Share News

సాహసమే ఆయన జీవితం!

ABN , Publish Date - May 31 , 2024 | 02:42 AM

నేడు హీరో ఘట్టమనేని కృష్ణగారి జయంతి. సరిగ్గా నలభైయేళ్ళక్రితం, 1984 మే 31న మా అభిమాన హీరోకు నేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలన్న...

సాహసమే ఆయన జీవితం!

నేడు హీరో ఘట్టమనేని కృష్ణగారి జయంతి. సరిగ్గా నలభైయేళ్ళక్రితం, 1984 మే 31న మా అభిమాన హీరోకు నేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయాలన్న పట్టుదలతో మొట్టమొదటిసారిగా మద్రాస్‌ వెళ్ళాను. సూపర్‌స్టార్‌గా కృష్ణ తారాస్థాయిలో వెలిగిపోతున్న రోజులవి. శుభాకాంక్షలు తెలియచేయడానికి వచ్చిన అభిమానులతో పాటు, రచయితలు, సంగీతదర్శకులు, సినీప్రముఖులు విజయకృష్ణ ప్రివ్యూ థియేటర్‌ ముందు ఎదురుచూస్తున్నారు. వారందరిచేతిలో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన నలభైయాభైపేజీల స్పెషల్‌ ఎడిషన్‌ ఉంది. అదేరోజు కృష్ణ అభిమాని అయిన ఎన్‌.రామలింగేశ్వరరావు సొంతసినిమా కంచుకాగడా షూటింగ్‌ ఆరంభం కావడంతో హీరో కృష్ణ ఆ గెటప్‌తోనే అక్కడకు వచ్చి, అందరినీ ఆప్యాయంగా పలుకరించి, అభినందనలు స్వీకరించిన ఆ ఘట్టం నా జీవితంలో మరువలేనిది. ఇక, తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభం సందర్భంలో, ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక, ఆయనకు కృష్ణగారు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో ఒక పుల్‌ పేజీ ప్రకటన వెలువడింది.


ఊటీలో షూటింగ్‌లో ఉన్న కృష్ణకు తెలియచేయకుండా నాదెండ్ల ప్రోద్బలం మీద డైరక్టర్‌ తిలక్‌ విడుదల చేసిన ప్రకటన అది. తిలక్‌ చర్య తనకు ఆగ్రహాన్ని కలిగించిందని, ఆ తరువాత ఎన్టీఆర్‌కు ఈ విషయంలో వివరణ ఇచ్చానని కృష్ణ పలుమార్లు నాతో అన్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎంతో అభిమానంగా, గౌరవంగా మాట్లాడేవారు. కృష్ణ కాంగ్రెస్‌లోకి వెళ్ళడం వెనుక అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఉన్నారు. వాహినీ స్టూడియోకు ట్రంక్‌కాల్‌ చేసి, కృష్ణను ఢిల్లీకి పిలిపించుకొని, మాటల సందర్భంలో కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా రాజీవ్‌ కోరడంతో కృష్ణ మొహమాటంగానే అంగీకరించాల్సివచ్చింది. 1989లో ఎంపీగా విజయం, మరో రెండేళ్లలోనే పరాజయం, రాజీవ్‌ మరణం ఇత్యాది పరిణామాలతో కృష్ణ క్రమంగా రాజకీయాలకు దూరమైపోయారు. సినీరంగంలోనూ, రాజకీయంలోనూ అనేక ఉత్థానపతనాలు చవిచూసినప్పటికీ, పొంగిపోవడం, కుంగిపోవడం కృష్ణలో లేనేలేవు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అన్నమాట ఆయనకు నూటికినూరుశాతం వర్తిస్తుంది.

బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ

(నేడు నటశేఖర కృష్ణ 81వ జయంతి)

Updated Date - May 31 , 2024 | 02:42 AM