Share News

మమతకు ఎదురుదెబ్బ

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:31 AM

జరిగిన స్కూలు పోస్టుల నియామకాలన్నీ రద్దుచేస్తూ కోల్‌కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. సార్వత్రక ఎన్నికల కాలంలో...

మమతకు ఎదురుదెబ్బ

పశ్చిమబెంగాల్‌లో ఎనిమిదేళ్ళక్రితం జరిగిన స్కూలు పోస్టుల నియామకాలన్నీ రద్దుచేస్తూ కోల్‌కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. సార్వత్రక ఎన్నికల కాలంలో, అదీ ఇదీ అని కాకుండా ప్రతీదీ రాజకీయం కాగలిగిన వాతావరణంలో కోర్టు అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలతో, ఎనిమిదేళ్ళు ఆర్జించిందంతా కొంతమంది నెలరోజుల్లోనే వెనక్కు ఇచ్చేయాలనేటువంటి తీవ్ర చర్యలతో వెలువరించిన ఈ తీర్పు మమతా బెనర్జీకీ పెద్ద ఎదురుదెబ్బ. హైకోర్టు తీర్పు సమంజసంగా లేదని, అది ఏకపక్షంగా, హడావుడిగా ఇచ్చిన తీర్పు అని సుప్రీంకోర్టుకు చేసుకున్న అప్పీలులో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బియ్యాన్నీ రాళ్ళనీ వేరుచేయకుండా, మొత్తం నియామకప్రక్రియనే తప్పుబట్టి, నియమితులైనవారందరూ దొంగలేనని నిర్ధారించడం అత్యంత అమానుషం, అన్యాయం అంటూ మమత ప్రభుత్వం సుప్రీంకోర్టును శరణువేడుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్ళలో పనిచేస్తున్న 23,123 మంది మీద ఇలా ఒక్కసారిగా వేటువేస్తే, పాఠశాలల పనితీరు దెబ్బతింటుంది, విద్యావ్యవస్థమీద తీవ్ర ప్రభావం పడుతుంది కనుక కోల్‌కతా హైకోర్టు తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది.


సీబీఐ నివేదిక, స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ధారణలను బట్టి చూసినప్పుడు, మొత్తం నియామక ప్రక్రియనే తప్పుబట్టడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ తీర్పు సీబీఐ దర్యాప్తు నివేదికను కాలదన్నుతున్నదని, మొత్తం నియామకాల్లో 4,327 పోస్టులు మాత్రమే అక్రమంగా భర్తీ అయ్యాయన్న నిర్ధారణలన్నింటినీ కొట్టిపారేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. 9, 10 తరగతుల టీచర్‌ పోస్టుల భర్తీలో 8.5శాతం, 11, 12 తరగతుల టీచర్‌ పోస్టుల భర్తీలో ౧4శాతం అపాయింట్‌మెంట్లు అక్రమంగా జరిగాయని వివిధ దర్యాప్తులు, విచారణలు తేల్చిన తరువాత హైకోర్టు ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తోంది. ఇలా, గ్రూప్‌ సీ, డీ, నాన్‌ టీచింగ్‌స్టాఫ్‌ పోస్టుల భర్తీలో ఎన్ని అక్రమం, ఎన్ని సక్రమం అన్నది ఇప్పటికే నిర్ధారణ అయిన విషయాన్ని గుర్తుచేస్తూ, సక్రమంగా ఉన్నవాటినీ న్యాయస్థానం రద్దుచేయడం సముచితం కాదని వాదిస్తోంది.


రద్దుచేసిన ఈ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీచేయడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. సరిగ్గా సార్వత్రక ఎన్నికల ముందు తమ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న ఈ తీర్పుపై ఉన్నతన్యాయస్థానంలో నిలిచిపోరాడటం రాజకీయంగా మరింత ముఖ్యం. ఎనిమిదేళ్ళుగా మమతను వెంటాడి వేధిస్తున్న వ్యవహారం ఇది. గతనెల బీజేపీలో చేరి, తామ్లుక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న అభిజిత్‌ గంగోపాధ్యాయ ప్రస్తుత రాజకీయ అవతారానికి ముందు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా ఈ కుంభకోణం మీద ఎంత శ్రద్ధచూపారో అందరికీ తెలుసు. ఆయన ఆదేశాల మేరకు వరుస ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతూ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ళమీద దాడులతో తృణమూల్‌ తీవ్రంగా అప్రదిష్టపాలైంది. ఈ వ్యవహారంలో పద్నాలుగు కేసులను సీబీఐ విచారణకు అప్పగించి సామాన్యుల్లో మంచిపేరు తెచ్చుకున్నారు ఆయన. తీర్పులు చెప్పడానికే పరిమితం కాకుండా ఈ కేసులకు సంబంధించి విలేఖరులతో మాట్లాడుతూ, చానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ తృణమూల్‌ నాయకులమీద విమర్శలు చేసేవారు ఆయన. మమతాబెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లక్ష్యాలుగా ఆయన వ్యాఖ్యలు ఉండేవి. అవినీతివ్యతిరేకపోరాటంలో ఎంతో చొరవచూపిన ఒక సిట్టింగ్‌ జడ్జి హఠాత్తుగా రాజకీయనాయకుడిగా మారిపోవడం, తృణమూల్‌ ఎంతోకాలంగా ఆరోపిస్తున్న పార్టీలోనే ఆయన చేరడం చాలామందిని విస్మయంలో పడవేసింది. ఆయన ఇచ్చిన అన్ని తీర్పులనూ సమీక్షించాలని అప్పట్లో డిమాండ్‌ చేసిన తృణమూల్, లక్షన్నరమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఇప్పటి తీర్పు వెనుక కూడా ఆయన, ఆయన పార్టీ ఉన్నారన్న రీతిలో వ్యాఖ్యానిస్తున్నది. సోమవారం ఓ భారీ రాజకీయ పేలుడు సంభవిస్తుందని, అది మేనత్త–మేనల్లుళ్ళ పార్టీని కుదిపేస్తుందని రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి ఓ వారం క్రితమే చెప్పిన వైనాన్ని కూడా అది గుర్తుచేస్తున్నది. కోల్‌కత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేస్తుందా లేదా అన్నది అటుంచితే, ఎన్నికల సమయంలో వెలువడిన ఈ తీర్పు ప్రభావం ప్రజలమీద ఎంతమేరకు ఉంటుందన్నది చూడాలి.

Updated Date - Apr 25 , 2024 | 02:31 AM