Share News

బిల్డర్లకు నోటీసులు ఎందుకు వస్తున్నాయ్‌..?

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:18 AM

ఈ మధ్య కాలంలో నిర్మాణ రంగంలోని వారికి జీఎ్‌సటీకి సంబంధించిన నోటీసులు రావటం గమనిస్తున్నాం. ముఖ్యంగా జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన 2017 జూలై నుంచి 2019 మార్చి మధ్య కాలానికి గాను...

బిల్డర్లకు నోటీసులు ఎందుకు వస్తున్నాయ్‌..?

ఈ మధ్య కాలంలో నిర్మాణ రంగంలోని వారికి జీఎ్‌సటీకి సంబంధించిన నోటీసులు రావటం గమనిస్తున్నాం. ముఖ్యంగా జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన 2017 జూలై నుంచి 2019 మార్చి మధ్య కాలానికి గాను ఎక్కువగా నోటీసులు వస్తున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్య కారణం మాత్రం ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను రివర్స్‌ చేయాల్సిన సందర్భాల్లో రివర్స్‌ చేయకపోవటం. దీని గురించి చాలా మంది బిల్డర్లకు అవగాహన లేకపోవటం వల్ల అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. అసలు తీసుకున్న ఐటీసీ ఎందుకు రివర్స్‌ చేయాలనే సందేహం చాలా మందిలో ఉండవచ్చు.

ఏదేనీ సరఫరా పన్ను పరిధిలోకి వస్తుంటే.. ఆ సరఫరా అందించటానికి పొందే ముడి పదార్ధాలు, సేవల మీద ఐటీసీ తీసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అంటే నిర్మాణ రంగంలో ఉండే బిల్డర్లు తమ నిర్మాణానికి ఉపయోగపడే సిమెంట్‌, స్టీల్‌, టైల్స్‌, రంగులు, శానిటరీ వస్తువులతో పాటు తాము పొందే వివిధ రకాల సేవలు అంటే ఇంజనీరింగ్‌, రవాణా, మానవ వనరులు మొదలైన వాటి మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఇలా తీసుకునే క్రెడిట్‌ను తాము అమ్మే అపార్ట్‌మెంట్స్‌ మీద కట్టాల్సిన పన్ను కోసం సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే అపార్ట్‌మెంట్స్‌కు సంబంధించి కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చిన తర్వాత జరిగే అమ్మకాలకు ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే ఏదేనీ సరఫరా, పన్ను పరిధి నుంచి పన్ను మినహాయింపులోకి వస్తే, మినహాయింపు వచ్చిన తేదీ నాటికి తన దగ్గర మిగిలి ఉన్న స్టాక్‌ ఆధారంగా ఐటీసీని రివర్స్‌ చేయాలి. ఎందుకంటే, ఆ స్టాక్‌కు సంబంధించి ఇప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ స్టాక్‌ మీద ఇంతకు ముందే క్రెడిట్‌ పొంది ఉన్నాడు. ఎప్పుడైతే అంతిమ సరఫరా పన్ను పరిధిలోకి రాదో దానికి సంబంధించిన ఇన్‌పుట్స్‌ మీద క్రెడిట్‌ రాదు. అందుకే, తన వద్ద మిగిలి ఉన్న స్టాక్‌కు సంబంధించి తీసుకున్న క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి. ఈ విధంగా చూస్తే బిల్డర్‌ కూడా తనకు పన్ను మినహాయింపు నాటికి అంటే కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చే నాటికి తాను ఐటీసీ పొందీ, మిగిలి ఉన్న స్టాక్‌కు సంబంధించిన క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మిగిలి ఉన్న స్టాక్‌ అంటే మిగిలిన సిమెంట్‌, స్టీల్‌, టైల్స్‌ అని అర్ధం కాదు. తాను ఏ ఇన్‌పుట్స్‌ ఉపయోగించి నిర్మాణం చేసాడో.. ఆ నిర్మాణానికి సంబంధించి అమ్ముడుపోకుండా మిగిలిన భాగం అని అర్ధం.

అందుకే, ఎంత క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి అనటానికి ఒక సులువైన ఫార్ములా ఉంది. మొదట, ఆ ప్రాజెక్ట్‌లో తీసుకున్న మొత్తం ఐటీసీని అంటే కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చేంత వరకు తీసుకున్న క్రెడిట్‌ను లెక్కించాలి. అలాగే, ఆ ప్రాజెక్ట్‌లో మొత్తం కార్పెట్‌ ఏరియా, అమ్ముడు కాకుండా మిగిలిన కార్పెట్‌ ఏరియాను తీసుకుని , దామాషా పద్దతిలో క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి. ఉదాహరణకు ఒక ప్రాజెక్ట్‌లో మొత్తం నిర్మాణం 20 వేల చదరపు అడుగులు అనుకుందాం. అలాగే కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చే నాటికి తీసుకున్న మొత్తం క్రెడిట్‌ రూ. కోటి అనుకుందాం. అలాగే కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చే నాటికి ఇంకా 5 వేల చదరపు అడుగుల నిర్మాణం అమ్మకం జరగకుండా మిగిలి ఉన్నదనుకుంటే, మొత్తం నిర్మాణంలో మిగిలిన నిర్మాణం 25 శాతం కాబట్టి, తీసుకున్న క్రెడిట్‌లో 25 శాతం అంటే రూ.25 లక్షల మేర క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి. అయితే చాలా మంది బిల్డర్లు ఎదుర్కొనే సమస్య ఏమిటంటే తాము తీసుకున్న క్రెడిట్‌ మొత్తం, చెల్లించాల్సిన ట్యాక్స్‌ కోసం వాడుకుంటారు. కాబట్టి కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చే నాటికి వారి దగ్గర ఎలాంటి క్రెడిట్‌ మిగిలి ఉండదు. తమ దగ్గర ఎలాంటి క్రెడిట్‌ మిగల లేదు కాబట్టి, తాము క్రెడిట్‌ రివర్స్‌ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ, అది తప్పు. తమ దగ్గర క్రెడిట్‌ ఉన్నా లేకున్నా పైన చెప్పిన ఉదాహరణలో లాగా చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలి.

ఇలా చెల్లించాల్సిన మొత్తాన్ని కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ వచ్చిన తదుపరి ఆర్థిక సంవత్సరం సెప్టెంబరులోపు రివర్స్‌ చేయాలి. ఉదాహరణకు ఏదేనీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ 2018-19లో వచ్చి ఉంటే, 2019 సెప్టెంబరు లోపు తాను రివర్స్‌ చేయాల్సిన మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఆ మొత్తాన్ని 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే 31 మార్చిలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదు. లేదంటే 2019 ఏప్రిల్‌ 1 నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పైన చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించటంతో పాటుగా ఇతర అంశాల పట్ల కూడా చట్టపరమైన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - Feb 25 , 2024 | 02:18 AM