Share News

హార్దికాహ్వానం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:40 AM

నిన్ను మనసులోకి ఆహ్వానిస్తాను కానీ కొన్ని షరతులతో లోపలికి వస్తూనే తలుపుకు ఎడం వైపున నన్ను నేను చెక్కుకున్న తుడిపి తుడిపి రాసుకున్న...

హార్దికాహ్వానం

నిన్ను మనసులోకి ఆహ్వానిస్తాను

కానీ కొన్ని షరతులతో

లోపలికి వస్తూనే

తలుపుకు ఎడం వైపున

నన్ను నేను చెక్కుకున్న

తుడిపి తుడిపి రాసుకున్న

అస్తిత్వపు పలక తగిలించి ఉంది జాగ్రత్త

కుడివైపున

దిక్కుల దాకా పరుచుకుని

అపుడపుడూ ముడుచుకునే

అభిరుచుల అత్తిపత్తి ఉంది

అదేపనిగా ముట్టుకోకు

ఆ పక్కనే

ఇప్పుడిప్పుడే కలల మొగ్గలేసుకుని సన్న ఆశల తీగ

హృది కిటికీని అల్లుకుంటోంది

ఒక్క దోసెడు ప్రోత్సాహం చిలకరిస్తే

ముందు ముందు ఆ పరిమళాలు

నిన్నూ అలుముకుంటాయి

కాస్త ముందుకు వస్తే

వీలైనన్ని ఎత్తులకు ఎగురుతూ

అలా ఇలా

సరదాగా సందడి చేస్తుంటుంది

నా స్వేచ్ఛా పిట్ట

దానికోసం పంజరాన్ని మాత్రం పట్టుకుని రాకు

చప్టామీద చిన్ననాటి స్నేహం కూర్చోనుంది

పాత మంచం పైన కన్నవాళ్ళు

అలసి సేదదీరుతున్నారు

వసారాలో అయినవాళ్ళు

అదీ ఇదీ మాట్లాడుతూ ఉంటారు

చూసుకో..

అటూ ఇటుగా వెళ్తే

అనుమానపు అగాధాలున్నాయి

సమాంతరంగా సంయమనంతో అడుగులేయాలి

అప్పుడప్పుడు

సమస్యల మంచు కురుస్తుంది

పరస్పర చర్చల నెగడు

వెలిగించుకునే వెసులుబాటుంది

చిట్టి పొట్టి వైరుధ్యాలతో

అక్కడక్కడా తడుస్తుంది

అయినా సర్దుబాట్ల గాలీ వెలుతురు

కావాల్సినంత ఉంది

అంతగా అడిగావు కాబట్టి

ఎద తలుపైతే తెరుస్తాను

కానీ నీకోసం నాకు సంబంధించినవేవీ ఖాళీచేయను

పాతవేవీ పోగొట్టుకోను

ఒకటి మాత్రం హామీ ఇవ్వగలను

నిబంధనలు పాటించి వొస్తే

నువ్వు నిరాశచెందవు

వెన్నెల రాత్రి ఆరుబయట ఆకాశం కింద

వెల్లకిలా పడుకున్న అనుభూతి

నిన్ను చుట్టుముడుతుంది

హక్కుల్ని ఇవ్వడం లోని ఆనందం

అనుభవం లోకి వస్తుంది

అలాగే..

ఉమ్మడి ఆశయాల కౌగిలింతలు అదనం

దారల విజయ కుమారి

91772 92275

Updated Date - Apr 29 , 2024 | 04:40 AM