Share News

విమర్శలో విశిష్ట తరంగం

ABN , Publish Date - May 15 , 2024 | 01:03 AM

తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ఉత్తమమైన సంప్రదాయం ఉంది. అనేకమంది మార్క్సిస్టు విమర్శకులు తెలుగు సాహిత్య వికాసాన్ని అందులో అభివ్యక్తమైన...

విమర్శలో విశిష్ట తరంగం

తెలుగు సాహిత్యంలో మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ఉత్తమమైన సంప్రదాయం ఉంది. అనేకమంది మార్క్సిస్టు విమర్శకులు తెలుగు సాహిత్య వికాసాన్ని అందులో అభివ్యక్తమైన రకరకాల సాహిత్య సామాజిక అంశాలను విశ్లేషించడానికి కృషి చేశారు. అభ్యుదయ సాహిత్య కాలంలో జీవీ కృష్ణారావు, తర్వాత మద్దుకూరి చంద్రశేఖర రావు, కొడవటిగంటి, కెవిఆర్, రారా, వెల్చేరు, చేకూరి రామారావు, బాలగోపాల్ లాంటివాళ్ళు తెలుగు మార్క్సిస్టు విమర్శకు కలిగించిన దోహదం ఎంతో విలువైనది.


పలువురు మార్క్సిస్టు విమర్శకులు ఆధునిక సాహిత్యానికి మాత్రమే పరిమితమైన కాలంలో సంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించడంలో, అందుకు ఉపకరించే మార్గాలను అన్వేషించడంలో కేకేఆర్ చూపిన శ్రద్ధ అత్యంత ప్రశంసనీయమైంది. అంతేకాదు, భారతీయ లాక్షణిక గ్రంథాలను సైతం అధ్యయనం చేసే మార్గాన్ని ప్రవేశపెట్టడంలో వారి కృషి ఎంతో విలువైనది. ప్రాచీన సాహిత్య అధ్యయనానికి చరిత్రలో గాఢమైన అధ్యయనం, చరిత్ర పరిశోధన పట్ల గౌరవం ఉంటే తప్ప సాహిత్యానికి అనువర్తింపజేయడంలో సరియైన అవగాహన రూపొందదు. చారిత్రక అవగాహనకు సాహిత్యం ఎంతగా ఉపకరిస్తుందో, సాహిత్య అవగాహనకు చరిత్ర అంతగా దోహదపడుతుంది.

భారతీయ చారిత్రక అంశాలను అధ్యయనం చేసిన పలువురు చరిత్రకారులు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ప్రధాన దృక్పథంగా స్వీకరించినా వారిలో చాలామంది ఏ పార్టీకి అనుబంధం కలిగిన వారు కాదు. అంతే కాదు, వారి రచనల్లో పదేపదే మార్క్స్ కొటేషన్స్ కూడా కనబడవు. అది చాలా తెలివిడిగా ఆయా చరిత్రకారులు అనుసరించిన పద్ధతిగా తదనంతర విశ్లేషకులు భావించారు. తమ సాహిత్య అవగాహనకు ఆయా చరిత్రకారుల రచనలను ఆకరంగా స్వీకరించిన కేకేఆర్ చరిత్రకారుల స్ఫూర్తిని స్వీకరించినట్లుగా మనం గుర్తించవచ్చు. కేకేఆర్ రచనల్లో సహితం పదేపదే ఆయా మూల రచయితల కొటేషన్స్ గానీ, చరిత్రకారుల ఉద్ధరణలు గాని అధికంగా కనిపించవు. కేకేఆర్‌ చారిత్రక అవగాహనను డిడి కోశాంబి, సాహిత్య అవగాహనను రెమెండ్ విలియమ్స్ లాంటి వారు ప్రభావితం చేశారు.


నన్నయ తెలుగు సాహిత్యంపై గాఢమైన ప్రభావాన్ని వేయడానికి కేవలం మహాభారతాన్ని అనువదించడం వల్ల కాక, తమ కాలం నాటికి అవసరమైన ఎన్నో మార్పులను కావ్య రచనలో ప్రవేశపెట్టారని కొన్ని సామాజిక అంశాల్లో సమకాలీన వైదిక ఆధిపత్యానికి సంబంధించిన భావనలను చాలా బలంగా ప్రతిపాదించారని, అందువల్లనే వైదిక సంప్రదాయాన్ని అనుసరించిన అనేకమంది కవులకు నన్నయ ఆదర్శమయ్యారని నన్నయ చారిత్రక భూమికలో చాలా విపులంగా విశ్లేషించారు కేకేఆర్. అలాగే తెలుగు సాహిత్యం మరో చూపు, తెలుగులో తొలి సమాజ కవులు అనే గ్రంథాలకు కేకేఆర్ వేసిన ప్రణాళిక కూడా చాలా విలక్షణమైనది.

ఆస్థాన సాహిత్యానికి, ఆస్థానేతర సాహిత్యానికి, ప్రజా సాహిత్యానికి మధ్య అనేక అంతరాలు ఉంటాయని, ఆయా కవులు ఏ సామాజిక రాజకీయ నేపథ్యం నుంచి తమ సాహిత్యాన్ని వెలువరించారో ప్రత్యేకంగా విశ్లేషించడం ద్వారానే వారి రచనలకున్న ప్రాసంగికతను అర్థం చేసుకోవడానికి వీలవుతుందని కేకేఆర్ ఆ గ్రంథాల్లో విపులంగా చర్చించారు. భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే సమయంలో భక్తి సాహిత్యాన్ని గురించి ఎంతో విశేషమైన సమాచారం ఉంది కానీ తెలుగులో చాలా పరిమితంగా మాత్రమే అధ్యయనాలు జరిగాయి. అందుకు ప్రధాన కారణం తెలుగులో అదొక ప్రధాన స్రవంతి కాకపోవడం. అయినా అది అందించిన చైతన్యాన్ని గూర్చి అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఈ పుస్తకాలలో చాలా వివరంగా చర్చించి, భక్తి భావనకున్న సాహిత్య సామాజిక నేపథ్యాన్ని ప్రామాణికంగా నిరూపించగలిగారు.


కేకేఆర్ చాలా విలువైన వ్యాసాల్లో ‘భాష, సాహిత్యం, కవిత్వంలో అలంకారాలు’ అనేది ఒకటి. భారతీయ అలంకార శాస్త్రం పట్ల మార్క్సిస్టు విమర్శకులలో చాలా పరిమితమైన అవగాహన ఉంది. తెలుగు వారిలో ఒకరకంగా దాని పట్ల తీవ్ర అసహిష్ణుత కూడా ఉంది. కానీ కేకేఆర్ భారతీయ అలంకార శాస్త్రాన్ని చాలా సానుకూల దృక్పథంతో అధ్యయనం చేయాల్సిన పద్ధతిని గూర్చి ఎంతో వివరంగా ఈ వ్యాసంలో చర్చించారు. రసం, ధ్వని, అలంకారం, వక్రోక్తి, ప్రతీకాత్మక అంశాలను పాశ్చాత్యులు ప్రతిపాదించిన రకరకాల సిద్ధాంతాలతో సమన్వయం చేస్తూ జరిపిన అధ్యయనం కేకేఆర్‌కి ప్రాచీన సాహిత్యం పట్ల ఉన్న గాఢమైన అభినివేశానికి తార్కాణంగా నిలుస్తుంది.

ఆధునిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆధునిక సమాజ లక్షణాలు అర్థం కావాలని కేకేఆర్‌ చెబుతారు. ఆధునికత అనేది కాలవాచి కాదని, జీవన విధానంలోను సామాజిక సంబంధాల్లోను వచ్చే మార్పులను అర్థం చేసుకోగలిగితే సామాజిక స్వరూపాన్ని, ఆ సమాజంలో వచ్చే సాహిత్యాన్ని అర్థం చేసుకోగలమని కేకేఆర్ భావన. ఆధునిక భావజాలానికి, ఉత్తమ రచనా సంప్రదాయానికి గురజాడ ప్రవేశపెట్టిన పద్ధతి ఎంతగానో దోహద పడిందని కేకేఆర్ అభిప్రాయం. గురజాడ కన్యాశుల్కంలో స్వీకరించిన వస్తువు, ఉపయోగించిన భాష, కథల్లో ఆయన చర్చించిన సామాజిక విషయాలు ఆధునికతకు బలీయమైన పునాదులు వేశాయని అభిప్రాయపడ్డారు. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషావాద అవసరాన్ని గుర్తింపచేయడంలో, ఎన్నో భాషా శాస్త్ర సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఆధునిక వ్యవహార రూపాన్ని అందించడానికి దోహదపడ్డారని ‘నూరేళ్ల తెలుగునాడు’లో చర్చించారు.


ఏ రచయిత జీవితాన్ని గూర్చి విడిగా రాసినా ఆ వ్యక్తి ఏ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో వాటి మీద మాత్రమే కేకేఆర్ దృష్టి ఉండేది. ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను, వివాదాస్పద విషయాలను స్పృశించడం ఆయనకు అంతగా ఇష్టం ఉండేది కాదు. అందుకే అనవసర చర్చల కంటే విస్తృత ప్రజానీకానికి ఉపకరించే భావనలను మాత్రమే అధికంగా చర్చించడం చూస్తాం. ఆధునిక కాలంలో ఎంతో వివాదాస్పదంగా ఉన్న సంబంధాలను సుకుమారంగా స్పృశించి వదిలి వేసేవారు. వాటికంటే మరింత విలువైన విషయాలు చర్చించడం సాహితీ ప్రియులకు ఉపయోగమని భావించేవారు.

దిగంబరకవులతో వ్యక్తిగతంగా కేకేఆర్ గారికి చాలా సాన్నిహిత్యం ఉండేది. ఆ కవిత్వం వస్తున్న సమయంలోనే దాన్ని తూర్పారబట్టిన రారా లాంటి సుప్రసిద్ధ విమర్శకులు ఉన్నారు, ఈసడించుకున్న కవులూ ఉన్నారు. కానీ ఏ సామాజిక సాహిత్య ప్రయోజనం కోసమై యువ రచయితలు సమాజంలో ఆ కవిత్వాన్ని రచించారో తెలపడానికి ఎంతో సంయమనంతో పరిశీలించినవారు వెల్చేరు నారాయణరావు, కేకేఆర్‌ లే.

కేకేఆర్ సంపాదకత్వం వహించిన ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ అనే గ్రంథం కలిగించిన సంచలనం సాధారణమైనది కాదు. ఆధునిక సాహిత్యంలోని ఎన్నో వాదాలను గూర్చిన చర్చ ఆనాటి పరిశోధకులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపకరించింది. ఈనాటికి అధ్యయన అధ్యాపనాల్లో అది సజీవంగా కొనసాగుతూనే ఉంది. అటువంటి ప్రామాణికమైన పుస్తకాలను రూపొందించడంలోనూ, ఎన్నో విలువైన వ్యాసాలను రాయడంలోనూ కేకేఆర్ ప్రదర్శించిన ప్రజ్ఞ ఈనాటికీ ఆశ్చర్యాన్ని ఎంతో ఆనందాన్ని కలగజేస్తాయి. వారి రచనలన్నీ తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ గాఢతను పట్టి చూపుతాయి.

ఆచార్య పిల్లలమర్రి రాములు

(నేడు కేకేఆర్ తృతీయ వర్ధంతి)

Updated Date - May 15 , 2024 | 01:03 AM