Share News

2024: కాంగ్రెస్ సంకల్పాలు

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:23 AM

పురోగతిని, అభివృద్ధిని ఆశిస్తున్న వ్యక్తులు, సంస్థలు నిర్దిష్ట సందర్భాలలో విధిగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సంకల్పాలు చెప్పుకోవడం, మనోరథాలు వెల్లడించడం కద్దు. ఎన్నికలు అనే...

2024: కాంగ్రెస్ సంకల్పాలు

పురోగతిని, అభివృద్ధిని ఆశిస్తున్న వ్యక్తులు, సంస్థలు నిర్దిష్ట సందర్భాలలో విధిగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సంకల్పాలు చెప్పుకోవడం, మనోరథాలు వెల్లడించడం కద్దు. ఎన్నికలు అనే ప్రజాస్వామిక ప్రక్రియ రాజకీయ పక్షాలకు విధిగా వచ్చే ఒక ప్రత్యేక సందర్భం. ఎన్నికలలో గెలిచి అధికారాన్ని చేపట్టడమనేది ప్రతి రాజకీయపక్షానికి ఒక పరమ లక్ష్యంగా ఉంటుంది. త్వరలో జరగనున్న సార్వత్రక ఎన్నికల సందర్భంగా మన రాజకీయ పక్షాలు అన్నీ మానిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. సంబంధిత రాజకీయ పార్టీ లక్ష్యాల లిఖితపూర్వక ప్రకటనే ఒక మానిఫెస్టో. అది ఆ పార్టీ సంకల్ప పత్రం. ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై సదరు రాజకీయ పార్టీ భావాలు, అభిప్రాయాలు ఆ పార్టీ మానిఫెస్టోలో ఉంటాయి. 1776లో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన, ఆగస్టు 14–15, 1947న జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం ‘భవితవ్యంతో భేటీ’ అన్నవి లక్ష్యాల ప్రకటనకు చరిత్రాత్మక ఉదాహరణలు. వాటిని తప్పక గుర్తు చేసుకోవలసి ఉన్నది. జూలై 24, 1991న, భారత ఆర్థిక వ్యవస్థను ఒక మౌలిక మలుపు తిప్పిన తన చరిత్రాత్మక ప్రసంగంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ విఖ్యాత ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో మాటలను ఉటంకించారు. ‘ఒక భావం, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సమయం ఆసన్నమయినప్పుడు ధరిత్రిపై ఏ శక్తి కూడా ఆ భావ గమనాన్ని, పురోగతిని నిరోధించలేదు’ అని విక్టర్ హ్యూగో ఉద్ఘోషించాడు. ఆ ప్రకటనలు, లక్ష్యాలు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాల కొత్త పాలకుల ఉద్దేశాలు, ఆశయాలను స్పష్టంగా, సకల మానవాళిని ప్రభావితం చేసేలా ప్రకటితమయ్యాయి.

ఒక ప్రకటన, దాన్ని ప్రకటించిన వ్యక్తి నిజ ఉద్దేశాలనూ దాచిపెట్టగలదు. మిథ్యా ప్రవక్తలు మోసపూరిత ప్రకటనలు చేస్తారు. నరేంద్ర మోదీని వెన్నాడే ప్రకటనలు: ‘ప్రతి భారతీయుని బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తాను’; ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాను’; ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను’ మొదలైనవి. ఆయన సహచరులే ఆ ప్రకటనలను పరిహసించారు. అవన్నీ ఎన్నికల జుమ్లా (వంచన)గా వాటిని కొట్టివేశారు.

ఆసేతు హిమాచలం భారత ప్రజలను విశేషంగా ప్రభావితం చేయగల రెండు ప్రధాన రాజకీయ పక్షాలు: భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ. బీజేపీ తన మానిఫెస్టో కమిటీని మార్చి 3న ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తన మానిఫెస్టోను ఏప్రిల్ 5న విడుదల చేసింది. నిజానికి ఈ కాలమ్‌లో ఆ రెండు మానిఫెస్టోలను తులనాత్మకంగా పరిశీలించాలని అనుకున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో మాత్రమే అందుబాటులో ఉన్నది. కాంగ్రెస్ మానిఫెస్టోలోని ప్రముఖ అంశాలను క్లుప్తంగా, నిశితంగా పేర్కొంటాను. బీజేపీ మానిఫెస్టో అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ రెండు పార్టీల మానిఫెస్టోలను పాఠకులు, ఓటర్లు తులనాత్మకంగా పరిశీలించగలరని ఆశిస్తున్నాను.

తొలుత భారత రాజ్యాంగం గురించి కాంగ్రెస్ ఏమి చెప్పిందో చూడండి: ‘ఎప్పటికీ ముగియబోని మా ప్రస్థానంలో భారత రాజ్యాంగమే మాకు ఏకైక మార్గదర్శిగా, సహవాసిగా ఉంటుంది’. మరి బీజేపీ సైతం ఆ రాజ్యాంగానికి నిబద్ధమై ఉంటుందా లేక మౌలికంగా దాన్ని సవరించి వేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి భారత ప్రజలు ఆతురత పడుతున్నారు. బీజేపీ నిబద్ధత విషయమై ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది? ‘ఒకే జాతి, ఒకే ఎన్నిక; ఉమ్మడి పౌర స్మృతి, పౌరసత్వ సవరణ చట్టం తదితర విచ్ఛిన్నకర భావాలు దేశ ప్రజలను కలవరపరుస్తున్న సందర్భం కదా ఇది. భారత రాజ్యాంగం ఔదలదాల్చిన వెస్ట్ మినిస్టర్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు తాను కట్టుబడి ఉండేది లేనిదీ దేశ ప్రజలకు బీజేపీ స్పష్టం చేయాలి.

సామాజిక–ఆర్థిక విధానాలు, కులాల వారీ జనగణన, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సకల ప్రజల సామాజిక– ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహిస్తుంది. కులాల వారీ జనగణనకు కాంగ్రెస్ దృఢ సంకల్పంతో ఉన్నది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకై రాజ్యాంగాన్ని సవరించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా ఉద్యోగాలలో కల్పిస్తున్న 10శాతం రిజర్వేషన్లను అన్ని కులాల వారికి, సామాజిక సమూహాలకు కూడా వర్తింపచేసేందుకు కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సకల సామాజిక వర్గాల వారికి స్థానం కల్పించేందుకు ఒక డైవర్శిటీ కమిషన్ నేర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సంకల్పించింది. ఆ రంగాలలో సామాజిక వైవిధ్యం ఏ స్థాయిలో ఉన్నదో కూడ ఎప్పటికప్పుడు అంచనా వేయడం ఆ కమిషన్ కర్తవ్యంగా ఉంటుంది. బీజేపీ తన సందిగ్థతను విడనాడి, ఈ ప్రస్తావిత అంశాలపై తన ఉద్దేశాలు, లక్ష్యాలను స్పష్టం చేయాలి. సమానవకాశాల కల్పన ద్వారా సమానత్వ సాధన అనే విస్తృత అంశంపై కాంగ్రెస్, బీజేపీ వైఖరులు ఏమిటో ప్రజలకు విశదమవుతాయి.

భారతదేశంలో మతపరమైన, భాషాపరమైన మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు సొంత విశ్వాసాలను ఆచరించడంతో సహా మానవ హక్కులను సమరీతిలో పొందేందుకు సమస్త భారతీయులు అర్హులే అని కాంగ్రెస్ దృఢంగా విశ్వసిస్తోంది. మెజారిటేరియనిజం లేదా నిరంకుశత్వ వాదాలకు ఎటువంటి తావు లేదు. బహుళత్వం, వైవిధ్యం భారతీయ సంస్కృతి విశిష్ట విలువలు. మైనారిటీలను కాంగ్రెస్ ‘బుజ్జగిస్తుందని’ బీజేపీ ఏనాటి నుంచో ఆరోపిస్తూ వస్తోంది ‘బుజ్జగింపు అనేది బీజేపీ మైనారిటీ వ్యతిరేకతకు ఒక సంకేత నామం. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుపరచడం, ఉమ్మడి పౌర స్మృతికి పార్లమెంటు ఆమోదాన్ని పొందే విషయమై బీజేపీ తన దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించగలదా? ఆ రెండు చట్టాలు పూర్తిగా వివక్షా పూరితమైనవని కలవరపడుతున్న మైనారిటీలు బీజేపీ మానిఫెస్టో కోసం ఉత్కంఠ, వ్యాకులతతో ఎదురు చూస్తున్నారు.

భారతదేశ ‘జనాభా లబ్ధి’ (డెమోగ్రాఫిక్ డివిడెండ్) క్రమంగా తగ్గిపోతోంది. ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధిరేటు (5.9 శాతం) సంతృప్తికర స్థాయి కన్నా తక్కువగా ఉండడం వస్తూత్పత్తిరంగం (స్థూలదేశీయోత్పత్తిలో 14 శాతం) పురోగతి స్తంభించిపోవడం, నిరుద్యోగిత (గ్రాడ్యుయేట్స్‌లో 42 శాతం) అంతకంతకూ పెరిగిపోవడమే జనాభా లబ్ధి తగ్గిపోయేందుకు ప్రధాన కారణాలు. కేంద్ర ప్రభుత్వంలోని 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రైట్ టు అప్రెంటిస్‌షిప్ ఆక్ట్‌ను ఆమోదిస్తామని, కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించే కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహక పథకాలు అమలుపరుస్తామని, స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఒక ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకాన్ని ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీలు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి యువతకు ఉద్యోగాలు సృష్టించే విషయమై బీజేపీ– ఎన్డీఏ ప్రభుత్వానికి విశ్వసనీయమైన పథకమేదీ లేదు. మరి రాజకీయ పక్షమైన బీజేపీ మరింత ఆకర్షణీయమైన పథకాన్ని ప్రతిపాదించగలదా?

ఎన్నికల ప్రక్రియలో మహోత్సాహంతో పాల్గొనే ఓటర్లలో మహిళలు ముఖ్యమైనవారు అనడంలో సందేహం లేదు. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీ నాయకుల ప్రసంగాలను వారు శ్రద్ధగా వింటారు. ఆ ప్రసంగాల గురించి మహిళా ఓటర్లు తమలో తాము చర్చించుకోవడం కద్దు. మహిళల శ్రేయస్సుకు మహాలక్ష్మి పథకం (ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆర్థిక సహాయం, ఉపాధి హామీ లబ్ధిదారులకు రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచడం, మహిళా బ్యాంకు పునరుద్ధరణ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు మొదలైన కాంగ్రెస్ హామీలపై మహిళలు, యువతులు విశేష ఆసక్తి చూపుతున్నారు. మరి బీజేపీ మతపరమైన ఉద్వేగాలను (హిందూత్వ) రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు మాత్రమే పరిమితమవుతుందా? లేక నిర్దిష్ట పథకాలు, కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తుందా అనేది వేచి చూడాలి.

ప్రజల మాటా మంతీలో బాగా వినిపిస్తున్న అంశం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనా పద్ధతులు. సమాఖ్య పాలనా విధానాన్ని, రాష్ట్రాల కలయికే ఇండియా అన్న రాజ్యాంగ ప్రకటనను బీజేపీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఆ పార్టీ ప్రవచిస్తున్న ఒక జాతి, ఒకే ఎన్నిక సిద్ధాంతం సందేహాస్పదమైనది. అది అంతిమంగా ఒకే జాతి, ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం, ఒకే పార్టీ, ఒకే నాయకుడుకు దారితీయడం ఖాయం. కాంగ్రెస్ మానిఫెస్టోలోని ఒక అధ్యాయంలో సమాఖ్య పాలనా విధానంపై 12 అంశాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క దానినైనా బీజేపీ అంగీకరిస్తుందా? ఉమ్మడి జాబితాలోని కొన్ని అంశాలను రాష్ట్రాల జాబితాలోకి మార్చే విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ నిబద్ధమై ఉన్నది. ఈ విషయమై అది ఇచ్చిన హామీ పర్యవసానాలు బహుముఖంగా ఉంటాయనడంలో సందేహం లేదు. సమాఖ్య పాలనా విధానం పట్ల బీజేపీ నిబద్ధతను ఈ పన్నెండు అంశాలు పరీక్షించనున్నాయి.

రాజ్యాంగానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, మానవ హక్కుల పరిరక్షణకు వ్యక్తి స్వేచ్ఛ, గోప్యత, రాజ్యాంగ నైతికతకు ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీల నిబద్ధతే ఈ సార్వత్రక ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశమని నేను భావిస్తున్నాను. రాజ్యాంగాన్ని ఔదలదాల్చి, అది గౌరవించే ప్రజాస్వామిక సూత్రాలను సమర్థించే అభ్యర్థికే నా ఓటు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Apr 13 , 2024 | 03:23 AM