Share News

జీఎ్‌సటీఆర్‌-1ఏ రిటర్న్‌ అంటే ?

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:41 AM

వస్తు సేవల పన్ను కింద నమోదైన వ్యాపారస్తులు అందరికీ జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ అంటే అవగాహన ఉంటుంది. ఒక వ్యాపారి తాను జరిపిన అమ్మకాలు లేదా సరఫరాల తాలుకు వివరాలను...

జీఎ్‌సటీఆర్‌-1ఏ రిటర్న్‌ అంటే ?

వస్తు సేవల పన్ను కింద నమోదైన వ్యాపారస్తులు అందరికీ జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ అంటే అవగాహన ఉంటుంది. ఒక వ్యాపారి తాను జరిపిన అమ్మకాలు లేదా సరఫరాల తాలుకు వివరాలను ఈ జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ వివరాలను బట్టి తదుపరి దాఖలు చేసే జీఎ్‌సటీఆర్‌-3బీ రిటర్న్‌ ద్వారా పన్ను చెల్లింపులు చేస్తాడు. అలాగే జీఎ్‌సటీఆర్‌-1లో ఇచ్చే వివరాలను బట్టే అవతలి వ్యక్తి అంటే కొనుగోలుదారుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుంటాడు. కాబట్టి ఈ రిటర్న్‌ ఎంతో ముఖ్యమైనది. అయితే జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌లో పొరపాటున తప్పుడు వివరాలు ఇస్తే, సవరణ చేయటానికి ఇప్పటి వరకు ఎలాంటి సౌలభ్యం లేదు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల నుంచి కొత్త జీఎ్‌సటీఆర్‌-1ఏ అనే రిటర్న్‌ను ప్రవేశపెట్టింది. ఈ వివరాలు మీ కోసం..


జీఎ్‌సటీఆర్‌-1ఏ అనేది సవరింపు కోసం ఉద్దేశించినది కాబట్టి, ఇది తప్పనిసరిగా దాఖలు చేయాలనే నియమం ఏమీ లేదు. అవసరాన్ని బట్టి దాఖలు చేయవచ్చు. అలాగే ఇది జూలై నెల నుంచి అమల్లోకి వస్తుంది. అంటే జూలై నెలకి సంబంధించి దాఖలు చేసిన జీఎ్‌సటీఆర్‌-1లో ఏదేనీ సవరణలు చేయాలంటే ఈ కొత్త రిటర్న్‌ ద్వారా చేసుకోవచ్చు. ఈ రిటర్న్‌ అనేది జీఎ్‌సటీఆర్‌-1 దాఖలు చేయటానికి గడువు తేదీ లేదా దాఖలు చేసిన తేదీ.. ఈ రెండింటిలో ఏది వెనకైతే అప్పటి నుంచి సదరు వ్యక్తికి అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు జూలై నెలకు సంబంధించి జీఎ్‌సటీఆర్‌-1 దాఖలు చేయటానికి గడువు తేదీ ఆగస్టు 11. ఒక వ్యాపారి తన జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ ఆగస్టు 14న దాఖలు చేశాడనుకుంటే.. ఈ రెండు తేదీల్లో చివరి తేదీ ఆగస్టు 14 కాబట్టి, ఈ తేదీ నుంచి ఈ కొత్త రిటర్న్‌ సదరు వ్యక్తి స్ర్కీన్‌లో లభిస్తుంది. అలాగే ఈ రిటర్న్‌ దాఖలు చేయటానికి గడువు తేదీ ఏదీ లేకున్నా, జీఎ్‌సటీఆర్‌-3బీ దాఖలు చేస్తే మాత్రం, జీఎ్‌సటీఆర్‌-1ఏ దాఖలు చేయలేరు. అలాగే ఇందులో ఈ నెలకు సంబంధించిన సవరణలు మాత్రమే చేయగలరు. అంటే, ఇంతకు ముందు నెలకు సంబంధించిన సవరణలు ఈ నెల రిటర్న్‌లో చేయలేరు.


సాధారణ సరఫరా వివరాలతో పాటుగా క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్‌ వివరాలను కూడా ఇందులో పొందుపరచవచ్చు. ఒకసారి, జీఎ్‌సటీఆర్‌-1ఏ దాఖలు చేసిన తర్వాత తదనుగుణంగా జీఎ్‌సటీఆర్‌-3బీ లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సవరించిన వివరాలు, కొనుగోలుదారుని జీఎ్‌సటీఆర్‌-2బీ లో మాత్రం తరువాతి నెలలో కనిపిస్తాయి.

ఇదే విధంగా త్రైమాసిక జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ దాఖలు చేసే వారికి కూడా ఈ కొత్త రిటర్న్‌ అందుబాటులో ఉంటుంది. ఏది ఏమైనా జీఎ్‌సటీఆర్‌-1ఏ అనేది జీఎ్‌సటీలో నమోదైన వారికి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Aug 25 , 2024 | 05:41 AM