Share News

‘డెడికేటెడ్‌ కమిషన్‌’ కావాలి!

ABN , Publish Date - Sep 19 , 2024 | 05:26 AM

రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రధానమైనది. దేశంలోని సామాజికంగా వెనుకబడిన తరగతుల జీవన స్థితిగతుల వివరాలకు సాధికారికంగా సేకరించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని తెలియజేసే ఆర్టికల్‌ ఇది. 1951లో బాబాసాహెబ్‌ తొలి కేంద్ర...

‘డెడికేటెడ్‌ కమిషన్‌’ కావాలి!

రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రధానమైనది. దేశంలోని సామాజికంగా వెనుకబడిన తరగతుల జీవన స్థితిగతుల వివరాలకు సాధికారికంగా సేకరించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని తెలియజేసే ఆర్టికల్‌ ఇది. 1951లో బాబాసాహెబ్‌ తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసిన సందర్భంలో కూడా ఆయన 340 ఆర్టికల్‌ ప్రకారం ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమింప చేయడంలో తాను సఫలీకృతం కానందుకు ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు ఇది కూడా ఒక ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

1953లో తొలిసారిగా 340 ఆర్టికల్‌ ద్వారా జాతీయస్థాయిలో కాకాసాహెబ్‌ కాలెల్కర్‌ కమిషన్‌ను భారతప్రభుత్వం నియమించింది. కమిషన్‌ 1955లో నివేదిక సమర్పించినప్పటికీ, చైర్మన్‌తో సహా ఒక సభ్యుడు నివేదిక అమలుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం ఈ కమిషన్‌ సిఫారసులను అమలులోకి తేలేదు. తదనంతరం 25 సంవత్సరాల తరువాత మొరార్జీ దేశాయ్‌ ఆధ్వర్యంలోని జనతాపార్టీ ప్రభుత్వం 1979లో రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను శ్రీ బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ సారథ్యంలో వేశారు. ఆ కమిషన్‌ 1980లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానిజైల్‌సింగ్‌కు నివేదికను సమర్పించింది. మండల్‌ కమిషన్‌ సిఫారసులు పదేళ్లు బుట్టదాఖలయ్యాయి. 1990లో వి.పి.సింగ్‌ కేంద్ర సర్వీసులలో 27శాతం ఓబీసీలకు అమలులోకి తెచ్చారు. మండల్‌–కమండల్‌ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కులం పేరిట, మతం పేరిట దేశమంతా రెండుగా చీలిపోయింది. ఎట్టకేలకు 1992లో గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు 27శాతం రిజర్వేషన్‌లు అమలులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఇంద్రాసాహ్ని కేసు దీనినే మండల్‌ కమిషన్‌ కేసు అంటారు.


ఈ కేసులోనే రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు నిర్దిష్టమైన సూచనలను చేసింది. కేంద్రంలో, రాష్ట్రాలలో అమలులో ఉన్న బీ‍సీ రిజర్వేషన్లను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, జాబితాలలో మార్పులు, చేర్పులకు, రిజర్వేషన్‌ల అమలులో జరిగే పొరపాట్లను సరిదిద్దడానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా నాటి ప్రభుత్వాలు బీసీ కమిషన్‌ చట్టాలను అమలులోకి తెచ్చాయి. ఇందుకు సంబంధించిన కమిషన్‌ల విధి విధానాలు ప్రత్యేకంగా చట్టాలలోనే పేర్కొనబడ్డాయి. అలా బీసీ కమిషన్‌లు ప్రత్యేక విధులతో పనిచేయడం మొదలుపెట్టాయి.

ఇదిలా ఉండగా రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రకారం ప్రత్యేకంగా నిర్వహించాల్సిన పనుల నిమిత్తం కమిషన్‌ ఏర్పాటు చేసే సంప్రదాయం మాత్రం దేశంలో కొనసాగుతూ వస్తున్నది. తాజా ఉదాహరణగా ఓబీసీ జాబితా వర్గీకరణకు కేంద్రం జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ను నియమించడం జరిగింది. పలు రాష్ట్రాలు కూడా ప్రత్యేక కమిషన్‌లను నియమిస్తూనే ఉన్నాయి.


ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టారీతిగా అమలు చేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్‌ల శాతం నిర్ణయించడానికి, 340 ఆర్టికల్‌ కింద ప్రత్యేక ‘డెడికేటెడ్‌ కమిషన్‌’లను నియమించి, ఆ దిశగా ఆ కమిషన్‌లు సూచించే సిఫార్సుల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంగా డాక్టర్‌ కె.కృష్ణమూర్తి, వికాస్‌ కిషన్‌రావు గవాలి, సురేష్‌ మహాజన్‌, రాహుల్‌ రమేష్‌వాగ్‌, మన్‌మోహన్‌ నగర్‌, వైద్యపాండ్యా మున్నగు కీలకమైన తీర్పులలో రాజ్యాంగ ధర్మాసనాలు, ధర్మాసనాలు స్పష్టంగా సూచించాయి. ఈ నేపథ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌ల శాతాన్ని నిర్ణయించడానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులతో కూడిన ‘డెడికేటెడ్‌ కమిషన్‌’లను నియమించుకొని, వాటి సిఫారసులతో సుప్రీం మార్గదర్శకాల మేరకు నడుచుకొని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయి. అందుకు ఉదాహరణగా మహారాష్ట్రలో జయంత్‌ కుమార్‌ భాటియా డెడికేటెడ్‌ కమిషన్‌, కర్ణాటకలో భక్తవత్సలం కమిషన్‌, మధ్యప్రదేశ్‌లో గౌరీశంకర్‌ బిసేన్‌ కమిషన్‌, గుజరాత్‌లో జవేరి కమిషన్‌, ఉత్తరప్రదేశ్‌లో లోకల్‌బాడీస్‌ డెడికేటెడ్‌ కమిషన్‌... ఇలా అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలతో ‘డెడికేటెడ్‌ కమిషన్‌’లను నియమించుకుని ముందుకెళుతున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణలోని రేవంత్‌ ప్రభుత్వం ప్రస్తుత బీసీ కమిషన్‌నే ‘డెడికేటెడ్‌ కమిషన్‌’గా నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విభేదించడమే అని న్యాయ నిపుణులు అంటున్నారు. పూర్తి స్థాయి సమయాన్ని కేటాయిస్తూ, గౌరవ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడానికి డెడికేటెడ్‌ కమిషన్‌ను ప్రత్యేకంగా నిపుణులతో నియామకం చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం పాటించకపోవడానికి గల కారణాలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లే అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ‘డెడికేటెడ్‌ కమిషన్‌’ను నియమించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆర్‌. కృష్ణయ్య

రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

Updated Date - Sep 19 , 2024 | 05:27 AM