Share News

అదరగొట్టిన యూకో బ్యాంక్‌

ABN , Publish Date - Oct 20 , 2024 | 12:46 AM

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా...

అదరగొట్టిన యూకో బ్యాంక్‌

క్యూ2 లాభంలో 50 శాతం వృద్ధి.. రూ.603 కోట్లుగా నమోదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 50 శాతం వృద్ధితో రూ.603 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.402 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం కూడా రూ.5,866 కోట్ల నుంచి రూ.7,071 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.1,917 కోట్ల నుంచి రూ.2,301 కోట్లకు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలకు తగ్గట్టుగానే బ్యాంక్‌ పనితీరును కనబరిచిందని, ఈ కాలంలో నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.84 శాతం నుంచి 3.10 శాతానికి పెరిగిందని యూకో బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అశ్వనీ కుమార్‌ వెల్లడించారు.


కాగా రానున్న త్రైమాసికాల్లో కూడా ఇదే జోరును కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ ఎన్‌ఐఎం 2.9-3 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి రుణ వృద్ధి రేటు 12-14 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు. కాగా సెప్టెంబరు త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 4.14 శాతం నుంచి 3.18 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.11 శాతం నుంచి 0.73 శాతానికి తగ్గాయన్నారు. సెప్టెంబరు ముగిసే నాటికి బ్యాంక్‌ మొత్తం వ్యాపారం 13.56 శాతం వృద్ధి చెంది రూ.4,73,704 కోట్లకు చేరుకుంది.


క్యూఐపీ ద్వారా రూ.2,000 కోట్ల సమీకరణ

ప్రస్తుత అక్టోబరు-డిసెంబరు (క్యూ3) త్రైమాసికంలో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా రూ.1,500-2,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలని చూస్తున్నట్లు అశ్వనీ కుమార్‌ తెలిపారు. కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ (ఎంపీఎస్‌) నిబంధనలు చేరుకునే వ్యూహంలో భాగం గా క్యూఐపీకి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్యూఐపీ ద్వారా యూకో బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 2-3 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బ్యాంక్‌లో ప్రభుత్వానికి 95.39 శాతం వాటా ఉంది.

Updated Date - Oct 20 , 2024 | 12:46 AM