తెలంగాణ ప్రజాఫ్రంట్ 15వ ఆవిర్భావ సదస్సు
ABN , Publish Date - Oct 09 , 2024 | 01:26 AM
తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) 2010 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో వేలాది తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో పురుడు పోసుకున్నది. ప్రజానాయకుడు గద్దర్ ఈ ఫ్రంట్‌కు తొలి అధ్యక్షుడు. ప్రజా ఉద్యమం ద్వారానే...
తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) 2010 అక్టోబర్ 9న హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో వేలాది తెలంగాణ ఉద్యమకారుల సమక్షంలో పురుడు పోసుకున్నది. ప్రజానాయకుడు గద్దర్ ఈ ఫ్రంట్‌కు తొలి అధ్యక్షుడు. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలమని నమ్మే వ్యక్తులు, శక్తులు ఈ ఫ్రంట్‌లో భాగమయ్యారు. తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ, సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ జేఏసీ సమన్వయ స్టీరింగ్ ఫ్రంట్ వంటి సంస్థలు చేసిన కృషి ఫలితంగా టిపిఎఫ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధన, వనరుల సంరక్షణ ప్రజాఫ్రంట్ ముఖ్య ఆశయం. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ప్రధాన లక్ష్యంగా టిపిఎఫ్ ఆనాడు పనిచేసింది. ప్రజా ఉద్యమాల ద్వారానే రాష్ట్ర సాధన సాధ్యమవుతుందని టిపిఎఫ్ విస్తృత ప్రచారం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ టిపిఎఫ్‌పై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసి, కార్యకర్తలను, నాయకులను నిర్బంధించారు. కానీ ఫ్రంట్ కార్యకర్తలు గుండె నిబ్బరంతో ఆ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల అమలుకోసం కూడా ఇప్పుడు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏర్పడింది.
నేడు తెలంగాణ ప్రజాఫ్రంట్ 15 ఆవిర్భావ సదస్సు జరుగుతుంది. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ప్రారంభ సభకు రాచమోని నాగభూషణం అధ్యక్షులు. ప్రొ. జి. హరగోపాల్ ప్రారంభోపన్యాసకులు. మధ్యాహ్నం నుంచి జరిగే సభల్లో ‘ప్రజాస్వామిక తెలంగాణ – తెలంగాణ ప్రజాఫ్రంట్ అంశంపై ప్రొ. కాశీం; ప్రజా ఉద్యమాలు–నిర్బంధం అంశంపై ప్రొ. గడ్డం లక్ష్మణ్; ‘మహిళలు, దళితులపై జరుగుతున్న మనువాదుల దాడులు’ అంశంపై కాత్యాయని విద్మహే; ‘కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విధానాలు’ అంశంపై ఎన్. వేణుగోపాల్ ప్రసంగిస్తారు.
తెలంగాణ ప్రజాఫ్రంట్ (టిపిఎఫ్) రాష్ట్ర కమిటీ