Share News

ఈసారి రూ.లక్ష కోట్ల ఐపీఓలు!

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:16 AM

ఈ నెల 1తో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ల జోరు కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో 76 కంపెనీలు ఐపీఓల ద్వారా దాదాపు రూ.62,000 కోట్లు...

ఈసారి రూ.లక్ష కోట్ల ఐపీఓలు!

ఇన్వె్‌స్టమెంట్జ్‌.కామ్‌ అంచనా

  • క్యూలో రూ.70,000 కోట్ల ఆఫర్లు

  • 2023-24లో రూ.62,000 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఈ నెల 1తో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)ల జోరు కొనసాగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో 76 కంపెనీలు ఐపీఓల ద్వారా దాదాపు రూ.62,000 కోట్లు సమీకరించగా.. 2024-25లో ఐపీఓల ద్వారా నిధుల సేకరణ రూ.లక్ష కోట్లు దాటవచ్చని పెట్టుబడులు, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్వె్‌స్టమెంట్జ్‌.కామ్‌’ నివేదిక అంచనా వేసింది. ఆకస్మిక అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావం లేకపోతే ఈ మొత్తం మరింత పెరగవచ్చని అంటోంది. ఇప్పటికే రూ.70,000 కోట్ల విలువైన 56 కంపెనీల పబ్లిక్‌ ఆఫర్లు క్యూలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అందులో రూ.25,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో కూడిన 19 కంపెనీల ఐపీఓలకు ఇప్పటికే సెబీ ఆమోదం లభించగా.. మరో రూ.45,000 కోట్ల విలువ చేసే 37 కంపెనీల ఐపీఓ దరఖాస్తులు నియంత్రణ సంస్థ పరిశీలనలో ఉన్నాయి. మొత్తం 56 కంపెనీల్లో 9 నవతరం టెక్నాలజీ కంపెనీలనీ.. వీటి నిధుల సమీకరణ లక్ష్యం మొత్తం రూ.21,000 కోట్ల స్థాయిలో ఉందని నివేదిక వెల్లడించింది.

నిధుల సేకరణలో 19ు వృద్ధి

అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2022-23)లో 37 కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన రూ.52,115 కోట్లతో పోలిస్తే 2023-24లో ఈ మొత్తం మరో 19 శాతం పెరిగింది. సెకండరీ మార్కెట్లో జోరు, రిటైల్‌ మదుపరుల పాత్ర పెరగడంతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు గుమ్మరించడం ఇందుకు దోహదపడింది. మరిన్ని ఆసక్తికర అంశాలు..

  • గత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన కంపెనీల షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన తొలి రోజు పంచిన లాభం సగటు 29 శాతంగా నమోదైంది. 2022-23లో ఈ సగటు 9 శాతంగా ఉంది.

  • గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వచ్చిన 70 శాతం లేదా 55 కంపెనీల షేర్లు ఇప్పటికీ ఇష్యూ ధర ఎగువన ట్రేడవుతున్నాయి.

  • ఐపీఓలకు రిటైల్‌ మదుపరుల నుంచి లభించిన దరఖాస్తుల సగటు 2022-23లో 6 లక్షలుగా ఉండగా.. 2023-24లో 13 లక్షలకు పెరిగింది.

  • గత ఏడాది చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎస్‌ఎంఈ) ఐపీఓలు భారీగా పెరిగాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ ప్రకారం.. 2022-23లో 125 ఎస్‌ఎంఈలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రూ.2,235 కోట్లు సమీకరించగా.. 2023-24లో 200 ఎస్‌ఎంఈలు మొత్తం రూ.5,838 కోట్లు సేకరించాయి.

  • గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 29 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 70 శాతం, మిడ్‌క్యాప్‌ 100 సూచీ 60 శాతం పెరిగాయి. ఐపీఓ తర్వాత మార్కెట్లో లిస్టయిన కంపెనీల షేర్ల పనితీరును తెలిపే బీఎ్‌సఈ ఐపీఓ ఇండెక్స్‌ సైతం 69 శాతం ఎగబాకింది.

Updated Date - Apr 03 , 2024 | 02:16 AM