ఆంధ్ర ఎన్నికలలో అమెరికా ఎన్నారైలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 03:42 AM
ఊహించని రీతిలో విజయ దుందుభి మోగించిన టీడీపీ కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల పాత్ర గురించి అన్ని చానల్స్, పత్రికలు, పోర్టల్స్ చెబుతూనే ఉన్నాయి. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు...

ఊహించని రీతిలో విజయ దుందుభి మోగించిన టీడీపీ కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల పాత్ర గురించి అన్ని చానల్స్, పత్రికలు, పోర్టల్స్ చెబుతూనే ఉన్నాయి. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచటమే మన ఎజెండా’ అంటూ దాదాపు రోజుకు కోటి రూపాయల పైన వచ్చే ఆదాయం, లక్షలాది అభిమానులను తెచ్చి పెట్టే సినిమా వృత్తిని పక్కన పెట్టి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి; బయట నుంచి, పార్టీ లోపల నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని, కూటమి ఫార్ములా, మేనిఫెస్టో తయారు చేసి 74 ఏళ్ల వయసులో 45 డిగ్రీల ఎండలో తిరిగిన చంద్రబాబు గురించి; మంగళగిరిలో ఉంటూ ఒక పక్క తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ, ఇంకో పక్క టీడీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్రమంతటా అభ్యర్థులకు కావలసిన సహాయ సహకారాలు, సలహా సూచనలు ఇచ్చిన లోకేష్ గురించి రాష్ట్రంలోని, దేశంలోని మీడియా చెప్పేసింది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడమే కాక, కేంద్రంలోని పాలక ఎన్డీయేని సమన్వయపరిచే బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు అన్న విషయం తెలుగు వారికి గర్వకారణం అవుతుంది కదా!
ఇది ప్రజల విజయం అని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ కాంప్లిమెంట్ రాష్ట్ర ప్రజలందరికి వర్తిస్తుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో విదేశాలనుంచి ఎన్ఆర్ఐలు క్రియాశీలక పాత్ర పోషించారని మీడియా ప్రతి రోజు చెప్తూనే వుంది.
అమెరికాలోని ఆంధ్రులలో ఇటీవలి సంవత్సరాలుగా పెరిగిన రాజకీయ చైతన్యం, అమెరికా నుంచి ఎన్నికల్లో అభ్యర్థిగా ముందుకొచ్చిన ఎన్ఆర్ఐల వివరాలు, గత కొద్ది నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు పరిశీలిస్తే ‘ఇది ఎన్నారైల విజయం’ అని చెప్పాలి.
పోటీ చేసి – గెలిచిన ఎన్నారైల అభ్యర్థుల వివరాలను సంగ్రహంగా చూద్దాం.
1) డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ – గుంటూరు జిల్లా బుర్రిపాలెం (హీరో కృష్ణ స్వగ్రామం కూడా) గ్రామస్తుడు. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి అమెరికా వచ్చి స్వశక్తితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకొంటూ మిలియనీర్ నుంచి బిలియనీర్‌గాఎదిగిన కృషీవలుడు డా. చంద్ర పెమ్మసాని, రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచనతో టీడీపీలో చేరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాదాపు 8,65,000 ఓట్లతో (60 శాతం) 3,45,000 ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గంలో టీడీపీ తరపున మంత్రి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర లేదు. మన డా. చంద్ర పెమ్మసాని కేంద్ర మంత్రి అవుతారని ఆశిద్దాం.
2. రాము వెనిగళ్ల – గుడివాడలో పుట్టి, అమెరికా వెళ్లి కొన్ని సంవత్సరాలు ఐటీ రంగంలో ఉద్యోగం చేసి, అట్లాంటా పట్టణంలో ఎఫిసెన్స్ అనే ఐటీ కంపెనీ ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించి మంచి పేరు తెచ్చుకొన్న రాము వెనిగళ్ల కూడా తాను పుట్టిన గుడివాడకు, స్వరాష్ట్రానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి 2023లో వచ్చారు. ఎన్నికలు రావటానికి దాదాపు రెండేళ్ళు ముందుగానే టీడీపీ నాయకత్వాన్ని కలిసి గుడివాడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దాదాపు 4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా వున్న కొడాలి నానికి పోటీగా రాము వెనిగళ్ల సరైన వ్యక్తి అని చంద్రబాబు కూడా సరే అనడంతో రాము గుడివాడ నియోజక వర్గంలో తన పని మొదలుపెట్టారు. గుడివాడ గడ్డ – నాని అడ్డా అనే చోట కొడాలి నాని మీద 54,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాబోయే రోజులలో అమరావతి నిర్మాణంలో రాము వెనిగళ్ల కీలక పాత్ర పోషిస్తారని, గుడివాడను అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం.
3) సురేష్ కాకర్ల : అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన సురేష్ కాకర్ల అనేక సంవత్సరాలుగా తానా సంస్థ, కాకర్ల చారిటబుల్ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితులు. ఇప్పుడు జరిగిన చరిత్రాత్మక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి 1,01,000 పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
1996లోనే అట్లాంటా నుంచి గడ్డం ఆత్మచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నిజమాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడాన్ని, ఆ తర్వాత న్యూయార్క్ నివాసి మధు యాష్కీ కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ నుంచి 2004లో, 2009లో పోటీ చేసి విజయం సాధించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. 2009 ఎన్నికల సమయం నుంచి అనేక మంది ఎన్ఆర్ఐలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహపడుతూ ముందుకు రావడం, వారికి ప్రధాన పార్టీల నుంచి సీట్ లేకపోవడం జరుగుతూ వచ్చింది.
అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ గురించి కూడా చెప్పుకోవాలి. 2007లో చంద్రబాబు అమెరికా వచ్చి 10 నగరాలలో పర్యటించినప్పుడు కాలిఫోర్నియాలోని జయరాం కోమటిని ఎన్ఆర్ఐ టీడీపీకి ఇంచార్జిగా నియమించారు. జయరాం కోమటి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేయోభిలాషులు, చంద్రబాబు అభిమానులు దగ్గరవడం జరుగుతూ వస్తోంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా టీడీపీ అధికార పార్టీగా రావడంతో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యక్రమాలు కూడా బాగా పెరిగాయి. అదే సమయంలో APNRT సంస్థ ఏర్పడటం, మరో ముఖ్య ఎన్నారై డా. రవి వేమూరి APNRTకి ఇంచార్జిగా రావడంతో అమెరికాలో ఎన్ఆర్ఐ టీడీపీ అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రతి నగరంలో సభ్యులు విస్తృతంగా పెరగడం ఆటోమేటిక్‌గా జరిగాయి.
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కొంతకాలం కొంచెం స్తబ్దత ఏర్పడినా మళ్లీ కొవిడ్ సంక్షోభం తరువాత 2022 నుంచి ఎన్నారై టీడీపీని ఉత్తేజపరిచే బాధ్యతను జయరాం కోమటికి అప్పచెప్పారు. ఆయన అమెరికాలోని టీడీపీ అభిమానుల వివరాలు సేకరించారు. టీడీపీ నాయకత్వం కూడా ఈ సారి ఎన్నికల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులకు వారి సమర్థతను బట్టి, ఎంచుకొన్న నియోజకవర్గాన్ని బట్టి సీట్ ఇస్తాము అని హామీ ఇవ్వడంతో చాలామంది ముందుకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా రాజంపేట నియోజక వర్గం నుంచి అమెరికా వచ్చిన సతీష్ వేమనకి కూడా పోటీ చేయాలనే కోరిక బలంగా వుంది. అయితే చంద్రబాబు ఆయన్ని తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఈ బాధ్యతల నిర్వహణలో భాగంగా సతీష్ వేమన అనేక నియోజకవర్గాలు తిరిగి పార్టీ అభ్యర్థులను కలిసి వారి గెలుపునకు కృషి చేశారు.
NATS సంస్థ పూర్వ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ గుంటూర్ తూర్పు నియోజకవర్గం నుంచి, గొంప కృష్ణ శృంగవరపుకోట నుంచి, పైలా ప్రసాదరావు మాడుగుల నుంచి పోటీ చేయడానికి తమ తమ నియోజకవర్గాల్లోకి వెళ్లి పనులు, ప్రచారాలు కూడా చేసుకున్నారు. అయితే అనేక కారణాల వలన, స్థానిక సమీకరణల వలన అందరికీ టికెట్ దక్కలేదు. అయితే పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న ఎన్నారైలు విజయపతాక ఎగురవేశారు. అమెరికా నుంచి దాదాపు 200 మంది ఆంధ్రులు స్వరాష్ట్రానికి వెళ్లి ఈ ఎన్నికలలో ప్రచార బాధ్యతలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
చెన్నూరి వెంకట సుబ్బారావు
(వ్యాసకర్త అమెరికాలోని ‘తెలుగు టైమ్స్’ ఎడిటర్)