Share News

విప్రో సీఈఓ డెలాపోర్ట్‌ రాజీనామా

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:10 AM

దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో ఎండీ, సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్‌ పల్లియాను నియమించినట్లు విప్రో శనివారం ప్రకటించింది...

విప్రో సీఈఓ డెలాపోర్ట్‌ రాజీనామా

కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్‌ పల్లియా నియామకం

న్యూఢిల్లీ: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో ఎండీ, సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కంపెనీ కొత్త సారథిగా శ్రీనివాస్‌ పల్లియాను నియమించినట్లు విప్రో శనివారం ప్రకటించింది. ఈ నెల 19న కంపెనీ నాలుగో త్రైమాసిక (జనవరి-మార్చి) ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో సారథ్య మార్పు జరగడం గమనార్హం. గత కొంతకాలంగా విప్రో పనితీరు విషయంలో తన ప్రత్యర్థులతో పోలిస్తే వెనకబడింది. ఇందుకుతోడు, గడిచిన ఏడాది కాలంలో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ) జతిన్‌ దలాల్‌, చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ స్టెఫానీ ట్రాట్మాన్‌ సహా పది మంది ఉన్నతాధికారులు కంపెనీని వీడారు. తాజాగా డెలాపోర్ట్‌ సైతం గుడ్‌బై పలికారు. ఆయన రాజీనామా ఏప్రిల్‌ 6 నుంచే అమల్లోకి వచ్చినప్పటికీ మే 31 వరకు కంపెనీ ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతారని విప్రో స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది.

నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీ సిఫారసు మేరకు కొత్త సీఈఓ, ఎండీగా శ్రీనివాస్‌ పల్లియా నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 7 నుంచి ఐదేళ్లపాటు శ్రీనివాస్‌ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇందుకు విప్రో వాటాదారులతో పాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 2020 జూలైలో థియరీ డెలాపోర్ట్‌ విప్రో పగ్గాలు చేపట్టారు. అంతక్రితం ఆయన ఫ్రెంచ్‌ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీలో పనిచేశారు. గత ఏడాది రూ.80 కోట్ల వార్షిక పారితోషికం అందుకున్న డెలాపోర్ట్‌.. దేశీయ ఐటీ రంగంలో అత్యధిక ప్యాకేజీ అందుకున్న సీఈఓగా నిలిచారు. కాగా 1992లో విప్రోలో చేరిన శ్రీనివా్‌స..మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి సేవలందిస్తున్నారు. కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పలు కీలక బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం కంపెనీకి చెందిన అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌ ‘అమెరికాస్‌ 1’కు సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, విప్రో ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో సభ్యుడు కూడా. అమెరికాలోని న్యూజెర్సీ నుంచే సీఈఓగా బాధ్యతలు నిర్వహించనున్న శ్రీనివా్‌స..చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీకి రిపోర్ట్‌ చేయనున్నారు.

Updated Date - Apr 07 , 2024 | 04:10 AM