Share News

బూటకపు బటన్ మాటున దగా దీవెన

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:21 AM

గత ప్రభుత్వాలు పేద విద్యార్థులకు అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజు రీయింబర్స్‌ మెంట్ పథకాలను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనగా పేర్లు మార్చి తానేదో...

బూటకపు బటన్ మాటున దగా దీవెన

గత ప్రభుత్వాలు పేద విద్యార్థులకు అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజు రీయింబర్స్‌ మెంట్ పథకాలను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనగా పేర్లు మార్చి తానేదో కొత్తగా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదం. టీడీపీ ప్రభుత్వం ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేస్తే, నేడు వైసీపీ కేవలం 8 లక్షల మందికి... అది కూడా విడతల వారీగా అందిస్తోంది. అంటే సగం మంది పేద విద్యార్థులను మోసగించారు.

గడిచిన అయిదేళ్లుగా ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం భయభ్రాంతులకు గురయ్యేలా చేశారు. ఏడాదికి 4 విడతల చొప్పున అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయిస్తూ విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రభుత్వం ఏ విడత ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు. కళాశాలల యాజమాన్యాలకు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయో తెలియదు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసిన దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఉన్నత విద్య చదివే అవకాశంతో పాటు ఉద్యోగావకాశాలు కూడా కోల్పోయారు.

నాలుగు విడతలు బకాయిపెట్టిన విద్యాదీవెన సొమ్ము రూ.2,800కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పీజీ విద్యార్థులకు ఎగ్గొట్టినది రూ.450కోట్లు, విద్యాదీవెన కింద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తగ్గించినది రూ.120 కోట్లతో... మొత్తం ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు రూ.3,400 కోట్లు బాకీ పెట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన సొమ్ముని, ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే క్రమం తప్పకుండా ఠంఛన్‌గా చెల్లిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జూలై 2023 త్రైమాసికానికి (2023–24 విద్యాసంవత్సరం) సంబంధించి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ డిసెంబర్ 28న రూ.584 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నానని డిసెంబర్ 29న పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చారు. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాదీవెన ఒక త్రైమాసికం సొమ్ము సుమారుగా రూ.700 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టారు. అలానే 2022–23 విద్యా సంవత్సరానికి కూడా ఒక త్రైమాసికం సొమ్ము ఎగ్గొట్టింది నిజం కాదా? ఈ విద్యాసంవత్సరం (2023–24) ఇప్పటికే మూడు త్రైమాసికాల ఫీజు విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక విడత మాత్రమే చెల్లించారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నాలుగు విడతల విద్యాదీవెన సొమ్ము విద్యార్థులకు బాకీ ఉన్నారు. వాటితో పాటు ప్రైవేట్ కళాశాలల్లో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ 2020–21 నుంచి రద్దు చేశారు.

విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులకు సంబంధించి విద్యార్థుల సంఖ్యలో కూడా ఏటికేడు భారీగా కోత పెడుతున్నారు. నవంబర్ 30, 2021న 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686కోట్లు ఇస్తే, డిసెంబర్ 29, 2023న 8,09,039 మంది విద్యార్థులకు రూ.584కోట్లు చెల్లించారు. అమ్మఒడి పేరుతో తల్లుల్ని మోసం చేయడం.. విద్యాదీవెన పేరుతో విద్యార్థుల్ని వంచించడం ఇదీ జగన్మోహన్ రెడ్డి బూటకపు బటన్ నొక్కుడు కాదా? త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే 2023–24 విద్యా సంవత్సరం విద్యాదీవెన కింద చెల్లించాల్సిన మరో రెండు విడతల సొమ్ము కూడా ఎగ్గొట్టినట్టే.

టీడీపీ హయాంలో కళాశాల, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాల యాజమాన్యాలకే అందేది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక తల్లులకు ఇస్తున్నానని చెప్పి ఈ విధంగా కోతలతో భావిభారత పౌరుల్ని బలితీసుకుంటున్నారు. 2022 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాలేదని శ్రీకాకుళంలో ఒక యువతి స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 2021–22 విద్యాసంవత్సరం నాలుగో త్రైమాసికం విద్యాదీవెన సొమ్ము ఇప్పటికీ చెల్లించకపోవడంతో విజయవాడలోని ఒక కళాశాల రూ.60వేల ఫీజు కట్టాలని ఒక విద్యార్థికి నోటీసులు ఇచ్చి, పరీక్షలు రాయకుండా అడ్డుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో డిసెంబర్ 17, 2023న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం నుంచి అందలేదంటూ నర్సింగ్ కళాశాల యాజమాన్యం దాదాపు 30మంది ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని బయటకు పంపింది. ఫీజులు చెల్లించలేదని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 24 మంది విద్యార్థుల్ని 2022 ఆగస్టులో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. విడతల వారీ చెల్లింపులను కాలేజీలు అంగీకరించకపోవడంతో విద్యార్థులు కాలేజీలకు దూరం అవుతున్నారు.

ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేశారు. దీనితో 1.7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ పథకం నిలిచిపోయి వారి ఉన్నత చదువుల కల చెదిరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్, అఫిలియేషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఫీజులు 40 నుంచి 50 శాతం పెంచేశారు. క్వాలిటీ విద్యను దూరం చేశారు.

కళాశాలలకు కట్టాల్సిన ఫీజులను తల్లుల ఖాతాల్లో వేసి... మళ్లీ వారు కళాశాలలకు కట్టే పద్ధతి వద్దు అని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి నవంబర్ 30, 2021 తల్లుల ఖాతాలో నిధులు జమచేస్తూ జీవోను విడుదల చేసింది. విద్యా దీవెన పథకానికి ఒక విడతకి రూ.20కోట్లు చొప్పున నాలుగు విడతలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులకు మేలు జరిగి ఉండేది. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా జగన్ తన మీడియా సంస్థలకు మళ్లించుకుంటున్నారు.

మానం ప్రణవ్ గోపాల్

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - Mar 08 , 2024 | 01:21 AM