Share News

విమాన చార్జీలకు రెక్కలు

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:07 AM

ఈ వేసవిలో విమాన చార్జీలు మరింత ప్రియమయ్యాయి. కొన్ని మార్గాల్లో ఎయిర్‌ టికెట్‌ ధరలు 20-25 శాతం వరకు పెరిగాయి. విస్తారా ఎయిర్‌లైన్స్‌ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో విమానయాన సేవలకు...

విమాన చార్జీలకు రెక్కలు

20- 25% వరకు పెరిగిన రేట్లు

విస్తారా సర్వీసుల రద్దు, వేసవి గిరాకీయే కారణం

న్యూఢిల్లీ: ఈ వేసవిలో విమాన చార్జీలు మరింత ప్రియమయ్యాయి. కొన్ని మార్గాల్లో ఎయిర్‌ టికెట్‌ ధరలు 20-25 శాతం వరకు పెరిగాయి. విస్తారా ఎయిర్‌లైన్స్‌ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో విమానయాన సేవలకు డిమాండ్‌ ఒక్క సారిగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ;పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. పైలట్ల సంక్షోభం కారణంగా విస్తారా రోజుకు 25-30 విమాన సర్వీసులు లేదా రోజువారీ షెడ్యూలులో 10 శాతం సర్వీసులను తగ్గించుకుంది. దివాలా తీసిన గోఫస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ గతంలోనే సేవలను నిలిపివేయడంతో పాటు ఇంజన్‌ సమస్యల కార ణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలనపడటంతో పరిశ్రమ సేవల సామ ర్థ్యం ఇప్పటికే తగ్గింది. దీనికి విస్తారా పైలట్ల సంక్షోభం జోడై ఈ సమస్య మరింత తీవ్రమయింది. పర్యాటక సేవల పోర్టల్‌ ఇక్సిగో విశ్లేషణ ప్రకారం.. ఈనెల 1-7 తేదీల్లో కొన్ని దేశీయ మార్గాల్లో విమాన సర్వీసుల స్పాట్‌ చార్జీలు గత నెల ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం వరకు పెరిగాయి. గత వారం ఢిల్లీ-బెంగళూరు సర్వీసు స్పాట్‌ టికెట్‌ రేటు 39 శాతం ఎగబాకగా.. ఢిల్లీ-శ్రీనగర్‌ చార్జీ 30 శాతం, ఢిల్లీ-ముంబై చార్జి 12 శాతం, ముంబై-ఢిల్లీ రూట్లో 8 శాతం పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో కలిపి ఎయిర్‌ టికెట్‌ చార్జీల పెరుగుదల 20-25 శాతంగా ఉండవచ్చని ప్రముఖ ట్రావెల్‌ పోర్టల్‌ యాత్రా. కామ్‌ ఎయిర్‌ అండ్‌ హోటల్‌ బిజినెస్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ మాలిక్‌ అన్నారు. విస్తారా సర్వీసుల రద్దు కీలక దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై గణనీయ ప్రభావం చూపిందన్నారు. ఢిల్లీ నుంచి గోవా, కొచి, జమ్ము, శ్రీనగర్‌కు నడిచే విమానాలకు అధిక డిమాండ్‌ నెలకొనడంతో ఈ మార్గాల్లో టికెట్‌ ధరలు అధికంగా పెరిగాయన్నారు.

Updated Date - Apr 10 , 2024 | 02:07 AM