Share News

వ్యవ‘సాయం’ మరచిన సర్కార్

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్లలో కుదేలై కుప్పకూలిన రంగాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది వ్యవసాయరంగం గురించే. ఇప్పటికీ అత్యధికశాతం ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన ఆ రంగాన్ని...

వ్యవ‘సాయం’ మరచిన సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్లలో కుదేలై కుప్పకూలిన రంగాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది వ్యవసాయరంగం గురించే. ఇప్పటికీ అత్యధికశాతం ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన ఆ రంగాన్ని పాలకులెవరు నిర్లక్ష్యం చేసినా అది క్షమించరాని నేరమే. ఆ నేరానికి పాల్పడిన రాష్ట్రప్రభుత్వం వ్యవసాయాన్ని అట్టడుగుస్థాయికి చేర్చింది.

దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతుకుటుంబాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు అందజేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం రైతాంగంపై ఉన్న అప్పు రూ. 1,91,970 కోట్లు కాగా, ఒక్కో రైతుకుటుంబంపై ఉన్న సగటు అప్పు రూ. 2,45,554. ఈ రుణభారం రైతుల పాలిట యమపాశంగా మారి బలవన్మరణాలకు పురిగొల్పింది. నేషనల్ క్రైమ్‌బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం కౌలురైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది.

వ్యవసాయం మీద, రైతుల సమస్యల మీద ఏ మాత్రం అవగాహన లేకుండా వ్యవహరించి ఈ రంగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారనడానికి అనేక ఉదాహరణలున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వ్యవసాయరంగానికి బడ్జెట్లో సగటున 5.5 శాతం నుంచి 6 శాతం మేర నిధులు కేటాయించేవారు. కానీ, ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ బడ్జెట్‌లో చేసిన వార్షిక కేటాయింపులు సగటున 4.16 శాతం మాత్రమే. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు ఈ రంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల్ని విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలుస్తుంది. దామాషా ప్రకారం ఈ ఐదేళ్లలో వ్యవసాయరంగంపై కనీసం రూ. 60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం రూ. 39 వేల కోట్లు ఖర్చు చేశారు. అంటే 35 శాతం మేర బడ్జెట్ నిధుల్లో కోతపెట్టారు. దీంతో రైతుసంక్షేమానికి గండి పడింది. అది ఈ ఐదేళ్లకాలంలో ప్రస్ఫుటంగా కనిపించింది.

దేశంలోనే ఎవరూ అందించని రీతిలో ‘రైతు భరోసా’ పథకం ద్వారా ఏడాదికి రూ. 13,500లను పెట్టుబడి సాయంగా ఒకేసారి అందజేస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా చాటుకుంది. కేంద్రం అందించే ఆరువేల రూపాయల్ని కూడా ఇందులో కలిపేసి గొప్పలు పోతోంది. ఆ మొత్తాన్ని తీసేస్తే రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఇచ్చింది రూ. 7,500 మాత్రమే. తొలిఏడాది మాత్రమే ఏకమొత్తంగా సాయాన్ని రైతుల ఖాతాలో జమచేశారు. ఆ తర్వాత మూడు దఫాలుగా అందించారు. చంద్రబాబు పాలనలో రైతులకు రూ. 50 వేల వరకు రుణమాఫీ జరిగింది. ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా ఐదేళ్లల్లో ఒక్కో రైతుకు రూ. 60 వేలు అందజేశారు. మొత్తం మీద రైతుకు అప్పుడు లక్షాపదివేలు అందితే, జగన్ సర్కార్ ఐదేళ్లలో రైతాంగానికి ఇచ్చింది రూ. 37,500 మాత్రమే. ఇక రాష్ట్రంలో 15.36 లక్షల మంది అర్హులైన కౌలురైతులు ఉండగా వారిలో లక్షమందికే ‘రైతుభరోసా’ అందించారు. మిగిలిన 14 లక్షలకు పైగా కౌలురైతులకు ఒక్కరూపాయి కూడా సాయం అందలేదు.

రైతులకు జరిగిన మరో ముఖ్యమైన నష్టం... పంటలకు కనీస మద్దతుధరలు లభించకపోవడం. ధాన్యం సేకరణను గణనీయంగా కుదించివేయడంతో రైతులు పంటలను తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారు. ప్రధానపంటలకు కనీస మద్దతుధరలు లభించని సమయాల్లో పొరుగురాష్ట్రాలు కొన్ని పంటలకు బోనస్ ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోగా, ఇక్కడ అలాంటి ఊసేలేదు.

వ్యవసాయపు పెట్టుబడులు ఏటా 15 నుంచి 20 శాతం మేర పెరుగుతూ రైతాంగానికి పెనుభారంగా మారుతున్న తరుణంలో దానిని తగ్గించడానికి గత ప్రభుత్వాలు నిర్దిష్టచర్యలు తీసుకునేవి. సున్నావడ్డీకి రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, పురుగుమందుల పంపిణీ, క్రమం తప్పకుండా భూసారపరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా అవసరమైన పొలాలకు ఉచితంగా జింక్, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మపోషకాల పంపిణీ వగైరాలతో చేయూతనందించేవారు. వైసీపీ పాలనలో భూసారపరీక్షల ముచ్చటే లేదు. సూక్ష్మపోషకాల మాటేలేదు. సున్నావడ్డీపై రుణసౌకర్యాన్ని లక్ష రూపాయలకు పరిమితం చేయడమే కాక సకాలంలో చెల్లించే రైతులకే వర్తింపజేస్తామన్న నిబంధన విధించారు. గతంలో ట్రాక్టర్లు పంపిణీ చేసి యాంత్రీకరణకు ప్రోత్సాహాన్నివ్వగా దానినీ అరకొరగానే అమలు చేస్తున్నారు.

కీలకమైన భారీ, మధ్యతరహా, చిన్నతరహా నీటిప్రాజెక్టులతో పాటు మైక్రో, ఇరిగేషన్ రంగాలను సైతం అలక్ష్యం చేయడంతో సాగునీరు అందక వ్యవసాయరంగం మరింత కళ తప్పింది. చంద్రబాబు హయాంలో రూ. 64 వేల కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులతో 23 సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి 32 లక్షల ఎకరాలను స్థిరీకరించగా వైసీపీ ఏలుబడిలో కేటాయించింది కేవలం రూ. 25 వేల కోట్లు మాత్రమే. రివర్స్ టెండర్ల పేరుతో 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. చివరకు ప్రాజెక్టుల క్రస్ట్ గేట్ల నిర్వహణకూ నిధుల లేమి వేధిస్తోందంటే, ఇంతకంటే వైఫల్యం ఏముంటుంది?

చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం కల్పించిన మైక్రోఇరిగేషన్ గత ఐదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో రైతులకు అధిక దిగుబడులు సాధించిపెట్టే మైక్రో ఇరిగేషన్ విధానాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి ఆ తర్వాత అన్నిప్రాంతాలకూ విస్తరింపజేసి మంచిఫలితాలు చూపించారు. రాష్ట్రవిభజన తర్వాత కూడా సూక్ష్మసేద్యాన్ని మెట్టప్రాంతాల్లో, ప్రత్యేకించి రాయలసీమలో ప్రాధాన్యతా కార్యక్రమంగా అమలుచేశారు. ఫలితంగా దేశంలోనే సూక్ష్మసేద్యం అధికంగా సాగుతున్న 10 జిల్లాల్లో 9 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. నాడు 18.60 లక్షల ఎకరాల సూక్ష్మసేద్యంతో కర్ణాటక తర్వాత రెండోస్థానంలో నిలవగా, నేడు ఆ మొత్తాన్ని 4.39 లక్షల ఎకరాలకు కుదించేశారు. దీనివల్ల రాయలసీమలోని నాలుగు ఉమ్మడిజిల్లాల రైతాంగానికి ఎంతగానో నష్టం జరిగింది.

వ్యవసాయరంగానికి అనుబంధంగా ఉండి రైతాంగానికి దన్నుగా నిలుస్తున్న పూలు, పండ్లతోటలు, ఔషధ మొక్కలు, కూరగాయలు మొదలైన ఉద్యానవనపంటలకు అందించే రాయితీలను సైతం నిలిపివేశారు. విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలు ఉన్న అరటి, మామిడి, కొబ్బరి, టమాటా తదితర పంటల్ని గత ప్రభుత్వం ప్రోత్సహించడమేకాక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పలుప్రాజెక్టులు చేపట్టింది. ముఖ్యంగా కూరగాయలు సాగుచేసే రైతాంగానికి ఎకరాకు రూ. 1,200 చొప్పున అందించిన రాయితీని ఈ ప్రభుత్వం ఎత్తేయడంతో వాటి ఉత్పత్తి 86.16లక్షల టన్నుల నుంచి నేడు సగటున 79లక్షల టన్నులకు పడిపోయింది. పండ్ల ఉత్పత్తి కూడా సగటున 182లక్షల టన్నుల నుంచి 176లక్షల టన్నులకు తగ్గిపోయింది.

మరోపక్క ఆక్వారైతుల పరిస్థితీ దయనీయంగానే ఉంది. సిండికేట్లు, దళారులు ఇష్టారాజ్యంగా ఈ పరిశ్రమను దెబ్బతీస్తోంటే రాష్ట్రప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్‌ను రూపాయిన్నరకే అందిస్తామన్న హామీని పాలకులు విస్మరించారు. అలాగే, పాడిరైతులకు లీటర్ పాలకు నాలుగు రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టారు. సహకార డెయిరీల ఆస్తులను అమూల్‌కు ధారాదత్తం చేస్తున్నారు.

గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలో కలిపి 45 లక్షల ఎకరాలలో సాగు తగ్గిపోవడం రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, పాలకులు మాత్రం గుర్రుపెట్టి మొద్దునిద్ర పోతున్నారు. ఒకే ఏడాదిలో లక్షల ఎకరాల్లో రైతులు విత్తనాలు చల్లకపోవడాన్ని ఓ రికార్డుగా చెబుతున్నారు. ఇంకోవైపు పంటలు వేసినా తుఫాన్లు, కరువు వల్ల 43 లక్షల ఎకరాల్లో సాగు దెబ్బతింది. మొత్తంగా చూస్తే... చేతికొచ్చే ఆహారధాన్యాలెంత? రైతులకు జరిగిన నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయల కొరత వల్ల వినియోగదారుడిపై పడే భారం ఎంత? దీనిని పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 6 నెలల క్రితం నుంచే ఎన్నికల మీద దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి జగన్ పాలనను పడకేయించారు. సమీక్షలు లేవు. క్షేత్రస్థాయి నివేదికల పరిశీలన లేదు. రైతుల్ని ఆదుకునే చర్యలు అసలే లేవు. ఆయన వారిని ఏనాడూ పరామర్శించిన పాపాన పోలేదు. రైతుసంఘాల నేతల్ని పిలిచి మాట్లాడిన సందర్భమూ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 10 వరుస ప్రకృతి విపత్తులతో 60 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇన్‌పుట్ సబ్సిడీగా రూ. 2 వేల కోట్లు అందించి ‘మమ’ అనిపించారు. అంటే జరిగిన నష్టంలో ఒక్కశాతం కూడా రైతులకు పరిహారంగా దక్కలేదు. మరోవైపు కేంద్రానికి ఇచ్చే నివేదికలలో జరిగిన పంటనష్టం లెక్కలను తక్కువగా చూపడం వల్ల కేంద్రం అందించే సాయం అరకొరగానే ఉంటోంది. రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నించకపోగా.. వారిని దెబ్బతీయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఈ వైఫల్యాలతో రాష్ట్రంలో వ్యవసాయరంగ ముఖచిత్రం భయానకంగా మారింది. రైతాంగం ఆవేదనను పట్టించుకుని వారికి బాసటగా నిలవని ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనమేమిటి? దేశ ఆహార భద్రతకు దోహదం చేసే తమ మేలు కోరని ఈ ప్రభుత్వాన్ని వదిలించుకుంటేనే అన్నదాతలు బాగుపడతారు. రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయి.

సి. రామచంద్రయ్య

శాసనమండలి మాజీ సభ్యులు

Updated Date - Apr 23 , 2024 | 03:46 AM