Share News

కాలంలో నిలిచిన కమ్యూనిస్టు నేత

ABN , Publish Date - Mar 26 , 2024 | 02:12 AM

ధర్మ బిక్షం ఒక వ్యక్తి కాదు. ఉద్యమ శక్తి బాల్యం నుండి తేజవంతమైన రూపంతో డిబేట్స్‌లో, హాకీ, ఫుట్‌బాల్‌ ఇతర క్రీడల్లో ఆయన చురుకైన పాత్రను పోషించాడు. ఒకవైపు ఉపాధ్యాయుల మెప్పు పొందుతూ...

కాలంలో నిలిచిన కమ్యూనిస్టు నేత

ధర్మ బిక్షం ఒక వ్యక్తి కాదు. ఉద్యమ శక్తి బాల్యం నుండి తేజవంతమైన రూపంతో డిబేట్స్‌లో, హాకీ, ఫుట్‌బాల్‌ ఇతర క్రీడల్లో ఆయన చురుకైన పాత్రను పోషించాడు. ఒకవైపు ఉపాధ్యాయుల మెప్పు పొందుతూ మరొకవైపు విద్యార్థులకు ఆదర్శ నాయకుడిగా, సమాజంలో ప్రజా సమస్యలపై పోరాటాల్లో కూడా ముందు ఉండేవాడు. ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి ఆయన వెళ్లేవాడు. పోరాట కార్యక్రమాలను తన వ్యక్తిగత గుర్తింపు కోసం చేసేవాడు కాదు. సకల విద్యార్థిలోకం శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం, ప్రగతి కోసం, సమాజం మార్పు కోసం ఆలోచిస్తూ, ప్రజా పోరాటాలను నిర్వహించేవాడు.

భూస్వాముల, జమీందారుల, దొరల పేరు వింటేనే భయపడే రోజుల్లో దొరతనం గురించి, భూస్వాముల ఆగడాల గురించి, దోపిడీ గురించి, అధ్యయనం చేశాడు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు, విద్యార్థులకు, కార్మికులకు, రైతులకు వివరంగా మీటింగ్‌లు పెట్టి వివరించేవాడు. రైతులకు వ్యవసాయ కార్మికులకు రాత్రిపూట మోట బావుల కాడ కాగడాల వెలుగులో వారిలో భయాన్ని పోగొట్టి బానిసత్వ జీవితాన్ని వదలగొట్టి చైతన్య జ్వాలలను నింపి, మనిషి జీవితం గొప్పతనాన్ని, స్వాతంత్ర్య ప్రాధాన్యతను, వివరించాడు. వారిలో దేశ భక్తిని రగిలించాడు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడడానికి యువతను మానసికంగా శారీరకంగా సంసిద్ధులను చేసిన మహాయోధుడు ధర్మ బిక్షం.

నిజాం నవాబు ప్రజా వ్యతిరేక పాలనపై రజాకార్ల రాక్షసకృత్యాలపై నిప్పులు కక్కిన ధర్మ బిక్షం జీవితం మాత్రం నిత్యం నిప్పుల గుండంలో నడుస్తున్నట్లు ఉండేది. నిజాం ప్రభుత్వం ఆయన్ని ఒక ప్రమాదకరమైన విప్లవకారుడిగా ప్రకటించింది. ధర్మ బిక్షం కనబడితే కాల్పివేయాలని ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఆయనను పట్టుకొని కాల్పివేద్దామని ప్లాన్‌ చేశారు. కానీ ప్రజలు ఆయనకు కవచకుండలం లాగా ఉండటం వలన వారి పన్నాగం పటాపంచలయింది.

ధర్మ బిక్షం ఎమ్మెల్యేగా మూడుసార్లు, ఎంపీగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రజల మనిషిగా పేరుపొందాడు. చట్టసభల్లో ప్రజల పక్షాన తన గొంతు వినిపించారు. సామాజిక, రాజకీయ, వ్యక్తిత్వ విలువలను పాటించి చట్టసభల గౌరవాన్ని పెంపొందించడంలో, కాపాడటంలో ఆయన ఆదర్శనీయమైన పాత్రను పోషించారు. ఓటును డబ్బులకు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో, చట్ట సభల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన మాటలతో పోటీలుపడుతున్న ఈ తరుణంలో ధర్మ బిక్షం జీవితాన్ని ఒక మంచి గ్రంథంగా ప్రతి ఒక్కరు చదువుకోవలసిన సామాజిక అవసరం ఉంది. సమాజ మార్పుకు ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు, చూపిన ధైర్యం, ఆదర్శ జీవితం సదాస్పూర్తిదాయకం.

కె.వి.ఎల్‌

తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం

(నేడు ధర్మబిక్షం వర్ధంతి)

Updated Date - Mar 26 , 2024 | 02:12 AM