Share News

శతాధిక కోట్ల స్వప్నాల సాధకుడు

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:37 AM

నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలను పట్టించుకుంటూ, ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ, దేశ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే ఒక రాజకీయ పార్టీని ప్రజలు వ్యతిరేకించే...

శతాధిక కోట్ల స్వప్నాల సాధకుడు

నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలను పట్టించుకుంటూ, ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ, దేశ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే ఒక రాజకీయ పార్టీని ప్రజలు వ్యతిరేకించే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉండడం సహజమని, అందువల్ల ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని చాలామంది మేధావులు భావిస్తుంటారు. అయితే, బీజేపీ విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత అనేది ఉండదని చాలా సందర్భాల్లో రుజువైంది. గత పదేళ్లలో బీజేపీ విషయంలో ప్రజా వ్యతిరేకత బదులు ప్రజా అనుకూలత అనే పదం ఎక్కువగా వినపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీకి నాయకత్వం వహిస్తున్న నరేంద్రమోదీ అనడంలో సందేహం లేదు. బీజేపీ పాలించిన మెజారిటీ రాష్ట్రాల్లో ఆ పార్టీని ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకుంటే కాంగ్రెస్ తదితర పార్టీలు పాలించిన రాష్ట్రాల్లో ప్రజలు విసిగిపోయి గద్దె దింపుతున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. నరేంద్రమోదీ దాదాపు 23 సంవత్సరాలుగా అధికార పీఠానికి సారథ్యం వహిస్తున్నారు. తొలుత 13 సంవత్సరాల పాటు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. మోదీ చేసిన మంచి పనుల మూలంగానే గుజరాత్‌లోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీయే అధికారంలో కొనసాగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ గతంలో కంటే ఎక్కువగా ప్రజా బలం సంపాదించుకోవడానికి కారణం మోదీ కలిగించిన విశ్వాసమే అని ఎవరైనా చెప్పగలరు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, ఛత్తీస్‌గఢ్‌, బిహార్, అస్సాం, త్రిపుర, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ప్రజలు మోదీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించి ప్రజాసేవ చేసే అవకాశాన్ని బీజేపీకి కల్పించారు. గుజరాత్‌లో అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మొత్తం సీట్లలో పది శాతం కూడా రాలేదు. ఇప్పటి వరకూ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా తన పనితీరుతో బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 3 సీట్ల నుంచి 77 సీట్లకు పెరిగి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభవించింది. తెలంగాణలో బీజేపీ గతంలో ఒక సీటు గెలిస్తే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడింది. తమిళనాడు, కేరళ స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటుశాతం పెరిగింది.

ఇందుకు కారణమేమిటి? విధానాలు సరైనవైతే, నాయకత్వం సమర్థమైనదైతే, ప్రజలకోసం నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశం ఉంటే, ప్రజా వ్యతిరేకత అనేది అర్థరహితమని బీజేపీ పదే పదే రుజువు చేస్తోంది. మోదీ నాయకత్వంలో భారత దేశం బలమైన, సమర్థమైన దేశంగా మారిందనడంలో సందేహం లేదు. 2047 కల్లా బీజేపీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) అవతరించడం ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారు. మోదీ నాయకత్వంలో భారత ప్రజలు బానిస భావజాలం నుంచి, వలస వాద సంస్కృతి నుంచి బయటపడ్డారు. మన సార్వభౌమికత్వం, సమగ్రత, సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రజల విశ్వాసం పెరిగింది.. గత పదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో వారికి తెలుసు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, త్రిపుల్ తలాఖ్ రద్దు, జీఎస్టీ, పౌరసత్వ సవరణ చట్టం అమలు, కొత్త పార్లమెంట్ ప్రారంభం, భారతీయ న్యాయసంహిత ద్వారా మొత్తం నేరసంహితను మార్చివేయడం వంటి లెక్కలేనన్ని విజయాలు మోదీ హయాంలో సాధించిన విషయం ప్రజల అనుభవంలో ఉన్నది.

మోదీ ప్రభుత్వ హయాంలో అభివృద్ది విధానాలు, ప్రభుత్వ పథకాల పేరుతో మోదీ ఇచ్చిన గ్యారంటీల ప్రభావం ఎంత బలంగా ఉన్నదో ప్రజలు స్వయంగా గమనిస్తున్నారు. స్వచ్చభారత్ అభియాన్, బేటీ బచావో–బేటీ పడావో, నమామిగంగే, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఇవాళ నూటికి నూరు శాతం పారిశుద్ధ్య పథకాలు అమలు అవుతున్నాయి. 11 కోట్లకు పైగా శౌచాలయాలను నిర్మించారు. 13.91 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు లభిస్తోంది. 55 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందారు. 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు సరఫరా అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా గత పదేళ్లలో భారతదేశ స్థాయి ఏ విధంగా పెరిగిందో కూడా సర్వవిదితమే. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, ఉగ్రవాదం తోకముడవడం, అత్యంత బలమైన, సురక్షితమైన దేశంగా మారడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఇవాళ మోదీ మాట్లాడితే మొత్తం ప్రపంచం ఆలకిస్తోంది. జీ–20, షాంఘై కార్పొరేషన్ సమావేశాలకు అగ్రరాజ్యాధినేతలందరూ హాజరై భారత్ రూపొందించిన సంయుక్త ప్రకటనను వివాదరహితంగా ఆమోదించడం మోదీ నాయకత్వ ప్రతిభకు సంకేతం. మోదీ చొరవతో ఆఫ్రికన్ యూనియన్‌ను కూడా జీ–20లో భాగం చేశారు. ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణతో అరెస్టయిన ఇండియన్ నేవీ మాజీ ఉద్యోగులు నిర్దోషులని మోదీ చెప్పడంతో ఆ దేశం వారిని వదిలిపెట్టింది. ఉరికంబం దాకా వచ్చిన వారు మోదీ పుణ్యమా అని జన్మభూమిపై అడుగుపెట్టి ఊపిరి పీల్చుకున్నారు.

సరే, మన ప్రతిపక్షాలు సైన్యం ధైర్యసాహసాలనూ ప్రశ్నించారు! ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపి ధ్వంసం చేసిన ఘనత మన సైన్యానికి దక్కింది. ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్ – వన్ పింఛన్‌ను అమలు చేసింది కూడా మోదీ ప్రభుత్వమే. మోదీ హయాంలో బలహీనవర్గాలకు, దళితులకు, ఆదివాసీలకు, మహిళలకు జరిగిన సామాజిక న్యాయం విస్తృతమైనది. మోదీ సర్కార్ అధికారంలోకి రాగానే ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు. ముస్లిం మహిళలను త్రిపుల్ తలాఖ్ కోరలనుంచి తప్పించారు. భారతీయ సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేశారు. వర్గీకరణకోసం కమిటీ ఏర్పాటు చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో 17, 18 తేదీల్లో భారత మండపంలో జరిగిన జాతీయ సదస్సులో ఈ విషయాలన్నీ చర్చకు వచ్చాయి. దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి హాజరైన పదివేలమందికి పైగా నేతల్లో తిరుగులేని సమధికోత్సాహం కనపడుతోంది. వికసిత్ సంకల్ప్ యాత్రలో పాల్గొన్న వేలాది నేతలు దేశంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా బీజేపీ పట్ల ప్రజా వ్యతిరేకత కనపడడం లేదు. మోదీ నాయకత్వంలో 2004 జనవరి 22న అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో కోట్లాది ప్రజల కలలు నెరవేరడం వల్ల ఇవాళ దేశంలో ఒక పండుగ వాతావరణం కనపడుతోందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ దేశ ప్రజల కలలు సాకారం చేయగల ఏకైక నేత నరేంద్రమోదీ ఒక్కరే అనడంలో సందేహం లేదు. ఆయనకు దరిదాపుల్లో పేర్కొనదగ్గ ఏ ఒక్క ప్రతిపక్ష నేతా కనపడడం లేదు. ఇండియా కూటమి నేతలు కకావికలమవుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్రలను ప్రజలు విస్మరిస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రక ఎన్నికలలో మూడోసారి 370 సీట్లకు పైగా గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సర్వసన్నద్ధమయింది.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - Feb 20 , 2024 | 01:37 AM