Share News

రాయసకారులూ బహుపరాక్‌!

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:41 AM

‘ఎ ఫేర్‌ వెల్‌ టు ఆమ్స్‌’ నవలని ఏకంగా 50సార్లు తిరగ రాసి, కనీసం 47 ముగింపులు మార్చి మార్చి రాసిన ఆ పెద్దాయన్ని చూసి బిత్తరపోయి, ‘ది ప్యారిస్‌ రివ్యూ’, ‘‘అయ్యా దేనికిదంతా?’’ అనడగ్గా, ‘‘సరైన పదాల దొరక్క!’’ అన్నాడా పెద్దమనిషి తాపీగా. టాల్‌స్టాయ్‌ ‘వార్‌ అండ్‌ పీస్‌’...

రాయసకారులూ బహుపరాక్‌!

‘ఎ ఫేర్‌ వెల్‌ టు ఆమ్స్‌’ నవలని ఏకంగా 50సార్లు తిరగ రాసి, కనీసం 47 ముగింపులు మార్చి మార్చి రాసిన ఆ పెద్దాయన్ని చూసి బిత్తరపోయి, ‘ది ప్యారిస్‌ రివ్యూ’, ‘‘అయ్యా దేనికిదంతా?’’ అనడగ్గా, ‘‘సరైన పదాల దొరక్క!’’ అన్నాడా పెద్దమనిషి తాపీగా. టాల్‌స్టాయ్‌ ‘వార్‌ అండ్‌ పీస్‌’ ఎంత బృహ న్నవలో తెలియనివాళ్ళు అరుదే! ఆ మహా పురుషుడు కూడా దాన్ని అనేకసార్లు తిరగ రాశాడు! వంటి చేత్తోనే ఈ పనులు చేసేరు వీళ్ళు! అసలు - ఏ ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ అయినా ఒక చెత్తే పో - అంటాడు, హెమింగ్వే! మంచి రాయసగాడు కావాలంటే ముందు నువ్వు ‘చిన్న వాక్యాలు రాయడం నేర్చుకో’ అని హితబోధ చేస్తాడు.

బ్రెవిటీ ఏవిటీ?

ఫ్రీడ్రీక్‌ నీచే, ‘‘నా యాంబిషన్‌ ఏమిటంటే వేరేవాళ్ళు పుస్తకం మొత్తంలో చెప్పిందాన్ని పదే పది వాక్యాల్లో చెప్పటమే.’’ బ్రెవిటీ గురించి ఇంత గొప్పగా ఇంకెవరూ చెప్పి ఉండకపోవచ్చు. అసలు షేక్‌స్పియర్‌ను మించినోడు ఎవడూ ఉండే అవకాశమే లేదు అతి స్వల్ప మాటల్లో చెప్పడంలో! ‘‘బ్రెవిటీ ఈజ్‌ ది సోల్‌ ఆఫ్‌’’ విట్‌ అని ఊరికే అన్నాడా ఆ మహానుభావుడు? ఫ్రాన్సిస్‌ బేకన్‌ వ్యాసాలు బ్రెవిటీకి పట్టుగొమ్మలు. రోదసీ యాత్రికుడి క్యాప్సూల్‌ మీల్‌లా, వేల క్యాలరీల స్టఫ్‌ అంతా రెండో మూడో పదాల్లో ఇమిడ్చేస్తాడు. చూడండి ఈ కాప్స్యుల్‌: ""Reading maketh a full man; conference a ready man; and writing an exact man.'' రాతలో ‘మోత’ పదాల గురించి!

మోత మోగే యే పదం మీదో మోజు పడి, వెతుక్కుని మరీ బజాయిం చాలనుకునే వాళ్లకు భలే కముకు దెబ్బలు కొట్టారు!

జేమ్స్‌ జె. కిల్పాట్రిక్‌ అనే ఓ పెద్దాయన, - అయ్యా బాబులూ! ‘‘చదువుకునే వాడు వెతుక్కోవాల్సి వచ్చే పదాల్ని కాదు వాడాల్సింది, అర్థం చేసుకోగలిగే పరిచిత పదాల్ని వాడండి... అద్భుతమైన అన్యపదమేదో మిమ్మల్ని నిలవనీకుండా గంతు లేయిస్తుంటే అది సద్దుమణిగి వెళ్లిపోయేదాకా స్థిమితంగా కాసేపు పడుకోండి’’ అని సెలవిస్తాడు.

‘‘మీలోని అహంభావపు రచయిత హృదయాన్ని అవి ముక్కలు చేస్తున్నా సరే, ఆ ప్రియాతి ప్రియ మైనవాటిని చంపేసేయండి. ఆ ప్రియమైన వాటిని చంపేసేయండి!’’ అని స్టీఫెన్‌ కింగ్‌ ఎంత గౌరవంగా చెప్పేడో కదా!

రాతలో సరళత్వమే సహజత్వం

జీవన గాంభీర్యం అంతా సరళత్వంలోనే ఉందనీ, ...రాత నుంచి పెయింటింగ్‌ వరకూ సరళత్వమే అసలు రహస్యం అంటాడు బుకోవ్‌స్కీ. అమెరికన్ల రాత గురించి వాపోతూ విలియం జిన్సర్‌ అనే పెద్దాయన, ‘‘మన అమెరికా రాతకు పట్టిన దరిద్రం డొంక తిరుగుళ్ళు, అనవసరపు పదాల్లో చిక్కుకుపోవడం, తిప్పి తిప్పి చెప్పటం, ఆడంబరపు అలంకారాలూ, అసందర్భపు భాషా’’ అని చిరాకు పడతాడు. ‘‘ఏ మూర్ఖుడైనా విషయాల్ని పెద్దగా చేయగలడు, బాగా గొట్టుగా చేయగల్డు, ఇంకా భీభత్సం చేయగల్డు. సరిగ్గా దానికి వ్యతిరేకంగా వెళ్లాలంటే మాత్రం దమ్ము కావాలి, కొంచెం తెలివితేటలు వాడాలి,’’ అంటాడు ఐన్‌స్టీన్‌! సకల కళా వల్లభుడు లియొనార్డొ డా వించీ ""Simplicity is the ultimate sophistication!'' అనేశాడు. హిపోక్రేట్స్‌ కూడా- భాషకుండాల్సిన గొప్ప గుణం స్పష్టతేననీ, అపరిచిత పదాల వాడకం కంటే దాన్ని దారి తప్పించేవి ఇంకేవీ లేవంటాడు.

శైలీ, గట్రా

శైలీ గట్రా అంటూ కంగారుపడే వాళ్లకు చురక అంటిస్తూ, ఆర్నోల్డ్‌ ‘‘ఏదో ఒకటి చెప్పటానికి ఉండి, దాన్ని ఎంత స్పష్టంగా వీలైతే అంత స్పష్టంగా చెప్పటమే శైలి తాలూకూ రహస్యం’’ అంటాడు.

డార్విన్‌ బల్లగుద్ది మరీ చెప్పాడు. ‘‘శైలీ గిలీ అంటూ పట్టించుకోను. నా బుర్రకు స్పష్టంగా ఏది తడితే అది, నాకొచ్చిన సరళమైన భాషలో రాసుకుపోతా!’’

ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్‌ లేకపోవడం హీనమేనా?

రాసుడు వ్యాపారంలో మహా ముఖ్యమైన పాఠం ఏంటంటే ‘‘రాసిందాంట్లో కొవ్వు తగ్గించుకుంటూ వెళ్లడమే అంటాడు’’ రాబర్ట్‌ హిన్లిన్‌ అనే గొప్ప రాయసగాడు.

థామస్‌మన్‌ అనే ఇంకో ఆయన, ‘‘మూర్ఖత్వాలు చాలా రకాలు, అన్నిటికంటే చండాలం అతి తెలివి! అఫ్‌కోర్స్‌ రాతలో.’’, అని చీవాట్లు పెడతాడు.

‘‘చెత్త బుట్టలో చాలా మంచి మంచి రాతలు పడుతున్నాయంటే నువ్వు చాలా బాగా రాస్తున్నట్టేపో’’ అని భుజం తడతాడు ఎర్నెస్ట్‌ హెమింగ్వే.

‘‘గురి వైపు ఒక రాయికి బదులు పిడికెడు రాళ్లు విసిరే వాడికంటే, అర్థం కోసం కుప్పల పదాలు కుమ్మరించేవాడు ఏ రకంగానూ మెరుగ్గాదు’’ అంటాడు శామ్యూల్‌ జాన్సన్‌. ‘‘రాసింది పదే పదే చదవండి. ఏదైనా ఒక చోట, ‘మహ బాగా రాశా సుమా!’ అనిపించగానే దాన్ని కొట్టి పారేయండి!’’ అని కూడా సెలవిచ్చాడు ఈయనే!

‘‘నేను పెన్సిల్‌ మీద కంటే కత్తెర మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటా’’ అని మహా తెలివిగా చెప్పాడు ట్రూమన్‌ కెపోటే అనే ఇంకో గడుసు పిండం. ఉంచాల్సిన దాని కంటే తీసేయాల్సిందే ఎక్కువ ఉంటుందని చెప్పడం కోసం.

‘‘అన్నిటికన్నా మహా విలువైన టాలెంటు ఏదైనా ఉందీ అంటే ఒక పదం అవసరమైన చోట రెండు పదాలు వాడకుండా ఉండటమే,’’ అంటాడు థామస్‌ జఫర్సన్‌. ఆలోచించుకుందాం రండి మరి!

వి. విజయకుమార్‌

85558 02596

Updated Date - Apr 08 , 2024 | 12:41 AM