Share News

యువతకు భవిత లేని పాలన

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:07 AM

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం...

యువతకు భవిత లేని పాలన

మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం... విజయాన్ని ఆకాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. లేవండి, మేల్కోండి, గమ్యం చేసే వరకు విశ్రమించకండి అని స్వామి వివేకానంద వ్యాఖ్యానించారు. వాటిని స్ఫూర్తిగా తీసుకొని తమ హక్కులకై పోరాటాలు చేసేందుకు సమాయత్తం అవుతున్న యువతపై అక్రమ కేసులు పెడుతూ, జైళ్ల పాలు చేస్తూ, యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. గత నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో నాణ్యమైన విద్య లేదు, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు, ప్రైవేటు ఉద్యోగానికి ఒక్క పరిశ్రమ తేలేదు, పోనీ కూలో నాలో చేసుకుందామనుకున్నా పనులు లేవు. దీంతో యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నది.

యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మిన చంద్రబాబు, తన హయాంలో విద్య, ఉపాధి రంగాలపై అత్యంత శ్ర‎ద్ధ కనపరిచారు. నాడు రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షిస్తే, నేడు ఉన్న కంపెనీలను తరిమేసి యువతకు ఉపాధిని దూరం చేస్తున్నారు. గంజాయి, మత్తుపదార్ధాలకు యువతను దగ్గర చేసి వారి భవిష్యత్‌ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్‌రెడ్డిది. ఆయన పాలనలో ఉద్యోగాలు, ఉపాధి లేక దాదాపు 20వేల మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రద్దు చేసి వారిని ఉన్నత విద్యకు దూరం చేశారు. ‎టీడీపీ హయాంలో నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో ఉంటే, నేడు 19వ స్థానానికి దిగజార్చారు.

దాదాపు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీనిచ్చిన జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లల్లో కేవలం 10,143 ఉద్యోగాలతో ఫేక్ క్యాలెండర్ విడుదల చేశారు. ప్రతి ఏటా డీఎస్సీ జరుపుతామని, కనీసం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఏపీపీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చారు. యువత తన కాళ్ల మీద తాము నిలబడేలా చేసే కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాలు రద్దు చేశారు.

2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 4,009 ఉద్యోగాలు, రెండుసార్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ చేపట్టి 6,748 ఉద్యోగాలు, రెండు సార్లు డీఎస్సీ ద్వారా ‎17,591 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 64,000 ఉద్యోగాలు, ఐటి అభివృద్ధితో 34 వేల ఉద్యోగాలు కల్పించింది. రూ.300 కోట్లతో క్రీడాభివృద్ధి, ప్రతి నియోజకవర్గంలో క్రీడలకు ప్రోత్సాహంతో పాటు స్టేడియంల ఏర్పాటుకు ప్రణాళికలు చేశారు. కాని జగన్ ప్రభుత్వం తమ తప్పుల నుంచి యువతను పక్కదారి పట్టించేందుకు ఎన్నికల సమయంలో ఆడుదాం ఆంధ్రా అంటూ మోసపూరిత కార్యక్రమాలకు పూనుకున్నది. నాలుగున్నరేళ్లుగా క్యాసీనోలు, పేకాట క్లబ్‌లు, కోడి పందాలు, బెట్టింగ్‌ లకు ఇచ్చిన ప్రోత్సాహంలో ఒక్క శాతమైనా ఆరోగ్యవంతమైన క్రీడలకు ఇచ్చి ఉంటే రాష్ట్రం నుంచి ఎంతోమంది క్రీడాకారులు వచ్చి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌ యువత ప్రిజనరీ జగన్ వద్దు.. విజనరీ చంద్రబాబు కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేస్తే దాదాపు 80 దేశాల్లో నిరసనలు తెలియజేశారు. హైదరాబాద్‌లో యువత స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబుకి సంఘీభావం తెలియజేశారు. ఏపీలో అయితే ఆయన అరెస్ట్ అయిన రోజు నుంచి బయటకు వచ్చే వరకు యువతంతా రోడ్ల మీదకు వచ్చారు. మేలు చేసిన వాడి మీద ఉన్న అభిమానం కంటే నమ్మించి నట్టేట ముంచిన వాడి మీద కోపం ఎక్కువగా ఉంటుంది. ‘అందుకే పడి లేచే కెరటాలు నాకు ఆదర్శం. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు’ అన్న వివేకానందుడి వ్యాఖ్యలను స్ఫూర్తిగా నింపుకొని టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ లేచి నిలబడేందుకు నేటి యువత ఉవ్విళ్లూరుతున్నారు.

మానం ప్రణవ్ గోపాల్

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - Jan 11 , 2024 | 01:07 AM