ఐసీఐజీ చేతికి వసంత్ కెమికల్స్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:55 AM
హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా ఇంటర్మీడియేటరీల తయారీ కంపెనీ వసంత్ కెమికల్స్‌లో మెజారిటీ వాటాను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ కెమికల్ ఇన్వెస్టర్స్ గ్రూప్ (ఐసీఐజీ) కొనుగోలు...

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ కెమికల్స్, ఫార్మా ఇంటర్మీడియేటరీల తయారీ కంపెనీ వసంత్ కెమికల్స్‌లో మెజారిటీ వాటాను జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ కెమికల్ ఇన్వెస్టర్స్ గ్రూప్ (ఐసీఐజీ) కొనుగోలు చేసింది. వసంత్ కెమికల్స్ ప్రమోటర్ జీకేబీ చౌదరి నుంచి మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినట్టు ఐసీఐజీ గ్రూప్ ప్రకటించింది. ఈ లావాదేవీ అనంతరం చౌదరి మైనారిటీ వాటాదారుగా ఉండిపోతారు. అయితే డీల్ విలువ ఎంత అన్నది వెల్లడించలేదు. ఈ కొనుగోలు లావాదేవీ పూర్తయిన అనంతరం వసంత్ కెమికల్స్‌ను ఐసిఐజీ అనుబంధ ఫైన్ రసాయనాల విభాగం వెల్‌కెమ్ గ్రూప్‌లో విలీనం చేయనున్నట్టు ఐసీఐజీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ స్పెషాలిటీ రసాయనాల మార్కెట్లన్నింటికీ విస్తరించాలన్న తమ వ్యూహానికి ఈ కొనుగోలు మరింత సహాయకారి అవుతుందని పేర్కొంది. అలాగే వసంత్ కెమికల్స్ కూడా ప్రపంచ మార్కెట్లకు విస్తరించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ బేస్‌ను పెంచుకోగలుగుతుందంటున్నారు. 40 సంవత్సరాల చరిత్ర గల వసంత్ కెమికల్స్‌కు హైదరాబాద్‌లోని జీడిమెట్ల, విశాఖపట్టణంలోని అచ్యుతాపురంలలో తయారీ యూనిట్లున్నాయి.