Share News

పసిడి పరుగు ఎందాకా..?

ABN , Publish Date - Apr 14 , 2024 | 02:51 AM

బంగారం, వెండి ధరలు కొండెక్కుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా వీటి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు పెరిగాయి. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రూ.73,000 స్థాయిని దాటగా.. కిలో వెండి రూ.90,000కు చేరుకుంది...

పసిడి పరుగు  ఎందాకా..?

ఇప్పటికే 2,400 డాలర్లకు ఔన్స్‌ గోల్డ్‌

  • ఏడాది చివరినాటికి 3,000 డాలర్లకు చేరే చాన్స్‌

  • బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు కొండెక్కుతున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా వీటి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు పెరిగాయి. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రూ.73,000 స్థాయిని దాటగా.. కిలో వెండి రూ.90,000కు చేరుకుంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ క్రితం సెషన్‌లో 2,400 డాలర్లకు ఎగబాకింది. ఫెడ్‌ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు సెంట్రల్‌ బ్యాంక్‌లు బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడం వంటి అంశాలు ధరల ర్యాలీకి ప్రధాన కారణం. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే ఏడాది నాటికి ఔన్స్‌ గోల్డ్‌ 3,000 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా వేసింది.

మరో అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ కూడా బంగారంపై అంచనాలను పెంచింది. ఈ ఏడాది చివరినాటికి ఔన్స్‌ బంగారం 2,300 డాలర్లకు పెరగవచ్చని గతంలో అంచనా వేసిన కంపెనీ.. తాజాగా అంచనాను 2,700 డాలర్లకు పెంచింది.

ఫెడ్‌ రేట్లు-గోల్డ్‌ డిమాండ్‌ది విలోమ సంబంధం. ఫెడ్‌ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పంచే బాండ్లు, మార్కెట్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్లుతుంటాయి. అమెరికాలో ధరలు మార్కెట్‌ అంచనాల మేరకు తగ్గకపోవడంతో జూన్‌ నుంచే ఫెడ్‌ రేట్ల తగ్గింపు మొదలు కావచ్చన్న అంచనాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పసిడి రేట్లు కాస్త తగ్గుముఖం పట్టవచ్చని బులియన్‌ వర్గాలు భావించిన తరుణంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయనుందన్న వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్‌ మళ్లీ పుంజుకుంది. మధ్యలో స్వల్ప దిద్దుబాటుకు లోనయ్యే అవకాశాలున్నప్పటికీ, దీర్ఘకాలికంగా రేట్లు మరింత ఎగబాకడం ఖాయమని బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీలో బంగారం ధరలకు 2,450-2,500 డాలర్ల స్థాయిలో గట్టి నిరోధం కన్పిస్తున్నదని.. 2,300-2,250 డాలర్ల స్థాయిలో మద్దతు లభించవచ్చని కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కళ తప్పిన నగ

బంగారం ధరలు శరవేగంగా పెరగడంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయని కోల్‌కతాకు చెందిన సెన్‌కో గోల్డ్‌ అంటోంది. గడిచిన నెల రోజుల్లో తులం బంగారం ధర 10 శాతం పెరిగింది. 6 నెలల్లో 25-30 శాతం వరకు పెరిగింది. దాంతో ఆభరణాల విక్రయాలు ఇండస్ట్రీ పరంగా 15-20 శాతం వరకు తగ్గాయని సెన్‌కో గోల్డ్‌ ఎండీ, సీఈఓ సువెంకర్‌ సేన్‌ అన్నారు. ధరల పెరుగుదలతో పాటు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వెంట తీసుకెళ్లగలిగే నగదుపై పరిమితులు కూడా నగల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 02:51 AM