Share News

విజన్‌ ఉన్న నాయకుడు రావాలి!

ABN , Publish Date - May 10 , 2024 | 12:35 AM

ఒక మనిషి విభిన్నంగా ఆలోచిస్తే, నియమ నిబద్ధత కలిగి జీవిస్తే సామాన్య కుటుంబ నేపథ్యం నుండి కూడా అసామాన్యంగా ఎదగొచ్చు అనడానికి చంద్రబాబు జీవితం ఓ నిదర్శనం. విద్యార్థి రాజకీయాల్లో...

విజన్‌ ఉన్న నాయకుడు రావాలి!

ఒక మనిషి విభిన్నంగా ఆలోచిస్తే, నియమ నిబద్ధత కలిగి జీవిస్తే సామాన్య కుటుంబ నేపథ్యం నుండి కూడా అసామాన్యంగా ఎదగొచ్చు అనడానికి చంద్రబాబు జీవితం ఓ నిదర్శనం. విద్యార్థి రాజకీయాల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులతో కలిసి సేవా కార్యక్రమాలు చేశారు. 28 సంవత్సరాల వయస్సులోనే మంత్రిగా పని చేశారు. అటు తరువాత ప్రతిపక్ష నాయకుడిగా, రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా, ఎన్డీయే కన్వీనర్‌గా, విభజిత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు.. భవిష్యత్ తరాలకు ఒక పాఠ్యాంశం.


డా. బాబు జగ్జీవన్ రాం, డా. బి.ఆర్. అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయులు జన్మించిన ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు నాయుడు కూడా జన్మించడానికి గల కారణం, వెనుకబడిన దళిత, గిరిజన, బలహీనవర్గాలకు, సేవ చెయ్యాలి అని ఆయన భవిష్యత్‌ని కాలం నిర్దేశించడం అయ్యి ఉంటుంది. ఆయనెప్పుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రేపటి తరాల భవిష్యత్తు కోసమే ఉపయోగించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అభివృద్ధిలో ఉండాలని తాపత్రయపడ్డారు. మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలని కోరుకున్నారు. 90వ దశకంలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించి, కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని సైబరాబాద్‌గా మార్చారు. ఎన్నో పెట్టుబడులు తీసుకువచ్చి, పరిశ్రమలు స్థాపించి బిల్‌గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ వంటి వారిని మన దగ్గరికి తీసుకువచ్చి అభివృద్ధికి కొత్త నమూనాగా మారి విజన్ 2020 గురించి మాట్లాడారు. ఇప్పుడు నాలెడ్జి ఎకానమీతో కూడుకున్న విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు.


దార్శనికతతో హైదరాబాద్‌ని అభివృద్ధి చేశారు. అదే తోవలో 33వేల ఎకరాలు రైతుల దగ్గరి నుంచి సేకరించి అమరావతికి రూపకల్పన చేశారు. ఇలాంటి నాయకుడు ఏ ఒడిసాలోనో, పశ్చిమ బెంగాల్‌లోనో, గుజరాత్‌లోనో ఉండివుంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయి, పోలవరాన్ని పూర్తి చేసి, అమరావతిని నిర్మించి, విద్య–వైద్యం–ఉపాధి కల్పించి, ఆర్థిక–సామాజిక–రాజకీయ అసమానతలు లేని ఆనంద ఆంధ్రప్రదేశ్‌ను నెలకొల్పాలి.

ప్రొ. వై. సురేష్‌బాబు

హైదరాబాద్‌

Updated Date - May 10 , 2024 | 12:35 AM