రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకానమీలో నిలిపిన నిపుణుడు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:08 AM
విశ్వసనీయత, అంకితభావంతో పాటు దార్శనికత కలిగిన నాయకులు ప్రజా జీవన ప్రమాణాలలో పరివర్తన తీసుకురాగలుగుతారు కానీ వర్తమాన భారతవనిలో ఈ తరహా నాయకులు అరుదు. స్థానికాంశాలలో మాత్రమే...

విశ్వసనీయత, అంకితభావంతో పాటు దార్శనికత కలిగిన నాయకులు ప్రజా జీవన ప్రమాణాలలో పరివర్తన తీసుకురాగలుగుతారు కానీ వర్తమాన భారతవనిలో ఈ తరహా నాయకులు అరుదు. స్థానికాంశాలలో మాత్రమే నిమగ్నమై ఉండే రాష్ట్ర స్థాయి నాయకులే తప్ప దూరదృష్టితో, అంతర్జాతీయ దృక్పథంతో, విదేశాల సౌజన్యంతో తమ రాష్ట్రాల అభివృద్ధి గూర్చి అలోచించేవారు బహు అరుదు.
నెహ్రూ హయాం నుండి ఇప్పటి వరకు విదేశాంగ విధానం అనేది పూర్తిగా కేంద్ర అంశం, అందులో రాష్ట్రాల ప్రమేయం ఉండదు. విదేశీ పర్యటనలు, ప్రముఖులతో సమావేశాలు, పెట్టుబడులు వగైరా అన్నీ విదేశాంగ మంత్రిత్వ శాఖే నిర్ణయిస్తుంది. కానీ దీనికి మినహాయింపుగా స్వాతంత్ర్య భారతంలో ప్రప్రథమంగా నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలతో, ప్రతినిధి బృందాలతో, పెట్టుబడులు తెస్తూ కొత్త ఒరవడిని నెలకొల్పారు.
1990లో శస్త్రచికిత్స కోసం 59 రోజులపాటు అమెరికాకు వెళ్ళిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రపంచ బ్యాంకు నుంచి వరదల పునరవాస చర్యల కొరకు రూ.2800కోట్ల రుణాన్ని తీసుకురావడం గురించి, న్యూయార్క్ నుండి ఫాక్స్ ద్వారా జీవోలు జారీ చేయడాన్ని గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత, కొన్నాళ్ళకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దేశ విదేశాంగ విధాన తీరులో సమూల మార్పును తీసుకోవచ్చారు. అప్పటి వరకు రాష్ట్రాలతో సంబంధం లేకుండా నడిచిన విదేశాంగ విధానంలో రాష్ట్రాలకు కూడా పాత్ర ఉండాలంటూ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వాదనకు జాతి ప్రయోజనాల దృష్ట్యా అందరి నుంచి ఆమోదం లభించింది. ఇప్పుడు 25ఏళ్ళ తర్వాత ఆయన తనయుడు లోకేశ్ కూడా బలమైన రాష్ట్రాలు లేకుండా భారత వికాసం ఎలా అంటూ అడుగుతుండడం ముదావహం.
చంద్రబాబు దార్శనికత గూర్చి ఇక్కడ ప్రస్తావించాలి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌లు నిత్య జీవితంలో ఒక భాగమే, కానీ రెండు దశాబ్దాల క్రితం అనేక వర్ధమాన దేశాలలో సైతం ఈ–కామర్స్ గురించి పెద్దగా తెలియని కాలంలో చంద్రబాబు నాయుడు దుబాయిలో ఈ–కామర్స్ కేంద్రంగా పురుడుపోసుకుంటున్న ఇంటర్నెట్ సిటీని పర్యటిస్తానని ప్రత్యేకంగా ఆసక్తి చూపారు. అప్పట్లో దీనిపై ఇటు భారతీయ దౌత్యవేత్తలతో పాటు, అప్పటి దుబాయి యువరాజు, ప్రస్తుత రాజు అయిన షేక్ మోహమ్మద్ రాషేద్ అల్ మోఖ్తుం అశ్చర్యపోయారు. భవిష్యత్తు పట్ల ఇంత దార్శనికత కలిగిన ఈ భారతీయ నాయకుడు ఎవరా అని అరబ్బులు ఆసక్తిగా గమనించారు. అప్పటికి ఇంకా బాలుడిగా ఉన్న నారా లోకేశ్‌తో కలిసి ఆయన దుబాయిలోని ఇంటర్నెట్ సిటీని పర్యటించి దాని తీరుతెన్నులను పరిశీలించి సైబరాబాద్‌లోని హైటెక్ టవర్ల నిర్మాణంలో దానికి అనుగుణంగా కొన్ని సూచనలు చేసారు.
పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో విమానయాన రాకపోకలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని గ్రహించిన చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టడమే గాక అందులో విమానాలను నడపడానికి ఎయిర్‌లైన్స్ చుట్టు తిరిగారు. సంప్రదాయకంగా ఇరుదేశాల మధ్య జనవరిలో జరిగే ద్వైపాక్షిక విమానాల రాకపోకల ఒప్పందాలకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఏమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్‌లో ప్రత్యేక అనుమతి ఇప్పించారు. దాంతో 2001 జూలై 2న ప్రప్రథమ ఏమిరేట్స్ విమానం హైదరాబాద్‌లో దిగింది. అందులో దుబాయి నుంచి వచ్చిన ఏమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అత్యున్నత అధికారి ఘయిత్ అల్ ఘయిత్ ఈ విమానం హైదరాబాద్‌కు రావడానికి కేవలం చంద్రబాబు నాయుడు కారణమని ప్రశంసించారు. ఈ విమానం ద్వారా దుబాయి మీదుగా అమెరికా, ఐరోపాలతో సహా ప్రపంచానికి హైదరాబాద్‌కు విమాన సౌకర్యం విరివిగా అందుబాటులో వచ్చింది.
ఆ తర్వాత వ్యూహాత్మకంగా హైదరాబాద్‌లో అమెరికన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలను ఆకర్షించిన చంద్రబాబు నగరంలో అమెరికా కాన్సులేటు నెలకొల్పడానికి నిర్విరామంగా చేసిన ప్రయత్నాలు చూసి సాక్షాత్తూ అమెరికా విదేశాంగ శాఖ సైతం నివ్వెరపోయింది. స్వాతంత్ర భారత చరిత్రలో అమెరికా ప్రప్రథమంగా నెలకొల్పిన కాన్సులేటు ఇదేనని అని చాలమందికి తెలియదు.
దశాబ్దకాలంగా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైన విదేశాంగ శాఖలోని ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని చంద్రబాబు తన చేతల ద్వారా దేశానికి చూపించారు. చైనా, సింగపూర్, దక్షిణా కొరియాలతో వ్యూహాత్మక ఆర్థిక ప్రయోజనాలు సాధించారు.
2014లో జపాన్‌లో ఎన్నికలలో నిమగ్నమై ఉన్న ప్రధాని షింజో అబే, విశ్వఖ్యాత ఎలక్ట్రానిక్స్ సంస్థ పానసోనిక్ యాజమాన్యంతో సమావేశమవడానికి సందర్శిస్తానని చంద్రబాబు విజ్ఞప్తి చేయడంతో దౌత్యవేత్తలు ఒకింత అశ్చర్యం వ్యక్తం చేసారు. కానీ అవతలి వైపు నుండి వచ్చిన సానుకూలతతో వారిద్దరితో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు జపాన్‍లోని భారత రాయబారి దీపా వాధ్వాతో పాటు జపానీ పారిశ్రామికవేత్తలను అబ్బురపర్చింది. మైక్రోసాఫ్ట్ మొదలు కియా మోటర్స్ వరకు అనేక బహుళజాతి బ్రాండ్లను రాష్ట్రానికి తెచ్చిన తీరు దౌత్యవేత్తలకు సైతం మార్గదర్శకంగా నిలించింది.
అదే విధంగా, సాధారణంగా రాష్ట్రాల స్థాయి నాయకులను కలవని యూఏఈ అధ్యక్షుడు, ఆబుధాబి రాజు శేఖ్ మోహమ్మద్ బిన్ జాయద్ కూడ 2018లో చంద్రబాబుతో సమావేశమై తాను నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతానని చెప్పినా ఆ తర్వాత ప్రభుత్వ మార్పిడితో అడుగు ముందుకు పడలేదు.
ఆర్థిక ప్రయోజనాలే కాకుండ సగటు ప్రవాసీయుల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. గల్ఫ్‌లో మృతదేహాల పెండింగ్ గూర్చి ఈ ప్రతినిధి 1995లో వ్రాసిన ఒక వ్యాసంపై అప్పుడే అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సౌత్ బ్లాక్‌లో కదలిక తీసుకువచ్చింది. ఈ రకమైన దార్శనికత, అంకితభావం కలిగిన చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధిబాటపై పయనిస్తుందని ఆశించవచ్చు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)