒక జాబితా ఏర్పరిచాం. అవి 3,500 పేజీలకు మించి ఉన్నాయి. భారత కమ్యూనిస్టు పార్టీ (మా–లె) చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన వివిధ కాలాలను లేదా పీరియడ్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఆయన రచనల్ని వేరు చేసినపుడు అవి పది సంపుటాలుగా రూపొందాయి. కె.ఎస్‌. మెమోరియల్‌ కమిటీ ఆ పది సంపుటాలను ప్రచురిస్తోంది.

భారత విప్లవోద్యమ అనుభవసారమే కె.ఎస్‌. రచనలు. సుదీర్ఘమైన తన విప్లవ జీవితానుభవాన్నంతా ప్రోదిచేసి ఆయన మనకందించిన రచనలు అమూల్యమైనవి. అవి పీడిత ప్రజల ఘనమైన సంపద. అందుకే అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. రష్యా, చైనా విప్లవ వైఫల్యాల మూలంగా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఏర్పడిన స్తబ్దతను ఆసరా చేసుకుని నేడు రివిజనిస్టులు, ట్రాట్‌స్కైట్లు మార్క్సిజంపై ముప్పేట దాడిని కొనసాగిస్తున్నారు. కె.ఎస్‌. ప్రాసంగికత గురించి చర్చించటమే అసంబద్ధమనీ, కమ్యూనిస్టు విప్లవాలు ఒక పూర్తి ఊహాకల్పిత వ్యవస్థ కోసం అమానవీయ చర్యలకు పాల్పడుతున్నాయనీ కొందరు చేస్తున్న ప్రకటనలు ఈ దాడిలో భాగమే తప్ప మరేమీ కాదు. ఈ దాడిని తిప్పికొట్టి మార్క్సిజాన్ని పరిరక్షించడానికి, వీరి కుట్రల్ని భగ్నం చేసి ఉద్యమాన్ని మున్ముందుకు తీసుకుపోవడానికి కె.ఎస్‌. రచనలు బలమైన సాధనాలుగా నిలుస్తాయి.

కొండపల్లి సీతారామయ్య రచనలలోని మార్గదర్శక సూత్రాలు, సిద్ధాంత రాజకీయ అంశాలు సరైనవి. అవి సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. అవి నేటికీ ఆచరణీయమైనవనీ మన అనుభవం అడుగడుగునా నిరూపిస్తోంది. యావత్తు పీడిత ప్రజానీకం ఈ అనుభవాలను సమీక్షించుకుని మహత్తర విప్లవ ఆశయానికి పునరంకితం కావాలి.

డాక్టర్‌ శ్రీనివాస్‌

కె.ఎస్‌. మెమోరియల్‌ కమిటీ

(నేడు కొండపల్లి సీతారామయ్య వర్ధంతి)

Updated Date - Apr 12 , 2024 | 04:26 AM