Share News

గ్లోబల్ లీడర్స్‌లో అగ్రగామి

ABN , Publish Date - Feb 27 , 2024 | 03:27 AM

ప్రపంచంలో నరేంద్రమోదీకి మించిన జనాదరణ గల అంతర్జాతీయ నేత మరెవరూ లేరని అమెరికాకు చెందిన గ్లోబల్ డిసిషన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్ మరోసారి ప్రకటించడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయం...

గ్లోబల్ లీడర్స్‌లో అగ్రగామి

ప్రపంచంలో నరేంద్రమోదీకి మించిన జనాదరణ గల అంతర్జాతీయ నేత మరెవరూ లేరని అమెరికాకు చెందిన గ్లోబల్ డిసిషన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్ మరోసారి ప్రకటించడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయం. ప్రతి రెండు నెలలకూ సర్వే జరిపే ఈ సంస్థ నరేంద్రమోదీకి 78 శాతం ఆమోద యోగ్యత ఉన్నదని వెల్లడించింది. మోదీకి దరిదాపుల్లో మరే దేశ నేత కనపడకపోగా, మెక్సికో, అర్జెంటీనా అధ్యక్షుల జనాదరణ 65 శాతంలోపే ఉన్నది. మోదీకి జనాదరణ గల అంతర్జాతీయ నేతల్లో ప్రథమ స్థానం దక్కగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 11వ స్థానంలోనూ, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో 17వ స్థానంలోనూ, బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ 20వ స్థానంలోనూ ఉన్నారు. రెండు నెలల క్రితం ఈ ఏజెన్సీ సర్వే జరిపినప్పుడు కూడా మోదీ 76 శాతం ఆధిక్యతతో అగ్రస్థానం సాధించారు. ఏ ప్రాతిపదికన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ ఫలితాలు ప్రకటిస్తోంది? ఆధునిక దేశాల్లో నేతలు వివేకవంతంగా, వేగంగా, మెరుగైన విధంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రాతిపదికగా ఈ సంస్థ నేతల పనితీరును బేరీజు వేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి ఆధునిక కొలమానాలు, హై ఫ్రీక్వెన్సీ డాటాను జోడించి ఏ దేశ నాయకుడు మెరుగైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అక్కడి ప్రజలు భావిస్తున్నారో సమాచారం సేకరిస్తుంది.

దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణం విషయంలో మోదీలా త్వరితగతిన వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే నేత ఎవరూ లేరని చెప్పేందుకు గత ఆరునెలలుగా రూ. లక్షల కోట్ల మేరకు మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్న తీరే నిదర్శనం. సోమవారం ఒక్క రోజే ఆయన దేశంలో రూ. 41వేల కోట్ల విలువైన 2వేల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అంతకు ఒక్క రోజు ముందు వైద్య, రహదారి, రైల్వే, ఇంధన, పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక రంగాలకు చెందిన రూ 48,100 కోట్ల మేరకు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఇందులో మంగళగిరిలో ఎయిమ్స్‌తో పాటు అయిదు ఎయిమ్స్‌లు ఉన్నాయి. విశాఖపట్టణంలో ఐఐఎం, తిరుపతిలో ఐఐటి, కర్నూల్‌లో త్రిబుల్ ఐటీ కూడా మోదీ ప్రారంభించిన ఉన్నత విద్యాసంస్థల్లో ఉన్నాయి. అదే రోజు ద్వారకలో ఆయన రూ. 4150 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలో అతి పొడవైన ద్వారకా సేతును ప్రారంభించడమే కాక. సముద్రంలో మునిగిపోయిన పురాతన ద్వారకా నగరిని సందర్శించేందుకు సముద్ర గర్భంలో మునిగి పూజలు జరపడం మోదీ సాహసానికి, భక్తి శ్రద్ధలకు నిదర్శనం. 73 సంవత్సరాల వయస్సులో ఆయన స్కూబా డైవింగ్ చేసి సముద్ర గర్భానికి చేరుకుని సుదీర్ఘ సమయం గడపడం చిన్న విషయం కాదు. ‘నేను పురాతన ద్వారకా నగరిని సందర్శిస్తున్నప్పుడు నా కళ్లముందు 21వ శతాబ్దపు భవ్యభారతం కనపడింది. భారతదేశాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయాలనే నా సంకల్పం మరింత బలపడింది..’ అని మోదీ అన్నారు. అలాంటి సంకల్ఫం ఉన్నందు వల్లే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భారతీయులే కాదు, పలు దేశాధినేతలు మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మోదీ అడిగితే చాలు ప్రపంచంలో ఏ దేశాధినేతా కాదనలేడని చెప్పేందుకు అబూదాబీలో భారతీయులకోసం మందిరం నిర్మించేందుకు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ అంగీకరించడం నిదర్శనం. 2010లో మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడి భారతీయులకు ఆలయం నిర్మించాలనుకుంటున్నట్లు అభ్యర్థించినప్పుడు అందుకు తమ అధ్యక్షుడు ఆమోద ముద్ర వేసేందుకు కేవలం అయిదునిమిషాలు పట్టిందని ఆ దేశ దౌత్య సలహాదారు మహమ్మద్ గర్గాష్ ఇటీవల వెల్లడించారు. మోదీ అడగ్గానే ఒక భవ్య హిందూ మందిర నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేసిందని ఆయన చెప్పారు. అబుదాబీలో 27 ఎకరాల స్థలంలో స్వామి నారాయణ్ సంస్థ నిర్మించిన అక్షరధామ్ మందిరం మధ్య ప్రాచ్యంలోనే అతి పెద్ద మందిరం. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోపే పది రోజుల క్రితం మోదీ ఈ మందిరాన్ని ప్రారంభించారు. మోదీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కూ, భారత దేశానికీ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయని, స్వేచ్ఛా వర్తక ఒప్పందంపై సంతకాలు జరిగాయని మహమ్మద్ గర్గాష్ చెప్పారు.

మార్నింగ్ కన్సల్ట్ వంటి అమెరికన్ సంస్థ మాత్రమే కాదు, చైనాలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న గ్లోబల్ టైమ్స్ కూడా తాజాగా మోదీ హయాంలో భారత్ ఆర్థిక వ్యూహాలు, దౌత్యపరమైన విజయాలను ప్రశంసించింది. ‘భారత్ నేరేటివ్’ అన్న శీర్షికతో ప్రచురించిన విశ్లేషణలో ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా రూపొందే క్రమంలో మోదీ విదేశాంగ విధానాన్ని రూపొందించారని తెలిపింది. బలమైన ఆర్థిక విస్తరణ, పట్టణ పాలనలో భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ సంబంధాల్లో గుణాత్మకమైన మార్పు వల్ల మోదీ హయాంలో భారత్ అనేక విజయాలు సాధిచిందని షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీలో సౌత్ ఆసియన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ ఝాంగ్ జియాడాంగ్ ఈ విశ్లేషణ చేశారు. రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ సమయంలో సంయమనంగా వ్యవహరిస్తూనే అమెరికా, జపాన్, రష్యా వంటి గ్లోబల్ శక్తులతో బలమైన సంబంధాలు ఏర్పర్చుకోవడం మోదీ బహుముఖ వైఖరికి నిదర్శమని ఆయన అన్నారు.

ప్రపంచంలో భౌగోళిక రాజకీయాల సంక్లిష్టతలను మోదీ అర్థం చేసుకున్నట్లుగా మరే నేత అర్థం చేసుకోలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదానితో మరొకటికి సంబంధాలు ఏర్పర్చుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే కాదు, ఒకదానిపై మరొకటి ఆధారపడక తప్పదని గ్రహించిన నేత మోదీ. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఒక ఆచరణీయ దృక్పథాన్ని అవలంబించారు. అందువల్ల అమెరికాతో పాటు అనేక అగ్రరాజ్యాలతో ఆయన లోతైన సంబంధాలు ఏర్పర్చుకోగలిగారు.

ప్రపంచ దేశాలు మాత్రమే కాదు, భారతీయుల్లో అత్యధిక శాతం మోదీ విదేశాంగ విధానాన్ని శ్లాఘిస్తున్నారని ఆబ్జర్వర్ రీసర్చ్‌ ఫౌండేషన్ తాజాగా నిర్వహించిన సర్వే తెలిపింది. అమెరికాతో పాటు గ్లోబల్ శక్తులతో మోదీ ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పిన తీరును 81 శాతం మంది ప్రశంసించారు. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్‌తో సంబంధాలే రానున్న దశాబ్దంలో మనను బలోపేతంగా మారుస్తాయని వారు భావించారు. క్వాడ్‌లో చేరడం భారత ప్రయోజనాలకు ముఖ్యమని వారు అంగీకరించారు. జీ–20 దేశాల నిర్వహణ, ఆఫ్రికన్ యూనియన్‌ను భాగస్వామ్యం చేయడం, ఖతార్ మన దేశ నేవీ మాజీ అధికారులను బేషరతుగా విడుదల చేయడం, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌తో సంబంధాలు బలపడడం, బ్రిక్స్, షాంఘై కార్పోరేషన్‌లో బలమైన పాత్ర పోషించడం వంటి పరిణామాలను భారతీయ యువత గమనిస్తున్నారు. ప్రపంచంలో మోదీ ఏ దేశానికి వెళ్లినా వేల సంఖ్యలో భారతీయులు ఆయనను కలుసుకునేందుకు ముందుకు వస్తున్నారు. భారతీయతను ప్రపంచ వ్యాప్తంగా బలోపేతం చేసిన, మన అస్తిత్వాన్ని ప్రపంచం గ్రహించకతప్పని పరిస్థితి కల్పించిన మోదీ వంటి నేత మన దేశంలో ఎవరైనా ఉన్నారా?

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - Feb 27 , 2024 | 03:27 AM