Share News

‘సంస్కర్త’ హృదయంలో సామాన్యుడు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:54 AM

నన్ను ఆర్బీఐ (భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌) గవర్నర్‌గా సెప్టెంబర్‌ 2008లో నియమించారు. ఈ నియామకం సమయంలో నేను న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నాను. ముంబైకు వెళ్లే ముందు...

‘సంస్కర్త’ హృదయంలో సామాన్యుడు

నన్ను ఆర్బీఐ (భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌) గవర్నర్‌గా సెప్టెంబర్‌ 2008లో నియమించారు. ఈ నియామకం సమయంలో నేను న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నాను. ముంబైకు వెళ్లే ముందు, నా మీద నిండు నమ్మకంతో ఈ బృహత్తర బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ వద్దకు వెళ్లాను. ఆయనతో నా సమావేశం క్లుప్తంగా– కేవలం 15 నిమిషాల పాటే జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, ప్రభుత్వ ద్రవ్య విధానానికి సంబంధించిన సవాళ్లు, ఇంకా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రూపాయి విలువను కాపాడడంలో ఆర్బీఐకి ఎదురయ్యే సమస్య గురించి మేము మాట్లాడుకున్నాం.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎదుటి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినే వ్యక్తి. ఈ గుణ విశేషం తక్కువ మందిలో ఉంటుంది, నాయకులలో కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. ఆయనకు అప్పటికే తెలిసిన విషయాన్ని చెప్పినా చాలా ఓర్పుగా వింటారు. తెలిసిన విషయమైనా మీ వివరణలో ఏమైనా సున్నిత సూక్ష్మాలూ, కొత్త దృక్కోణాలు ఉన్నాయేమోనని ఆయన శ్రద్ధ చూపుతారు. ఆయనలో నేను అభిమానించే విషయాలలో ఇది ఒకటి.


పది నిమిషాల పాటు మాటా మంతీ అయినాక నేను ఇలా అన్నాను: ‘సర్‌, మీరూ ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. నాకు ఏమైనా సలహా ఇవ్వగలరా?’ ఆయన స్వాభావికంగా ఒక అస్ఫుటమైన చిరునవ్వు (ఈ మందహాసాన్ని మీరు మన్మోహన్‌ పెదవులపై కంటే ఆయన కళ్లలోనే ఎక్కువగా చూడగలరు)తో విముఖత తెలిపారు. ‘సుబ్బారావు, మీకు నేను ఏమి సలహా ఇవ్వగలను? మీరు ఐఏఎస్‌లో ఉన్నారు. మీకు దేశం తెలుసు, ప్రభుత్వం తెలుసు. ఆర్బీఐ వ్యవహారాలు మీకు సుపరిచితమే. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు, పురోగతికి ఏది అత్యుత్తమమని మీరు భావిస్తారో అదే చేయండి. మీరు మన ఆర్థిక వ్యవస్థకు తప్పక మేలు చేస్తారనడంలో నాకు సందేహం లేదు’ అని మన్మోహన్‌ అన్నారు.

రెండు నిమిషాల అనంతరం ప్రధానమంత్రితో నా సంభాషణని ముగించాను. వెళ్ళేందుకు లేచి నిలబడగా ఆయన తన కుర్చీ నుంచి లేచి వచ్చి నాకు వీడ్కోలు చెప్పేందుకు ద్వారం దాకా వచ్చారు. ద్వారం వద్ద నా భుజం చుట్టూ తన చెయ్యి వేసి ఇలా అన్నారు: ‘సుబ్బారావు, ఇంతకు ముందు మీరు నా సలహా కోసం అడిగారు. మీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు ఐఏఎస్‌ నుంచి ఆర్బీఐకి వెడుతున్నారు. అదొక పెద్ద మార్పు. ఐఏఎస్‌లో వలే కాకుండా ఆర్బీఐలో మీరు ద్రవ్యోల్బణం, వడ్డీ రేటు, ద్రవ్య సరఫరా, ఋణ పెరుగుదల అంకెల అరణ్యంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉన్నది. ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రజలకు, వారి జీవనాధారాలకు ఎంత ముఖ్యమో మీరు మరచిపోవచ్చు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మీ నిర్ణయాలు, చర్యల ఫలితంగా నెలకొనే పరిస్థితులను తెలుసుకునేందుకు సదా జాగరూకతతో ఉండండి’.


ముంబైకు వెళ్లే ముందు ఢిల్లీలో ముగించవలసిన అనేక పనుల విషయం నా మనస్సునిండా ఉండడంతో ఆ సలహా, నేను ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన నిమిషంలోగానే నా మనసు నుంచి అదృశ్యమయింది. ఆ తరువాత కొద్ది నెలల్లో ఆర్బీఐ గవర్నర్‌గా నా బాధ్యతల నిర్వహణలో నేను తలమునకలుగా ఉండగా మన్మోహన్‌ సలహాలో ఇమిడి ఉన్న భావం, దాని ప్రాముఖ్యత నాకు తెలిసివచ్చాయి. ఈ విషయాన్ని చూడండి. ప్రతి త్రైమాసికంలోను ద్రవ్య విధాన సమీక్ష జరుగుతుంది. ఇందుకు సన్నద్ధంగా సంబంధిత వ్యక్తులు, సంస్థలు– ఆర్థికవేత్తలు, బ్యాంకులు, బ్యాంకేతర ఫైనాన్స్‌ కంపెనీలు, మార్కెట్ల ప్రతినిధులు అందరితో సంప్రదింపులు జరుగుతాయి. ఏ ఆర్బీఐ గవర్నర్‌ కూడా ఎప్పుడూ ఇలా చెప్పలేదు : ‘ఓకె, ఇప్పుడు వీధుల్లో ఉన్న 25 మంది సామాన్య పౌరులను తీసుకురండి. ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు తదితర ప్రధానమైన ఇతర అంశాల గురించి వారిని నేను సంప్రదించదలుచుకున్నాను’. చెప్పవచ్చిన దేమిటంటే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణమనేది ఒక తిరోగామి పన్ను. అది సంపన్నుల కంటే పేదవారిని ఎక్కువగా నష్టపరుస్తుంది. కనుక పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నదే మన్మోహన్‌ న్యూఢిల్లీలో నాకు వీడ్కోలు చెప్తూ ఇచ్చిన సలహా.


ఆర్బీఐ పట్ల మన్మోహన్‌ సింగ్‌కు గొప్ప గౌరవం ఉన్నది. దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడవలసిన అవసరాన్ని ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ఆర్బీఐ స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించగలిగేందుకు ఆయన చేయగలిగినదంతా చేశారు. గతంలో ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్‌ అది తన విశ్వసనీయతను కొనసాగించుకోవాలని సదా ఆకాంక్షించేవారు. ఆర్థిక మంత్రిగా ద్రవ్య విధానం విషయంలో ఆయన ఎటువంటి జోక్యం చేసుకోలేదు. విధాన నిర్దేశాలు, లక్ష్యాల విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య విభేదాలు ఏ ఒక్క ప్రభుత్వానికి గానీ లేదా ఏ ఒక్క ఆర్బీఐ గవర్నర్‌కు గానీ పరిమితమైనవీ కావు, ప్రత్యేకమైనవీ కావు. ఒక విధంగా అవి వ్యవస్థలోనే ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ ఆ అభిప్రాయ బేధాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోను ఆ భిన్నాభిప్రాయాలు బాగానే ఉన్నాయి. ఇది సహజం మీరు వాటిని ఆమోదించకపోయినా ఆ విభేదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఈ విభేదాలు మరింత తీవ్రంగా ఉండడం కద్దు. యూపీఏ రెండో ప్రభుత్వ హయాం (2009–14)లో ఇదే జరిగింది ప్రభుత్వంలోనే అంతర్గతంగా విధాన వైకల్యం ఏర్పడిందని ఆనాడు అందరూ భావించారు. అంతే కాకుండా శ్టాగ్‌ఫ్లేషన్‌ (స్తబ్ధతా ద్రవ్యోల్బణం– గిరాకీలో గానీ, ఉద్యోగితలో గానీ పెరుగుదల లేకుండా ద్రవ్యోల్బణం ఏర్పడిన స్థితి) గురించి భయాలు కూడా ముమ్మరంగా నెలకొన్న రోజులవి. విధాన నిర్దేశాలు, లక్ష్యాల విషయమై నాటి ఆర్థిక మంత్రులు –ప్రణబ్‌ ముఖర్జీ, పి.చిదంబరం–తో నాకు విభేదాలు ఉన్నాయి. విధాన సమీక్ష, మార్పుల చేర్పుల విషయంలో మన్మోహన్‌ ఎన్నడూ జోక్యం చేసుకోకపోవడం ఆయన గొప్పదనానికి ఒక తార్కాణం. విధాన సమీక్ష విషయమై ఆయనకు వివరించేందుకు వెళ్లినప్పుడు ఆర్థిక మంత్రితో మీ విభేదాలు పరిష్కరించుకున్నారని నేను ఆశిస్తున్నానని అనేవారు. ఆయన ఈ వ్యాఖ్య నాకు ఎంత మాత్రం సంతృప్తినిచ్చేది కాదు. అయినప్పటికీ ఆర్థిక మంత్రి అభ్యంతరాల గురించి ఆయనకు చెప్పేవాణ్ణి ఆ విషయం అంతటితో ముగిసేది.


కేంద్ర బ్యాంకుతో సంబంధం లేని విషయాలపై కూడా తన భావాల మంచి చెడ్డలను తెలుసుకునేందుకు ఆయన ఆర్బీఐని ఉపయోగించుకునేవారు. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గ్రామీణ ఉపాధి హామీ పథకం విస్తరణ, భూసేకరణ బిల్లు మొదలైన వాటిపై మా అభిప్రాయాలను అడిగి తెలుసుకునేవారు. ఇలా ఆర్బీఐకి సంబంధం లేని విషయాలపై మాతో సంప్రదించడం, సలహాలు తీసుకోవడం ఆర్బీఐ పట్ల ఆయన గౌరవానికి, విభిన్న వర్గాల వారి భావాలు, అభిప్రాయాలు తెలుసుకోవడంలో ఆయన శ్రద్ధాసక్తులకు నిదర్శనాలుగా చెప్పి తీరాలి. నా స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఒకసారి ఆయన నన్ను అడిగారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆయన విశేష శ్రద్ధ చూపేవారు. ఇది ఆయనలో ఉన్న ఒక ప్రశంసనీయమైన గుణ విశేషం. ఒకసారి అనుకోకుండా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో బ్యాంకులు పని చేస్తున్నాయా అని ఆయన అడిగారు. ఈ విషయాన్ని తరచి చూడాలన్న ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. ఈ కారణంగానే ఆయన హఠాత్తుగా అడిగిన ప్రశ్న నన్ను ఇబ్బంది పెట్టింది.


డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రి అయినప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖలో నేను మధ్యస్థాయి అధికారిగా ఉన్నాను. ఆర్థికమంత్రికి నాలుగు లేదా ఐదు స్థాయిల దిగువన ఉన్నాను. ఈ కారణంగా నేను అప్పుడు ఆయనతో పెద్దగా మాట్లాడడం జరగలేదు. అయితే ఆయన మా మంత్రి గనుక కొన్ని సమావేశాల్లో ఆయన్ను చూస్తుండేవాణ్ణి. మన్మోహన్‌ ఆర్థికమంత్రిగా రావడానికి మూడు సంవత్సరాల ముందు నుంచీ నేను ఆ శాఖలో ఉన్నాను. తొలుత నేను 1983 నుంచి 1993 దాకా ఆర్థిక వ్యవహారాల విభాగానికి డైరెక్టర్‌గా ఉండేవాణ్ణి. చెల్లింపుల సమతౌల్యత, వ్యవహారాల పర్యవేక్షణ నా బాధ్యతగా ఉండేది. ఆ తరువాత డాక్టర్‌ సి. రంగరాజన్‌ అధ్యక్షతన గల ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలికి కార్యదర్శిగా ఉన్నాను. అప్పుడు ప్రధానమంత్రితో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనేవాణ్ణి. ఉన్నతస్థాయి విధాన నిర్ణయ సమావేశాలకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. మన్మోహన్‌ గొప్ప శ్రద్ధాళువు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని సంపూర్ణంగా సమర్థించేవారు. అప్పట్లో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. భావి అవసరాలకు నయాపైసా సైతం మిగుల్చుకోవడానికి లేని దుస్థితి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయిన విపత్కర రోజులవి. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే రూపాయి విలువను రెండు దశల్లో తగ్గించారు. ఈ చర్య గొప్ప సత్ఫలితాన్నిచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ ఎట్టకేలకు మనకు సహాయమందించడానికి సంసిద్ధత తెలిపింది.


మన దేశ చరిత్రను మౌలికంగా మార్చివేసిన ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ‘ఒక భావానికి ఎప్పుడో అప్పుడు సమయం వస్తుంది. అప్పుడు దాని ప్రభావశీలతను ఈ ధరిత్రిపై ఏ శక్తీ అడ్డుకోలేదు’ అని ఫ్రెంచ్‌ మహారచయిత విక్టర్‌ హ్యూగో చెప్పిన సత్యాన్ని మన్మోహన్ సింగ్‌ 1991 జూలై 24న తన బడ్జెట్‌ ప్రసంగంలో ఉటంకించారు. మన ఆర్థిక చరిత్రలో గొప్ప మార్గదర్శక ప్రసంగమది. ఆ ప్రసంగాన్ని మన్మోహన్‌ సింగే స్వయంగా సిద్ధం చేసుకున్నారు. సమకాలీన విమర్శకులు, వ్యాఖ్యాతల కంటే చరిత్ర తన పట్ల దయా భావంతోను, ఉదారంగాను ఉంటుందని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా తన చివరి విలేఖరుల సమావేశంలో అన్నారు. మన దేశానికి హుందాగా, గౌరవపూర్ణంగా సేవలు అందించిన ఈ విద్వత్‌ పరుడు, వినమ్రశీలి, మృదుభాషి తనను గురించి తాను చెప్పుకున్న విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం ఉందనడంలో సందేహం లేదు.

దువ్వూరి సుబ్బారావు

భారత రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌

Updated Date - Dec 31 , 2024 | 12:54 AM