Share News

మూడేళ్లలో ‘విజేత’ పబ్లిక్‌ ఇష్యూ

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:20 AM

విజేత సూపర్‌ మార్కెట్స్‌ అంటే తెలియని వారు లేరు. హైదరాబాద్‌లో విజేత సూపర్‌ మార్కెట్‌ కనిపించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకున్న ఈ సంస్థ...

మూడేళ్లలో ‘విజేత’ పబ్లిక్‌ ఇష్యూ

పదేళ్లలో మరో 90 స్టోర్లు రూ.2,000 కోట్ల టర్నోవర్‌ టార్గెట్‌

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు విస్తరణ

‘ఆంధ్రజ్యోతి’తో విజేత సూపర్‌ మార్కెట్స్‌ ఎండీ జగన్మోహన రావు

విజేత సూపర్‌ మార్కెట్స్‌ అంటే తెలియని వారు లేరు. హైదరాబాద్‌లో విజేత సూపర్‌ మార్కెట్‌ కనిపించని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు. నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకున్న ఈ సంస్థ భారీ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రాబోయే పదేళ్లలో కొత్తగా 90 స్టోర్లు ప్రారంభించడం, పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ద్వారా నిధులు సమీకరించుకోవడం ఈ ప్రణాళిక ప్రధానాంశాలు. విజేత సూపర్‌ మార్కెట్స్‌ ప్రారంభమై మార్చి నాటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మురకొండ జగన్మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’తో ముఖాముఖిలో పలు అంశాలు ప్రస్తావించారు. అవి ఆయన మాటల్లోనే...

  • గుంటూరు జిల్లాలోని నిమ్మగడ్డవారి పాలెం గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో పుట్టిన నేను ప్రారంభంలో కొన్ని చిన్న ఉద్యోగాలు చేశాను. హైదరాబాద్‌ వచ్చి త్రినేత్ర సూపర్‌ మార్కెట్లో ఉద్యోగానికి చేరాను. బిల్లింగ్‌ క్లర్క్‌ నుంచి స్టోర్‌ ఇన్‌చార్జ్‌ వరకు 5 సంవత్సరాల అనుభవం ఈ వ్యాపార జీవితానికి పునాది అయింది. ఏదో ఒకటి సాధించాలనే నాలోని తపన దానికి జోడయింది.

  • అలా తొలి స్టోర్‌ చందానగర్‌లో 1999 మార్చి 7వ తేదీన ప్రారంభించాను. అప్పటికి ఇతర రంగాలతో పోల్చితే బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగులకు అధిక వేతనాలుండడం వల్ల వారి కొనుగోలు శక్తి అధికంగా ఉండేది. అందుకే తొలి స్టోర్‌ అక్కడ ప్రారంభించాను.

  • క్రమంగా స్టోర్ల సంఖ్యను విస్తరిస్తూ పాతికేళ్ల ప్రయాణంలో 110 స్టోర్లకు వ్యాపారాన్ని పెంచాం. వీటిలో 11 స్టోర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా మిగతావన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. వచ్చే పదేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ర్టాల్లోని ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నింటిలో విజేత స్టోర్లు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే 10 సంవత్సరాల్లో మొత్తం స్టోర్ల సంఖ్య 200కి చేర్చడం, రూ.2000 కోట్ల టర్నోవర్‌ సాధించడం మా లక్ష్యం. ప్రస్తుతం మా టర్నోవర్‌ రూ.840 కోట్లుంది. ఏటా 15 నుంచి 20 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం.

  • కొత్త స్టోర్ల ఏర్పాటుకు నిధులు భారీగానే అవసరం అవుతాయి. మంచి ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో ఒక స్టోర్‌ ప్రారంభించాలంటే కనీసం రూ.6 కోట్లు అవసరం. ఇప్పటివరకు అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకున్నాం. భవిష్యత్‌ అవసరాల కోసం తొలుత ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థల (పీఈ)ను ఆశ్రయించాలనుకుంటున్నాం.

  • పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ఆలోచన ఉంది. అయితే అందుకు కొంత సమయం తీసుకుంటాం. బహుశ మూడేళ్లలో ఇష్యూకి వచ్చే అవకాశం ఉంది.

  • వ్యవస్థీకృత రిటైలింగ్‌ రంగంలో పోటీ తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. కాని నాణ్యత ఉన్న చోటికి కస్టమర్లు తమంత తాముగానే వస్తారు. అదే మా వ్యాపార రహస్యం. దానికి తోడు స్టోర్‌ను ఆకర్షణీయంగా డిజైన్‌ చేయడం, కస్టమర్లతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించడం మా ప్రత్యేకతలు.

  • 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31 వరకు కస్టమర్లకు స్పెషనల్‌ కూపన్లు అందించాం. త్వరలో వాటిని డ్రా తీయబోతున్నాం. డ్రాలో విజేతలకు కార్లు, బైక్‌లు, ఇతర ఆకర్షణీయమైన బహుమతులు అందిస్తాం.

Updated Date - Apr 03 , 2024 | 02:20 AM