Share News

ఈ శతాబ్దంలోనూ సామాజిక విప్లవమా?

ABN , Publish Date - Oct 11 , 2024 | 02:04 AM

ప్రశ్న సులభం! జవాబు కష్టం! అందరం ఇదే అనుకుంటాం! కానీ యుగయుగాల అనుభవాన్ని చూస్తే ప్రశ్నే ప్రగతికి తొలిమెట్టైంది అదే లేకపోతే జవాబుకు అన్వేషణ మొదలవ్వదు. జవాబు అసంపూర్ణమైతే...

ఈ శతాబ్దంలోనూ సామాజిక విప్లవమా?

ప్రశ్న సులభం! జవాబు కష్టం! అందరం ఇదే అనుకుంటాం! కానీ యుగయుగాల అనుభవాన్ని చూస్తే ప్రశ్నే ప్రగతికి తొలిమెట్టైంది అదే లేకపోతే జవాబుకు అన్వేషణ మొదలవ్వదు. జవాబు అసంపూర్ణమైతే మరో ప్రశ్న తలెత్తుతుంది. ఈ లోకానికి మూలమేమిటి? అన్నది మనిషిని తొలచిన మహాప్రశ్న. దీని జవాబు కోసమే మతాలన్నీ పుట్టాయి. విజ్ఞానాలన్నీ ఉదయించాయి.

‘‘ఈ సృష్టికి ఏమర్థం... మానవునికి గమ్యమేది... ఒక సకలాతీత శక్తి ఉన్నట్టా? లేనట్టా? మెదడన్నది మనకున్నది అది సరిగా పనిచేస్తే విశ్వరహఃపేటికా విపాటన జరగకతప్పదు’’ అన్నది.. మహాప్రశ్నకూ, మనిషి సాధనాశక్తికీ శ్రీశ్రీ అందమైన కవితా రూపం. మహాప్రశ్నకు ఒక మహాభాష్యం!

సృష్టి మూలాల్నే కాదు.. దేశాభివృద్ధినీ తెలుసుకోవాలన్నా కొన్ని ప్రశ్నలు తప్పవు. ఈ శతాబ్దంలో భారత్‌ ఎక్కడుంది? వివిధరంగాల్లో జయాపజయాలు ఎలాంటి పరిస్థితులను సృష్టించాయి? సాధించినది సంతృప్తికరమా? అందరికీ ప్రగతి ఫలాలు న్యాయబద్ధంగా చేరాయా? జవాబులు తేలికకాదు. అర్థం చేసుకోటానికి ఎన్నో చిక్కుముడులు! వీటిని ఎంతోకొంత విప్పి ఎక్కడున్నామో చెప్పటానికి చాలా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. భారత వ్యవహారాల్లో నిపుణులైన ముగ్గురు ఇటీవల అదే చేశారు. జాన్‌ హారిస్‌, క్రేగ్‌ జెఫ్‌రీ, ట్రెంట్‌ బ్రౌన్‌ రాసిన ‘ఇండియా: కంటిన్యుటీ అండ్‌ ఛేంజ్‌ ఇన్‌ ద టొంటిఫస్ట్‌ సెంచరీ’ పుస్తకంలో మన సాఫల్య వైఫల్యాలపై ప్రశ్నలూ వివరణలూ ఉన్నాయి. రచనంతా 14 కీలక ప్రశ్నలకు జవాబులిచ్చే రూపంలో సాగింది. భారత్‌లో సామాజిక విప్లవం సాగుతోందా? అన్నది ఆ పధ్నాల్గింటిలో చాలా ఆసక్తికరమైంది. ఎందుకంటే ఆ విప్లవం అందరినీ తాకుతోంది. మన ప్రవర్తనలను ప్రభావితం చేస్తోంది. అది ప్రధానంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతోంది. ఆరు అడ్డంకులను ఎదుర్కొంటోంది. వాటిని నిశితంగా చూస్తే దాని స్వభావం కొంతైనా తెలుస్తుంది.


ఇంతకీ సామాజిక విప్లవం అంటే ఏమిటి? దానికి ఎన్నో భాష్యాలు! సమాజంలోని ఒక వర్గం స్థానంలో ఇంకో వర్గం ఆధిపత్యంలోకి రావటాన్ని సామాజిక విప్లవంగా మనందరం వినేవుంటాం. ఒకప్పుడు సమాజంలో జమిందార్లు, భూస్వాముల ఆధిపత్యం ఉండేది. అప్పట్లో భూమే ప్రధాన ఉత్పత్తి వనరు. దానిపై హక్కులు ఉండి, ఫలసాయంలో ప్రధాన భాగం దక్కించుకునే భూస్వామ్య ప్రభువులదే ఆధిపత్యం.. అధికారం. ఆ తర్వాత పరిశ్రమలు వచ్చాయి. వీటిపై యాజమాన్యం ఉండి లాభాల్లో ప్రధాన వాటాను పొందే యజమానులకే సమాజంపై అసలు సిసలైన అధికారం. ఇలాంటివే కాకుండా మనుషుల ఆకాంక్షలు, విలువలు, సామాజిక ప్రవర్తనల్లో చోటుచేసుకుంటున్న మార్పులను సైతం మరో విధమైన సామాజిక విప్లవంగా భావించే ధోరణి కూడా ఉంది. 2000 నుంచి భారత్‌లో దానికి సంబంధించిన సూచికలేమిటో పరిశీలిద్దాం.


మొదటి అంశంగా విద్యారంగం గురించి చెప్పుకోవాలి. నాణ్యతలో అది వెనుకబడిన మాట నిజం. అయినా ప్రవేశాల్లో పురోగతి గణనీయంగా ఉంటోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చేరిక పుంజుకుంటోంది. హయ్యర్‌ సెకండరీ స్కూళ్లకు సంబంధించి అర్హత వయస్సున్న పిల్లల సంఖ్య 60 శాతానికి చేరువలో ఉంది. అక్షరాస్యత 2011 నాటికి 74 శాతానికి చేరింది. విద్యారంగం పురోగతితో పౌరసమాజంతో పాటు రాజకీయాలు, ప్రభుత్వంతో ప్రజలు వ్యవహరించే తీరులో కీలక మార్పులొస్తున్నాయి. పౌరులుగా తమకు లభించాల్సిన హక్కులు, సౌకర్యాలు, స్వేచ్ఛల గురించి చైతన్యం బాగా పెరిగింది. అందుకే వివిధ సమస్యలపై సామాజిక ఉద్యమాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యామ్నాయ ఆలోచనా వేదికలు పుట్టుకొస్తున్నాయి.

సమాచార సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటికీ బాగా దోహదం చేసింది. సామాజిక విప్లవంలో రెండో అంశం ఇదే! ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ డిజిటల్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజీలు. మన ప్రవర్తనలను విపరీతంగా మార్చివేశాయి. 24 ఏళ్ల కిందట మొబైల్‌ ఫోన్లు వాడే వారి సంఖ్య 20 లక్షలు ఉంటే ఈ ఏడాదికి 115 కోట్లకు చేరుకున్నారు. ఇక నెట్‌ వాడే వాళ్లు 2000 సంవత్సరంలో 0.5 శాతం ఉంటే ఈ ఏడాదికి వారి సంఖ్య 94 కోట్లు అయింది. అవసరాన్ని బట్టి సమాచారాన్ని సేకరించటం, తమ ఆలోచనలను, ఉద్యమాలను ప్రపంచంతో పంచు కోవటం, సమస్యలపై సంఘీభావాన్ని సాధించటం, బడా మీడియా సంస్థలను కాదని సొంత ప్రచార దారులు వేసుకోవటం, ఉత్పత్తులను అమ్ముకోటానికి నేరుగా వినియోగదారులను సంప్రదించటం, సాహిత్య సృష్టిని సులువుగా పాఠకులకు వెల్లడించటం... ఇట్లా చెప్పుకుంటూ పోతే డిజిటల్‌ మీడియా ఎన్నిటినో సుసాధ్యం చేసింది. 2013 నాటి అరబ్‌ ప్రజల తిరుగుబాట్ల నుంచి వాల్‌స్ట్రీట్‌ ఆక్రమణ, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ప్రదర్శనలు, పౌరసత్వచట్టం సవరణలకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన ఆందోళనలు, అంతకుముందు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం.. ఇలా అనేక ఆందోళనల్లో డిజిటల్‌ మాధ్యమాల ప్రచారం పాలే ఎక్కువ. ప్రజల వైపు నుంచి చూస్తే డిజిటల్‌ పరిజ్ఞానం సానుకూలతలుగా వీటిని పరిగణించినా విపరిణామాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, కార్పొరేట్‌ సంస్థలు, మతాధిక్య దురభిమానులు కూడా దాన్ని సమర్థంగా వాడుకుని ఆధిపత్యాన్ని నెలకొల్పుకునే ప్రయత్నాలు విపరీతంగా సాగుతున్నాయి. దాన్ని ఎదుర్కొనే ప్రచారం కూడా మరోవైపు ఎంతోకొంత స్థాయిలో సాగుతోంది. డిజిటల్‌ మీడియా లేకముందు కిందివర్గాలకు ఈ అవకాశం లేదనే చెప్పొచ్చు! ప్రధాన మీడియా దారులు మూసేస్తే ఆందోళనల ఊపు తగ్గిపోయేది.


ప్రభుత్వాలు.. ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడాలనే ఆకాంక్ష ప్రజల్లో బాగా వ్యాప్తి చెందటాన్ని మూడో అంశంగా చెప్పుకోవాలి. నాయకులు తమకు జవాబుదారీగా ఉండాలనీ, ఉద్యోగులు నిష్పక్షంగా వ్యవహరించాలనీ, విధానాల్లో తమ ఆకాంక్షలకు చోటు ఉండాలనీ, అధికార వికేంద్రీకరణ జరగాలనీ... ఇలా ఎన్నో డిమాండ్లు ప్రజల నుంచి గడిచిన 20 ఏళ్లల్లో చాలా ఎక్కువయ్యాయి. సమాచార సాంకేతికత సాయంతో అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించటం మొదలైంది. ఎన్నికల హామీలను నెరవేర్చనప్పుడు పార్టీల వైఫల్యాలను, అవకాశవాదాన్ని తూర్పారపట్టటం సాధారణ ప్రవర్తనగా మారింది. మొబైల్‌ ఫోన్లను ఉపయోగించి ప్రభుత్వాలను దోషులుగా నిలబెడుతున్నారు. ఇలా పౌరసమాజం అనేక రూపాల్లో తన వాణిని వినిపించటం పరిపాలన మెరుగుదలకు ఎంతో కొంత కారణమైంది. పర్యావరణ విధ్వంసం, అసమానతలు, స్త్రీలహక్కులపై ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరాన్ని పౌరసమాజమే కల్పించింది. సమాచారహక్కు చట్టం లాంటివి పౌరసమాజ ఆందోళన నుంచే ఊపిరి పోసుకున్నాయి.

జీవితాలను మెరుగుపరచటానికి సామాజిక విప్లవం ఎంతోకొంత దోహదపడుతోంది. అందులో సందేహం లేదు. అదింకా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆరు అంశాల్లో ప్రభుత్వం అసమ్మతిని అణచివేయటమే మొదటిదిగా భావించొచ్చు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని (1975) తీసుకువచ్చి స్వచ్ఛంద సంస్థలను అదుపులో ఉంచటం ఇందులో ప్రధానమైంది. ఇందిరాగాంధీ దీనికి శ్రీకారం చుట్టారు. నిధులను స్తంభింపచేసి, లైసెన్సులు రద్దు చేయటాన్ని అస్త్రంగా వాడటం మొదలైంది. మోదీ హయాంలో ఇది పరాకాష్ఠకు చేరుకుంది. 2014లోనే 8,795 సంస్థల అకౌంట్లను స్తంభింపచేశారు. 4470 సంస్థల లైసెన్సులను రద్దుచేశారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను వదల్లేదు. భారీ ప్రాజెక్టులు, పర్యావరణ విధ్వంసం, మతోన్మాదం, హక్కుల అణచివేతపై ఆందోళన వ్యక్తంచేసిన సంస్థలన్నీ వేధింపులను ఎదుర్కొన్నాయి.


పౌరసమాజంలో చురుకైన పాత్రను పోషించే వారందరూ ప్రధానంగా ఎగువ మధ్యతరగతి నుంచి రావటాన్ని రెండో అడ్డంకిగా పరిగణించొచ్చు. దీంతో ఒకస్థాయి వరకూ మాత్రమే మార్పులకే వారు పరిమితం అవుతున్నారు. కింది వర్గాల సమస్యలకు తగిన దృష్టి పెట్టటం లేదు. సత్పరిపాలన కోసం ప్రయత్నిస్తున్న సంస్థలన్నీ కీలక మార్పుల కంటే అరకొర సంస్కరణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని కులాలకు, వర్గాలకు పరిమితమయ్యే సంస్థల వల్ల తాత్కాలిక ప్రయోజనాలున్నా విస్తృత స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు పక్కదారి పడుతున్నాయి. సామాజిక విప్లవానికి అడ్డంకిగా నిలవటాన్ని మూడో అంశంగా భావించొచ్చు. కోట్లాది కేసులు ఏళ్లతరబడి పరిష్కారం కాకుండా పేరుకుపోవటంతో ప్రజల ఆంక్షాలు అణగారిపోతున్నాయి. సత్వర న్యాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కేసులు సకాలంలో పరిష్కారమైతే ఎన్నో సామాజిక మార్పులు వస్తాయి. సమన్యాయపాలనలో పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందటం నాలుగో అడ్డంకిగా పరిగణించాలి. అవినీతిలో ఈ వ్యవస్థ కూరుకుపోయింది. సమన్యాయపాలన ఉండాలనే ఆకాంక్ష సామాజిక విప్లవంలో ఎంతో కీలకమైంది. పోలీసు వ్యవస్థ దాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక అయిదో అంశం– ప్రధాన స్రవంతిలోని మీడియాను పాలకపక్షాలు కట్టడి చేయటం. దీంతో సమస్యలపై చర్చలు, వాదోపవాదాలు మసకబారి పోతున్నాయి. ఇటీవల ఈ ధోరణి మరింత ఎక్కువైంది. ఆర్థిక స్థితిమంతులైన వారే చట్ట సభలకు ఎన్నికవ్వటంతో తమకు అప్రియమైన ప్రతి సమస్యనూ మీడియాలో రాకుండా చూస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి అందే విరాళాలు స్థానిక పౌర సమాజ సంస్థలకు పరిమితులను విధిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకంటే తాము గుర్తించిన వాటిపైనే పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. కొన్ని కులాలకు రిజర్వేషన్ల కల్పన అనేది అనేక సమస్యల్లో ఒకటి మాత్రమే. దానితో అన్ని సమస్యలూ పరిష్కారం కావు. కానీ రిజర్వేషన్ల కోసం పనిచేసే సంస్థలకే నిధులపరంగా అంతర్జాతీయ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.


పౌరసమాజ సంస్థలకు పరిమితులు, పక్షపాతాలు ఉన్నా... మతవాద ప్రమాదం పెరుగుతున్నా ప్రజాస్వామ్య ఆకాంక్షలు, విలువలు సమన్యాయ పాలనకు పెద్దపీట వేసే సామాజిక చైతన్య ఉధృతి సాధారణ యువతను ఇంకా కదిలిస్తూనే ఉంది. అదే ఇప్పుడు భారత్‌కు ఆశాజనకం! అది మందగిస్తే భవిష్యత్తు నిరాశాజనకమే! ఆరు అడ్డంకులు తొలగే తీరునుబట్టే సామాజిక విప్లవ సాఫల్యత ఎంతో నిర్ధారణవుతుంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Oct 11 , 2024 | 02:04 AM