Share News

రాజకీయ వ్యంగ్యంలో రాటుదేలిన కలం

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:36 AM

ఎన్నికలు వచ్చినప్పుడు కొందరు కవులు ప్రత్యేకంగా ఆనాటి రాజకీయ కదలికల్ని, నేతల విన్యాసాల్ని ఉద్దేశించి రన్నింగ్ కామెంట్రీలు రాస్తుంటారు. అవన్నీ ఒకేలా ఉరకలెత్తవు. అలిశెట్టి ప్రభాకర్ చనిపోయి...

రాజకీయ వ్యంగ్యంలో రాటుదేలిన కలం

ఎన్నికలు వచ్చినప్పుడు కొందరు కవులు ప్రత్యేకంగా ఆనాటి రాజకీయ కదలికల్ని, నేతల విన్యాసాల్ని ఉద్దేశించి రన్నింగ్ కామెంట్రీలు రాస్తుంటారు. అవన్నీ ఒకేలా ఉరకలెత్తవు. అలిశెట్టి ప్రభాకర్ చనిపోయి 30 ఏండ్లయినా ఆయన చేసిన పొలిటికల్ కామెంట్రీ మాత్రం ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. దానికి కారణం ఆయన కలమెప్పుడూ నేతల వెనుకాలే పడేది. ప్రజల బతుకులెప్పుడూ పాలకుల నిజాయితీపైనే ఆధారపడి ఉంటాయని భావించి తన అక్షరాల్ని ఎక్కువగా అటువైపే సంధించాడు. అందుకే ఎలక్షన్లు వచ్చాయంటే చాలు పదును తగ్గని ప్రభాకర్ పదాలు మళ్ళీ మళ్ళీ వినపడుతుంటాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పత్రికల్లో, సోషల్ మీడియాలో ఆయన కవితా పంక్తులు విరివిగా కనబడ్డాయి: ‘‘అయిదేళ్లకొకసారి/ అసెంబ్లీలో మొసళ్ళు ప్రవేశించడం/ పెద్ద విశేషం కాదు/ జనమే ఓట్ల జలాశయాలై/ వాటిని బతికించడం విషాదం’’, ‘‘పాత ప్రభుత్వాల్లో/ చితికిపోయిన ప్రజలు/ కొత్త ప్రభుత్వాల్లో/ ‘చితి’కి పోకుంటే చాలు’’ అనేవి ఎన్నికల సమయంలో చక్కర్లు కొట్టిన వాటిలో మచ్చుకు కొన్ని. ఈ పంక్తులను చూస్తుంటే ఆయన మనతో పాటే ఉండి వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. అలిశెట్టి కవిత్వంలోని ప్రాసంగికత గురించి చాల చోట్ల ప్రస్తావన వచ్చింది. నిజానికి ప్రాసంగికత అంటే కవి రాసిన నాటి కాలపు పరిస్థితులు తర్వాతి కాలంలో మారకపోవడమే. ఎవరి రచననైనా ప్రాసంగికత కోల్పోయేలా చేయడమే నిజమైన సామాజిక అభివృద్ధి. కాని ఆ వృద్ధి, మార్పు సాధ్యపడటం లేదు. ‘‘తల్లిదండ్రులయందు దయలేని పుత్రుండు..’’ అని వేమన వందల ఏళ్ల క్రితమే రాశాడు. మనం మారక ఇలాంటి కవుల రాతల ప్రాసంగికతను ఎప్పటికీ కాపాడుతూ ఉన్నాం.

అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం రాసిన రెండు దశాబ్దాలు (1973–93) తెలుగు నేలపై చైతన్య ప్రవాహాలు ఉరకలెత్తాయి. విప్లవ పార్టీలు రాజ్యంతో ఢీకొన్న రోజులవి. తెలంగాణలో పచ్చగా కొనసాగిన పలు విప్లవ గ్రూపుల్లో ఏదో ఒక పక్షం వహించడం ఆనాటి యువత లక్షణంగా మారింది. జగిత్యాల జైత్రయాత్ర కన్న కవిగా అలిశెట్టి తన భావజాలం వైపే నిలిచాడు. దాన్ని నిలబెట్టేందుకే కవిత్వం రాశాడు. అయితే అలిశెట్టి కవిత్వంలో ‘తిరుగబడు’, ‘కూలదోయి’ లాంటి విధ్వంసక, హింసా ప్రేరక పదజాలం ఉండకుండా ఒక నూతన నిర్మాణాత్మకత కనబడుతుంది. సమాజం ఇలా ఉంది, ముందు దీన్ని అర్థం చేసుకో అన్నట్లుగా ఆయన అక్షరాలుంటాయి. ఈ ఓట్లు, ఎన్నికలు, గెలిచిన నేతలు, మారిన ముఖాలతో సమాజం మారదు అనే చైతన్యాన్ని అవి నూరి పోస్తాయి. అందుకోసం అనుక్షణం తన కవిత్వం ద్వారా ఆయన పాలకులను, పాలనా విధానాలను సూటిగా ఎదుర్కొన్నాడు. నేతల మాటల్లోని డొల్లతనాన్ని విప్పి చెప్పాడు. దీని కోసం తీవ్రమైన వ్యంగ్యాన్ని ఆశ్రయించాడు. ఆయన రాసేకాలంలో కాంగ్రెస్, టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ను పాలించాయి. నిలకడగా లేని రాజకీయ నాయకులను ‘‘వాడు ముందే వానపాము/ మరి ముడ్డెటో మూతెటో’’ అని సిగ్గు తీశాడు. ‘‘జలగలూ’ ‘బ్రహ్మ’జెముళ్ళు/ అవకాశవాది ‘రూలుకర్రా’/ ‘ఆరణాల కూలి’/ పునాది లేని ‘భవనం’ నాచారం ‘సన్యాసులు’/ వరుసగా ఎవరెవరు ముఖ్యమంత్రులైనా/ అక్షరాలా అరాచకంలో మార్పుండదు’’ అని రాశాడు. ఈ చురకలకు ఉడుక్కున్న పాలకపెద్దలు ఆయన సంగతేందో చూడమని లాఠీని ఉసిగొల్పారు. కమిషనర్ స్థాయి అధికారి పిలిపించి ఇలా రాస్తే ఊర్కొనేది లేదన్నాడు. అప్పటికే కరీంనగర్‌లో ఆయన ఒళ్ళు ఈ రుచి చూసింది. ప్రభాకర్ బెదరలేదు, తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు.

ఈ రాజకీయ నాయకుల దుర్నీతి వల్లే ప్రజల బతుకులిలా ఉన్నాయి. వీరంతా ఒకే రకమైన నేపథ్యం, ఒకే దురాలోచన కలవారే, మాయమాటలు చెప్పి అధికారాన్ని పొంది తమ వర్గానికి దేశ సంపదని దోచిపెట్టేవారే అనేది ప్రభాకర్ ప్రగాఢ విశ్వాసం. ఆయన నమ్మకాన్ని ఏ ప్రభుత్వం తప్పని నిరూపించలేదు. తన విశ్వాసాన్ని వదిలి ప్రభాకర్ ఎవరికీ జై కొట్టలేదు. బతికినంతకాలం పాలకుల దోపిడి విధానాన్ని ఎండగడుతూ ఓటర్లకు జాగ్రత్తలు చెప్పాడు. సాయుధ పోరాట మార్గమే ఈ పాలనను అంతం చేస్తుందని వ్యక్తిగతంగా నమ్మిన ప్రభాకర్ కవిత్వంలో మాత్రం విప్లవపంథా వైపు వెళ్ళమని ఏకపక్షంగా ఉద్బోధించలేదు. వర్గ స్వభావాన్ని తన అక్షరాల్లో సుస్పష్టంగా విశదీకరిస్తూ, పరిస్థితుల మార్పుకు ఘర్షణే మార్గమని సూచిస్తూ పోరాట రూపాన్ని మాత్రం ఎవరి శక్తిని బట్టి వారే నిర్ణయించుకోడానికి అవకాశం ఇచ్చాడు.

రాజకీయ పదవులు అందుకొనేవారిపై ప్రభాకర్‌కు పూర్తిస్థాయి స్పష్టత ఉంది. ఒక మనిషి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదుగుతాడో ‘దశ’లవారీగా ఇలా వివరించాడు. ‘‘ఇదివరకు/ సమాజ శరీరం మీద చీరుకుపోయే/ చిన్న రౌడీ ‘బ్లేడు’,/ ఇవాళ/ ఇంటింటికీ చేతులు జోడించి/ ఎన్నికల్లో మెరిసిన ఎమ్మెల్యే ‘కత్తి’,/ రేపు/ అరాచకీయాల్లో ఆరితేరి/ కాగల మంత్రి ‘గండ్ర గొడ్డలి’’ అని. ఈ మాటల్లో నిజమెంత ఉందో మనకు తెలిసిన నాయకుడి ఎవరి చరిత్రయినా పరిశీలిస్తే తెలుస్తుంది.

ఈ దేశంలోని ప్రజాస్వామ్యానికి ఆయన ఇచ్చిన కవితారూపం ఇలా ఉంది. ‘‘స్వయంగా శవాలే/ రాబందుల వద్దకి/ నడిచొస్తుంటే/ అంతకంతకూ/ పెరుగుతున్న/ అజ్ఞానపర్వతం/ చిన్న బ్యాలెట్ పెట్టెలో ఇమిడిపోతే/ మళ్ళీ/ కోటీశ్వరుడి పుట్టలోంచి/ బుసకొట్టేదే/ ఈ దేశపు ‘ప్రజాస్వామ్యం’’ అన్నాడు. పీక్కు తినండి అని దేశాన్ని ఓటర్లే అప్పగిస్తున్నారనే వేదన ఇందులో ఉంది. ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేయని చట్టసభలను ‘‘సగటు మనిషి ఓట్ల విత్తనాలు/ మొలకెత్తని బంజరు భూములు’’ అన్నాడు. ప్రజల సొమ్ము పాలకులకు ఎంత అందుబాటులో ఉందో చెప్పడానికి ‘‘కాసుకో కోసుకో రాజకీయమా/ ప్రజలు పనస తొనలు మీరు కత్తిమొనలు’’ అని రాశాడు.

ఓటరులో విచక్షణ కోరుతూ ‘‘పార్టీ ప్రచారాల/ నిలువెత్తు అలల/ సంద్రంలో ఓటు/ ఊగిసలాడే బోటు’’ అని, ‘‘గుర్తుంచుకో/ మనమేసే ఓటే వాడికి ఆక్సిజెన్ లేదా.. ఆక్సిడెంట్’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఓట్ల ద్వారా మారని ప్రభుత్వాల వైఖరిని ఉద్దేశించి ‘‘ఉండబట్టలేక/ ఓటేస్తే/ ఉన్నబట్టా/ లాక్కున్నట్లు..’’ అన్నాడు. పాలకులను పిల్లలకు పాలిచ్చే తల్లులతో గొప్పగా పోల్చుతూ ‘‘పాలిచ్చే తల్లే/ పీక నులుమబోతే/ పాపకి దిక్కెవరు/ పాలించే ప్రభువే/ పీడిస్తూ పోతే/ ప్రజలకు చుక్కెదురు’’ అని మాతృత్వ గుణాన్ని చెప్పాడు. చివరకు ‘‘రైళ్లయినా/ రాజకీయాలైనా/ పట్టాలు తప్పితే/ ఎప్పుడూ/ జనానికే/ జీవన్మరణ సమస్య’’ అనేది అసలు సత్యం. రోజులు మారాయి, రైతు బాగున్నాడు, ఆడవారికి రక్షణ ఉంది, యువత ఉద్యోగాలకు కొరత లేదు అని జనం ఒప్పుకొనే దాకా అలిశెట్టి అక్షరం ‘చివరి చరణం’ కాబోదు.

బి. నర్సన్

(నేడు అలిశెట్టి జయంతి, వర్ధంతి)

Updated Date - Jan 12 , 2024 | 01:36 AM