Share News

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువు, జీతం వివరాలు మీకు తెలుసా?

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:26 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతం సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువు, జీతం వివరాలు మీకు తెలుసా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించనున్నారు. ఇది ఆమెకు ఆరో బడ్జెట్‌ కావడం విశేషం. ఈ సందర్భంగా నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతం సహా పలు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మలా మధురైలోని సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు 1959 ఆగస్టు 18న జన్మించారు. సీతారామన్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నిర్మలా మద్రాసు, తిరుచిరాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలలో అర్థశాస్త్రంలో బీఎ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1984లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్ పూర్తి చేసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం


మంత్రి పెళ్లి

ఆమె తండ్రి భారతీయ రైల్వే ఉద్యోగి. జేఎన్‌యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్‌ తన భర్త పరకాల ప్రభాకర్‌ను కలిశారు. భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఈ జంట 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి వాంగ్మయి అనే కుమార్తె ఉంది. పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ భావజాలం కారణంగా సీతారామన్ బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేశారు.

బీజేపీతో ప్రయాణం

ఆ క్రమంలోనే 2006లో నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ కేబినెట్‌లో జూనియర్ మంత్రిగా నియమితులయ్యారు. జూన్ 2014లో సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మే 2016లో కర్ణాటక స్థానం నుంచి రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత సెప్టెంబర్ 3, 2017న నిర్మలా భారత రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇందిరాగాంధీ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండవ మహిళ, పూర్తి సమయం చేసిన మొదటి మహిళ నిర్మలా కావడం విశేషం.

తొలి బడ్జెట్ ఎప్పుడంటే

మే 31, 2019న సీతారామన్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూలై 5న సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1, 2020న, ఆ తర్వాత 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. నిర్మలా సీతారామన్ 2014 నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె భారత రక్షణ మంత్రిగా, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు.

సేల్స్‌పర్సన్‌గా కూడా

సీతారామన్ హాబిటాట్ (లండన్‌లోని గృహాలంకరణ షాపు)లో సేల్స్‌పర్సన్‌గా పనిచేశారు. దీంతోపాటు అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీర్స్ (UK)లో ఆర్థికవేత్తకు సహాయకుడిగా కూడా పనిచేశారు. ఆమె PwC (ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్), BBC వరల్డ్ సర్వీస్‌లో సీనియర్ మేనేజర్ (పరిశోధన, అభివృద్ధి విభాగం)లో కూడా వర్క్ చేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా 34వ స్థానంలో నిలిచింది.

జీతం వివరాలు

అలాగే భారత ప్రభుత్వ జీతం డేటా ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెలవారీ జీతం దాదాపు రూ. 4,00,000గా ఉంది. ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తులు చాలా తక్కువ. ఆమెకు దాదాపు రూ.1.34 కోట్ల ఆస్తులున్నాయి. ఆమె, ఆమె భర్తకు చెందిన ఇంటి విలువ రూ.99.36 లక్షలు. ఇది కాకుండా సుమారు రూ.16.02 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది.

Updated Date - Jan 29 , 2024 | 05:26 PM