Share News

పుస్తకం ఓ మంచి నేస్తం...!

ABN , Publish Date - Apr 23 , 2024 | 03:25 AM

పుస్తకాలలో మనం నేర్చుకోవలసిన, గుర్తుంచుకోవలసిన విలువైన సమాచారం ఉంటుంది. ఒక పుస్తకం ఒక వ్యక్తి తాలూకు జ్ఞాపకాల పరంపర కావచ్చు. అనుభవాల సారం కావచ్చు...

పుస్తకం ఓ మంచి నేస్తం...!

పుస్తకాలలో మనం నేర్చుకోవలసిన, గుర్తుంచుకోవలసిన విలువైన సమాచారం ఉంటుంది. ఒక పుస్తకం ఒక వ్యక్తి తాలూకు జ్ఞాపకాల పరంపర కావచ్చు. అనుభవాల సారం కావచ్చు, లేదా యదార్థాల వస్తు సంగ్రహణము కావచ్చు. మొత్తం మీద పుస్తకం ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. మన పూర్వీకులు మొదట్లో తాళపత్రల మీద రాసి విలువైన సమాచారాన్ని వాటిలో భద్రపరిచేవారు. అనంతరం పేపర్‌ను కనుగొనడంతో దానిపై రాయడం మొదలుపెట్టారు. 15వ శతాబ్దంలో అచ్చు యంత్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. ఇలా అనేక రకాల పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి ప్రపంచ సమాచారాన్ని, ఒకరికొకరు పంచుకోవడం, భద్రపరచుకోవడం మొదలుపెట్టారు. క్రీస్తుపూర్వం భారతదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలో మేధోపరమైన చర్చలు జరుగుతుండేవి. ప్రపంచ దేశాల నుంచి చాలామంది మన దేశంలోని నలంద, తక్షశిల, విక్రమశీల విశ్వవిద్యాలయాలను సందర్శించి, విలువైన పుస్తకాలను చదివేవాళ్ళని చరిత్రలో చదువుకున్నాం. అంటే మన దేశానికి చారిత్రకంగా పుస్తకంతో ఉన్న అనుబంధం వేల ఏళ్ళనాటిది.

ఏప్రిల్- 23కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు ప్రపంచ సాహిత్యంలో ప్రతీకాత్మకమైనది. ప్రముఖ ఆంగ్ల రచయితలు విలియం షేక్‌స్పియర్, మిగ్యుల్ డేగెర్వం టీస్, గార్సీలాసోడీలా వేగా మరణించిన తేదీ. వీరి మృతికి చిహ్నంగా ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో 1995లో ఈ రోజును ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. మొత్తం 100 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రపంచ పుస్తక దినోత్సవం జరిగింది. మొదటిసారిగా ఘనంగా బ్రిటన్‌లోను, అలాగే ఐర్లాండ్‌లో నిర్వహించారు.

మన జీవితంపై ఇంతటి ప్రభావం తీసుకొచ్చే పుస్తకంపై నేటి యువత ఒకింత అశ్రద్ధ కనబరచడం ఆందోళన కలిగిస్తోంది. నేడు యువత చేతిలో సెల్‌ఫోన్ చేరడం, దానిని దుర్వినియోగం చేసుకోవడం, ఫలితంగా జరుగుతున్న సంఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అందుబాటులోకి వచ్చిన ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామన్నది యువత ఆలోచించాలి. ఓ చిన్న పుస్తకం మన జీవితాన్ని మారుస్తున్నప్పుడు, దానికి మనం సమయం కేటాయించలేకపోవడం అంటే, లోపం ఎక్కడుంది? మనలోనే కదా! కాబట్టి యువత పుస్తకపఠనానికి ప్రాముఖ్యం ఇచ్చి, చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. ‘‘మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం’’ కాబట్టి, అలాంటి పుస్తకాలను ఎంచుకొని ఆరోగ్యకరమైన సమాజానికి యువత నడుం బిగించాలి.

డాక్టర్ సుంకరి రాజారామ్

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(స్వ), నల్గొండ

(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)

Updated Date - Apr 23 , 2024 | 03:25 AM