Share News

ఈ నెల 31 లోపు చేయాల్సిన పనులేమిటంటే?

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:34 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కొద్ది రోజుల్లో ముగియనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను చెల్లింపుదారులు ఈ లోపు చేయాల్సిన పనులు ఏమిటి? కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) లో ఇవ్వాల్సిన అప్లికేషన్లు లేదా...

ఈ నెల 31 లోపు చేయాల్సిన పనులేమిటంటే?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కొద్ది రోజుల్లో ముగియనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను చెల్లింపుదారులు ఈ లోపు చేయాల్సిన పనులు ఏమిటి? కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) లో ఇవ్వాల్సిన అప్లికేషన్లు లేదా డిక్లరేషన్స్‌ ఏమిటి? మొదలైన విషయాలు మీకోసం.

ముందుగా జీఎ్‌సటీలో రిజిస్టర్‌ అయిన ప్రతి ఒక్కరూ తమ టర్నోవర్‌ను సరిచూసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరపు టర్నోవర్‌ జీఎ్‌సటీలోని రిటర్నులకు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులకు సరిపోవాలి. వారి పద్దు పుస్తకాలతో పోలిస్తే ఎలాంటి వ్యత్యాసం ఉండకూడదు. అలాగే జీఎ్‌సటీలో చిన్న, మధ్య తరగతి వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన అనేక ప్రయోజనాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలోని టర్నోవర్‌ ఆధారంగా అర్హత ఉంటుంది. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ప్రయోజనం ఏదైనా పొందాలంటే, ఈ ఆర్థిక సంవత్సరపు టర్నోవర్‌ ఆధారమవుతుంది. ఉదాహరణకు కాంపోజిషన్‌ స్కీమ్‌కు అర్హత పొందాలంటే టర్నోవర్‌ రూ.కోటి యాభై లక్షలు దాటకూడదనే నిబంధన ఉంది.

ముఖ్యంగా ఎంతో ప్రాచుర్యం పొందిన క్యూఆర్‌ఎంపీ స్కీమ్‌కు అర్హత పొందాలంటే టర్నోవర్‌ రూ.5 కోట్లు దాటకూడదు. అలాగే, సవరించిన నిబంధనల ప్రకారం రూ.5 కోట్ల టర్నోవర్‌ దాటితే ఈ-ఇన్వాయిస్‌ తప్పనిసరి. కాబట్టి టర్నోవర్‌ సరిగ్గా చూసుకోవటం తప్పనిసరి.

ఇంకా సెజ్‌లకు జరిపే సరఫరాలకు లేదా విదేశాలకు చేసే ఎగుమతులకు పన్ను వర్తించకూడదంటే లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ అవసరం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ సదుపాయం ఉపయోగించుకోవాలంటే మార్చి 31లోపు ఈ లెటర్‌ ఆఫ్‌ అండర్‌ టేకింగ్‌ దాఖలు చేయాలి. ఇంకా చెప్పాలంటే, ఎవరైనా వ్యాపారస్తుడు పన్ను వర్తించే, పన్ను మినహాయింపు పొందే సరఫరాలు చేస్తూ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకునేటట్లయితే నిబంధనల ప్రకారం ప్రతి నెలా తీసుకున్న క్రెడిట్‌ నుంచి అర్హత లేని మేరకు క్రెడిట్‌ రివర్స్‌ చేయాలన్న విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి నెలా క్రెడిట్‌ రివర్స్‌ చేసినప్పటికీ, సంవత్సరంలో తీసుకున్న మొత్తం క్రెడిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఆ సంవత్సరానికి రివర్స్‌ చేయాల్సిన మొత్తాన్ని లెక్కించాలి. నెలవారీ రివర్స్‌ చేసిన మొత్తాల కంటే ఈ మొత్తం ఎక్కువ ఉంటే.. ఆ మేరకు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించటానికి అక్టోబరు 20 వరకు సమయం ఉన్నప్పటికీ ఈ నెల (మార్చి) 31 లోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదు. అలాగే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకునే బిల్డర్లు అంటే వాణిజ్య నిర్మాణాలు చేసే వారు కావచ్చు లేదా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వర్తించే పాత స్కీమ్‌లో ఉన్న వారు కావచ్చు. వీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వచ్చే నాటికి అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ఫ్లాట్స్‌కు సంబంధించి క్రెడిట్‌ రివర్స్‌ చేయాలి. దీనికి కూడా పైన చెప్పిన గడువు వర్తిస్తుంది.

అంతేకాకుండా క్రెడిట్‌ నోట్స్‌, డెబిట్‌ నోట్స్‌ జారీ చేయాల్సి ఉన్నా.. అర్హత ఉండి కూడా తీసుకోకుండా మిగిలిపోయిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఏమైనా ఉన్నా, పొరపాటున ఎక్కువ క్రెడిట్‌ తీసుకున్నా గడువు తేదీ వరకు వేచి ఉండకుండా ఈ నెల 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయటం మంచిది.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

Updated Date - Mar 24 , 2024 | 02:34 AM