Share News

రాజనీతిజ్ఞుడు, నిత్యశ్రామికుడు

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:13 AM

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న నిత్యకృషీవలుడు చంద్రబాబు. ఏడు పదుల వయసులో కూడా తుఫాన్లు, భూకంపాలు, విపత్తులు సంభవించినప్పుడు...

రాజనీతిజ్ఞుడు, నిత్యశ్రామికుడు

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న నిత్యకృషీవలుడు చంద్రబాబు. ఏడు పదుల వయసులో కూడా తుఫాన్లు, భూకంపాలు, విపత్తులు సంభవించినప్పుడు ఆయనే ముందుంటారు. ఐదు పదులు దాటని నాయకులు ప్యాలెస్ నుంచి బయటకు రాకుండానే ఇంట్లోనే సెట్టింగులతో పండుగలు, పబ్బాలు, ప్రారంభోత్సవాలు అన్నీ పూర్తిచేస్తున్నారు. ఎవరు ముసలివారు.. ఎవరు యువకులు? తన తండ్రి వయసున్న చంద్రబాబును పదేపదే ముసలివాడు అని ఎద్దేవా చేస్తున్న వారికి ఇంతకంటే ఏం సమాధానం కావాలి? భిన్నమైన పాలన అందిస్తూ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు చంద్రబాబు. నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంలో తనకు ఎదురైన అనేక సవాళ్లు, సమస్యలు అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను శిథిలం నుంచి శిఖరం వైపు నడిపించారు.

రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే, రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారనే సూక్తి ఉంది. అలాంటి రాజనీతిజ్ఞత చంద్రబాబులో కనిపిస్తుంది. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవనశైలి ఆయనది. సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి, దేశ రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఎన్నో జయాపజయాలు.. మరెన్నో ఆటుపోట్లు చవిచూశారు. అయినా చెక్కుచెదరని గుండె నిబ్బరం, మనోధైర్యం, నిరాశచెందని తత్వం, అలసట ఎరుగని ధీరత్వం ఆయనది.

రేపు చేయాల్సిన పనిని ఈ రోజే పూర్తిచేయాలనుకునే నిరంతర శ్రామికుడు, రాజకీయరంగంలో అరుదైన లక్షణాలు కలిగిన వ్యక్తిగా చంద్రబాబును మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి కొనియాడారు. అభ్యుదయ సమాజం కోసం ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రపంచ రూపురేఖల్ని మార్చగలిగిన కొద్దిమంది వ్యక్తుల్ని వరల్డ్ ఎకానమీ ఫోరం గుర్తించింది. వరల్డ్ డ్రీమ్ కేబినెట్‌కు 14 మందిని ఎంపిక చేసింది. అందులో చంద్రబాబుకు స్థానం లభించడం తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం.

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1950, ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. చిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి, నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రజలతోనే.. ప్రజల్లోనే ఉంటారనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా దేశ ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించడంలో కీలక భూమిక పోషించారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించి గ్లోబల్ ఎకానమీకి అనుసంధానం చేసిన ప్రధాన చోదకుడిగా చంద్రబాబును న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది. ఐటీ రంగాన్ని ఉమ్మడి రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ నిర్మించి, సైబరాబాద్ నగర నిర్మాణానికి రూపకల్పన చేశారు. సాంకేతిక విద్యారంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఎందరో రైతుబిడ్డలను మట్టిలో మాణిక్యాలుగా మార్చాయి. నవ్యాంధ్ర అభివృద్ధికి బాటలు పడతాయని 2014 ఎన్నికలలో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజధాని లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా మొక్కవోని దీక్షతో బస్సులో నుంచే పాలన సాగించారు. భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించి రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు. పోలవరాన్ని 72 శాతం నిర్మించారు. పట్టిసీమ ద్వారా వేల కోట్ల విలువైన పంటలను కాపాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, పరిశ్రమల స్థాపన, ఫైబర్‌గ్రిడ్‌, అన్న క్యాంటీన్లు వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

సమైక్య రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పరిపాలించి, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నవ్యాంధ్ర ఐదేళ్ల పాలనలో ఎక్కడా ఆందోళనలు, ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలు, అక్రమ కేసులు, అరెస్టులు, అణచివేతలు, ధర్నాలు, సమ్మెలు లేవు. వాతలు, కోతలు, ఆర్థిక ఇబ్బందులు అంతకంటే లేవు. కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందేవి. సంపద సృష్టించడం చేతగాక వైసీపీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. ప్రతిపక్షాలపై అనేక రూపాల్లో దాడులు చేస్తున్నది. వీటిని తట్టుకుంటూ చంద్రబాబు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మండుటెండలను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

మన్నవ సుబ్బారావు

(ఏప్రిల్‌ 20: చంద్రబాబు పుట్టినరోజు)

Updated Date - Apr 19 , 2024 | 05:13 AM