Share News

తెలుగు మాధ్యమంతోనే ఆంధ్రాభ్యుదయం

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:16 AM

అమాయక ప్రజలను ‘ఇంగ్లీషు విద్యా హక్కు’ అని మభ్యపెట్టి, తెలుగు రాష్ట్రంలో తెలుగులో చదువుకునే అవకాశాల్ని కాలరాసింది గత ప్రభుత్వం. పది కోట్ల మందికి పైగా మాట్లాడే తెలుగు భాషకు...

తెలుగు మాధ్యమంతోనే ఆంధ్రాభ్యుదయం

అమాయక ప్రజలను ‘ఇంగ్లీషు విద్యా హక్కు’ అని మభ్యపెట్టి, తెలుగు రాష్ట్రంలో తెలుగులో చదువుకునే అవకాశాల్ని కాలరాసింది గత ప్రభుత్వం. పది కోట్ల మందికి పైగా మాట్లాడే తెలుగు భాషకు తెలుగు గడ్డపైనే ఇంతటి దుర్గతి పట్టడం నిజంగా చాలా దురదృష్టం. మన ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం కాదని ఇంగ్లీషు మాధ్యమానికి పెద్దపీట వేయడం నిజంగా తెలుగు జాతికి సమాధి కట్టడమనే చెప్పాలి.

మాతృభాషలో విద్యాబోధన అనేది పిల్లల మానసిక వికాసానికి చాల మంచిది. దాని వలన పిల్లల సృజనాత్మకత మెరుగుపడుతుంది. వారి ఆలోచనలు ‘కాపీ అండ్ పేస్ట్’లా కాకుండా ఒరిజినల్‌గా, అసలు సిసలుగా ఉంటాయి. కనుక పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన ఎంతైనా అభిలషణీయం. కనీసం పదవ తరగతి వరకైనా తెలుగు మాధ్యమం ఉండాలి.


ప్రభుత్వానికి సమాజ అభ్యున్నతి మీద నిజంగా స్పృహ ఉంటే, పేదపిల్లలతో పాటు కోటీశ్వరుల పిల్లలు కూడా తెలుగు మాధ్యమంలో చదివేలా ప్రోత్సహించాలి. అంతేకాని ధనికులు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి అదేదో గొప్పని భావించి, పిల్లల మనోవికాసం గురించి కనీస స్పృహ లేకుండా, పేదలను కూడా ఆంగ్లమాధ్యమం వైపు ప్రోత్సహించడం మన ‘సంఘసంస్కర్తల’ అవివేకాన్ని చాటుతుంది. మన నాయకులకు నిజంగా సమాజాభ్యుదయం మీద చిత్తశుద్ధి, అవగాహన ఉంటే ప్రజలను తెలుగు దారిలోకి మళ్లించడం అసాధ్యమేమీ కాదు. అందుకు ముందు వారు చేయవలసింది తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ కల్పించడం. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు మన వైద్య కళాశాలల్లో యాభై శాతం సీట్లు కేటాయించ వచ్చు. అలానే ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో కూడా తెలుగు మీడియం పిల్లలకు సీట్లు కేటాయించాలి. అప్పుడు కచ్చితంగా ప్రజలు తెలుగు మాధ్యమం వైపు మళ్లుతారు. తెలుగు సమాజంలో తిరిగి సృజనాత్మకత వికసిస్తుంది.


మన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి, పేద పిల్లలకు ఉపాధ్యాయులచే వచ్చిరాని ఇంగ్లీషులో అరకొర చదువులు చెప్పించడం వలన వారి సృజనాత్మకత దెబ్బతినడం, ఆపైన తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఉనికి లేకుండా పోవడం తప్ప పేద పిల్లలకు నిజంగా ఒనగూరే మేలు లేదు. ఆలా కాకుండా ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూ, తెలుగు మాధ్యమం విద్యార్థులకు ఉన్నత విద్యలో కోటా ఇస్తే, అది పేద విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుంది. అంతేకాక ఇంగ్లీషు వ్యామోహంలో కొట్టుకుపోతున్న మధ్య తరగతి, ఉన్నత తరగతి పిల్లలు కూడా తెలుగు మీడియం వైపు మళ్లుతారు. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా తెలుగు మాధ్యమం చెప్పటం మొదలుపెడతారు. అలా ఎక్కువ మంది విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటారు. పిల్లల మనోవికాసం, సృజనాత్మకత మెరుగవుతుంది, తెలుగు జాతి మేధస్సు వికసితమవుతుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి నిలబడతాయి.

ఇక్కడ మనకు ఒక సందేహం కలగొచ్చు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివితే, మెడికల్ కాలేజీలోనో లేక యూనివర్సిటీలోనో ప్రవేశించిన తరువాత మొత్తం అంతా ఇంగ్లీషులో చదవాలంటే కష్టం కదా? అని. ఈ వాదన కొంతవరకు నిజమే. కానీ మనం నాణేనికి మరో వైపు కూడా చూడాల్సి ఉంది. అదేంటంటే తెలివైన విద్యార్థులకు నిజంగా మీడియం అనేది పెద్ద సమస్య కాదు. వాళ్ళు చిన్నప్పటి నుండి ఇంగ్లీషు మీడియంలో చదవగలరు. లేదా చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి పై చదువులు ఇంగ్లీషు మీడియంలో చదవగలరు. కానీ యావరేజ్ (average) బిలో యావరేజ్ (below average) స్టూడెంట్స్ మాతృభాషలో విద్యా బోధన లేకపోతే నష్టపోతారు. తెలుగు మీడియం పుణ్యమా అని వీళ్ళు ఇప్పుడు కనీసం హైస్కూల్ వరకు అయినా చదువుకోగలుగుతున్నారు. అదే లేకపోతే చాలా మంది పిల్లలు నిజానికి ప్రాథమిక స్థాయి కూడా దాటలేరు. ఇప్పుడు పిల్లలందరూ హై స్కూల్ స్థాయి దాటి కళాశాలల్లో ప్రవేశిస్తున్నారు అంటే అది పరీక్షా ప్రమాణాలు తగ్గడం వలన వచ్చిన వాపే కానీ బలుపు కాదని గ్రహించాలి.


ఉన్నత విద్య ఇంగ్లీషులో ఉందని, దాని కోసం ప్రాథమిక విద్యను కూడా ఇంగ్లీషులో చెప్పాలనటం నాడా కోసం గుర్రాన్ని వదులుకోవడమే అవుతుంది. పిల్లల్లో సృజనాత్మకత, మానసిక వికాసం క్షీణింపజేసి, వాళ్లకి ఉన్నత విద్య ప్రసాదించడం వలన, సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కనుక ప్రాథమిక విద్యని ఇంగ్లీషులోకి మార్చి, తెలుగు సంస్కృతిని, తెలుగు సమాజం మూలాల్ని పెకలించడం కన్నా, ప్రాథమిక విద్యని తెలుగులోనే యథాతథంగా ఉంచి, ఉన్నత విద్యకి సంబంధించిన గ్రంథాలను తెలుగులోకి తర్జుమా చేయించి, ఉన్నత విద్యని కూడా తెలుగులో అందించడం నిజానికి ఎంతో సహేతుకం.

ఉన్నత విద్యని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలుగులో బోధించటం కష్టంగానే ఉండవచ్చు. కానీ చిత్తశుద్ధితో, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అది అంత అసాధ్యమైన విషమేమి కాదని తెలుస్తుంది. ఉన్నత విద్యకి సంబంధించిన పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి ఇప్పుడు మనకు కృత్రిమ మేధ సహకారం ఉన్నది. తెలుగులో పాఠాలు చెప్పే మన ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి ఇంగ్లీషులో పాఠాలు చెప్పించటం కంటే, ఇంగ్లీషులో పాఠాలు చెప్పే మన యూనివర్సిటీ ఆచార్యులకు శిక్షణ ఇచ్చి, వాళ్ళ చేత తెలుగులో పాఠాలు చెప్పించటం చాలా తేలిక. చిన్న చిన్న దేశాలు కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, విశ్వవిద్యాలయాల్లో బోధించే ఉన్నత స్థాయి గ్రంథాలను తమ తమ భాషల్లోకి తర్జుమా చేసుకోగలిగినప్పుడు, తెలుగు భాషలోకి ఎందుకు చేయకూడదు? కనుక తెలుగులో ఉన్నత విద్యాభ్యాసం అంత దుర్లభమైన విషయమేమికాదు.


మాతృభాషలో విద్యాభ్యాసం వలన పిల్లల సృజనాత్మకత మెరుగవుతుంది. కేవలం పరాయి ఆలోచనలను నిష్క్రియాత్మకంగా తలకెక్కించుకోకుండా, స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు. ప్రతి దాన్ని పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకోకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వంతంగా ఆవిష్కరణలు చేయగలుగుతారు. వినూత్నమైన అసలు సిసలైన ప్రతిపాదనలు చేయగలుగుతారు. క్రమంగా తెలుగు జాతి మేధస్సు పరిమళిస్తుంది, మన వాళ్ళు కూడా పుస్తకాలు రాయగలుగుతారు. కొంత కాలం తరువాత మన వాళ్ళు తెలుగులో రాసిన పుస్తకాలను పాశ్చాత్యులు తర్జుమా చేసుకునే పరిస్థితి వస్తుంది.

డా. గోనుగుంట్ల శ్రీనివాసరావు

Updated Date - Aug 29 , 2024 | 03:16 AM