Share News

సోషలిజాన్నిశ్వాసించిన మహాకవి

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:06 AM

‘కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి’ అని కవికి ఉండవలసిన లక్షణాన్ని నిర్వచించాడు శ్రీరంగం శ్రీనివాసరావు. కష్టజీవుల స్వేదానికి ఖరీదు కట్టగల షరాబు లేడని కూడ సవాలు విసిరాడు...

సోషలిజాన్నిశ్వాసించిన మహాకవి

‘కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి’ అని కవికి ఉండవలసిన లక్షణాన్ని నిర్వచించాడు శ్రీరంగం శ్రీనివాసరావు. కష్టజీవుల స్వేదానికి ఖరీదు కట్టగల షరాబు లేడని కూడ సవాలు విసిరాడు. చైనాలోని రిక్షావాలాను, చెక్‌ దేశపు గని పనిమనిషినీ, ఐర్లండులోని ఓడ కళాసినీ మొత్తంగా ఖండాంతర నానాజాతుల్నీ, అణగారిన ఆర్తులందరినీ తన కవిత్వంలో స్పృశించాడు. సామ్రాజ్యపు దండయాత్రలో సాహసించిన సామాన్యుడిని, ప్రభువెక్కిన పల్లకి మోసే బోయీలను, నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవితాన్ని గురించి ప్రశ్నించాడు. తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పక్షాన తాను నిలబడ్డాడు. ‘బలవంతుల పన్నాగాలు, ధనవంతుల దౌర్జన్యాలు ఇకముందు సాగవని హెచ్చరించాడు. ‘బతుకు కాలి, పనికిమాలి శనిదేవత రధచక్రపు టిరుసులలో పడినలిగిన హీనులను, దీనులను ఓదార్చిన మహామనీషి. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశించాడు. ‘అంతేలే పేదల గుండెలు, అశ్రువులే నిండిన కుండలం’టూ బడుగుల జీవితాలను తడిమాడు. ‘పాతబడిన భావాలను లోతుగ పాతర వేయగ మహిళాలోకాన్ని కదలి రమన్నాడు. నెత్తురు మండే, శక్తులు నిండే యువకులను తన మరో ప్రపంచానికి ఆహ్వానించాడు. వాళ్ళను రాబోవు యుగం దూతలుగా వర్ణించాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వారసులైన భూమయ్య, కిష్టాగౌడ్‌లు ఎమర్జెన్సీ కాలంలో ఉరితీయబడ్డప్పుడు వారిని ‘భూమ్యా కాశాలు’గా కీర్తించాడు. సమాజానికి కాలం పెట్టిన అప్పును వారు తమ ప్రాణాలతో తీర్చుకున్నారని తీర్పు చెప్పాడు. సామ్రాజ్యవాద శక్తులను వ్యతిరేకించాడు. పౌరహక్కులను భుజాన వేసుకు మోశాడు. ‘సామ్యవాదమే నా గమ్యం... -అది నా కవిత్వంలోను, జీవితంలోను’ అని ప్రకటించిన స్వాప్నికుడు.


ఒకరేమిటి ఆ మహాకవి రాయనిదెవరిగూర్చి, పాడనిదెవరిమీద? అందుకే ఆయన ఇరవయ్యో శతాబ్దపు మహాకవిగా కొనియాడబడ్డాడు. వివాదాలెన్నున్నా ఆయన్ను మహాకవి కాదనలేకపోవడమే ఆయనలోని గొప్పదనం. ఆయన రక్తంతో రాగాలాపన చేయించాడు, మాటలతో మంటలు పుట్టించాడు. ప్రపంచపు బాధనంతా తనబాధగా చెప్పుకున్నాడు. అందుకే ఆయన ఒక నవయుగ వైతాళికుడు, ఒక యుగకర్త. ఒక దార్శనికుడు. ఆయన చేసిన అనువాద కవితలు బహుభాషాకోవిదుడని చెప్పకనే చెబుతాయి. జర్మన్‌, ఫ్రెంచ్‌, లాటిన్‌ భాషలు ఆయనకు కరతలామలకం. లెక్కలేనన్ని అవార్డులు ఆయనకే సొంతం. ఈనాటికైనా ఉద్యమాలకు ఆయన గేయాలే స్ఫూర్తి. అనేకులకు, అశాంతులకు, అనాధలకు, అభాగ్యులకు ఆయన కవిత్వం ఒక మంచి టానిక్‌. జీవితంలో ఓడిపోయినవారికి ఆయన గీతాలే దిక్కు. ఆయన ఈ జన సాహిత్యసముద్రం మీద చేసిన ‘సంతకాన్ని ఏ గాలీ చెరిపివేయ’లేకపోయింది. ఆయన సాహిత్యాన్ని, భావజాలాన్ని భావితరాలకు అందించడమే మహాకవి శ్రీశ్రీకి మన ఘన నివాళి.

కవీ! నీ గళగళన్మంగళ/ కళాకాహళ హళాహళిలో/ కలిసిపోతిని కరిగిపోతిని/ కానరాకేకదలిపోతిని.

శ్రీశ్రీకుమార్‌

(నేడు శ్రీశ్రీ జయంతి)

Updated Date - Apr 30 , 2024 | 03:06 AM