Share News

వొడాఫోన్‌ ఐడియా రూ.45,000 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:32 AM

ప్రైవేట్‌ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (వి) భారీ నిధుల సమీకరణ ప్రణాళికను ప్రకటించింది. ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత సాధనాల ద్వారా రూ.20,000 కోట్ల సమీకరణకు కంపెనీ...

వొడాఫోన్‌ ఐడియా రూ.45,000 కోట్ల సమీకరణ

ఈక్విటీ జారీ ద్వారా రూ.20,000 కోట్లు

  • రుణ పత్రాల ద్వారా రూ.25 వేల కోట్లు

  • కంపెనీపై రూ.2.1 లక్షల కోట్ల రుణ భారం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (వి) భారీ నిధుల సమీకరణ ప్రణాళికను ప్రకటించింది. ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత సాధనాల ద్వారా రూ.20,000 కోట్ల సమీకరణకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. ఈక్విటీ జారీ ప్రక్రియలోప్రమోటర్లు సైతం పాల్గొననున్నట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఈక్విటీ, డెట్‌ (రుణ పత్రాలు) జారీ ద్వారా మొత్తం రూ.45,000 కోట్లు సమీకరించాలనుకుంటున్నట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. రూ.2.1 లక్షల కోట్ల రుణ భారం, వందల కోట్ల నష్టాలతో పాటు నెలనెలా చేజారుతున్న వినియోగదారులతో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన కంపెనీ ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది. సంస్థ పునరుద్దరణతో పాటు రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ నుంచి పోటీ తట్టుకుని మార్కెట్లో నిలబడేందుకు వొడాఫోన్‌ ఐడియాకు ఈ నిధుల సమీకరణ కీలకంగా మారింది. ఇందుకోసం బ్యాంకర్లు, కౌన్సిళ్ల నియామకానికి కంపెనీ బోర్డు తాజా సమావేశంలో యాజమాన్యానికి అధికారం కల్పించింది. ఈ ప్రక్రియకు అనుమతి కోరేందుకు కంపెనీ ఏప్రిల్‌ 2న వాటాదారుల సమావేశం నిర్వహించనుంది. వారి ఆమోదం లభించాక వచ్చే త్రైమాసికంలో ఈక్విటీ జారీ ద్వారా నిధులను సమీకరించనుంది. ఈ సొమ్ములో మెజారిటీ భాగాన్ని 4జీ సేవల విస్తరణతో పాటు 5జీ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలను గత ఏడాదిలో ఈక్విటీ రూపంలోకి మార్చుకుంది. తద్వారా కంపెనీలో కేంద్రానికి 33.1 శాతం వాటా లభించింది. కాగా, బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ పీఎల్‌సీ 32 శాతం, కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ 18 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Updated Date - Feb 28 , 2024 | 03:32 AM