Share News

టెస్లా ఎంట్రీకి లైన్‌ క్లియర్‌!

ABN , Publish Date - Mar 16 , 2024 | 03:10 AM

టెస్లా సహా పలు అంతర్జాతీయ విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అయింది.

టెస్లా ఎంట్రీకి లైన్‌ క్లియర్‌!

ఈవీ పాలసీకి కేంద్ర ప్రభుత్వ ఆమోదం .. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో దేశంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసే కంపెనీలకు దిగుమతి సుంకం రాయితీ

న్యూఢిల్లీ: టెస్లా సహా పలు అంతర్జాతీయ విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అయింది. ఈ కంపెనీలను ఆకర్షించేందుకు రూపొందించిన ఈవీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీల తయారీకి భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ పాలసీ ముఖ్యోద్దేశం. ఈ పాలసీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో భారత్‌ విశ్వ శక్తిగా అవతరించనుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈ పథకం ద్వారా ప్రపంచ కంపెనీలను భారత్‌కు ఆహ్వానిస్తున్నాం. దేశంలో ఈవీల తయారీ త్వరితగతిన విస్తరించాలి. అలాగే, దేశంలో తయారైన ఈవీలను ప్రపంచానికి ఎగుమతి చేయగలగాలి. తద్వారా ఈ రంగంలో మనం విశ్వ శక్తిగా ఎదగాలి. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌ను సృష్టించగలద’’ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

దేశంలో ఈవీ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. దాంతో అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో ఎంట్రీపై కన్నేశాయి. వియత్నాంకు చెందిన ఈవీ కంపెనీ విన్‌ఫా్‌స్ట రూ.16,000 కోట్ల పెట్టుబడులతో తమిళనాడులో విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2030 నాటికి భారత్‌లో ఈవీల వార్షిక విక్రయాలు కోటి యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. అలాగే, ఈ రంగం 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చని 2022-23 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. 2022లో ఈవీల విక్రయాలు 10 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీల్లో టాటా మోటార్స్‌ అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ నెగ్జాన్‌, టియాగో, టిగోర్‌ మోడళ్లలో ఎలక్ట్రిక్‌ వెర్షన్లను విక్రయిస్తోంది.

దరఖాస్తు ఇలా..

పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య డిపార్ట్‌మెంట్‌ (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ పాలసీ వివరాలను మీడియాకు వివరించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఆసక్తి కలిగిన కంపెనీలు పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. దిగుమతి అవసరాలతో పాటు పలు వివరాలను అప్లికేషన్‌లో పొందుపర్చాలని అన్నారు. టెస్లా సహా పలు అంతర్జాతీయ ఈవీ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. ఇంకా ఏమన్నారంటే..

ఈ పథకం నోటిఫికేషన్‌ విడుదల చేసిన 120 (అంతకంటే ఎక్కువ) రోజుల్లోగా దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. నోటీసు ద్వారా అప్లికేషన్లను ఆహ్వానించనున్నారు. 120 (అంతకంటే ఎక్కువ) రోజుల్లోగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

స్వీకరించిన దరఖాస్తులపై వాటిని సమర్పించిన లేదా ప్రభుత్వం కోరిన మేరకు వివరణ ఇచ్చిన 120 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

పథకం తొలి రెండేళ్లలో అవసరమైనప్పుడల్లా దరఖాస్తులను ఆహ్వానించే హక్కు ప్రభుత్వం కలిగి ఉంటుంది.

ప్లాంట్‌ ఏర్పాటు కోసం భూమి సేకరణకయ్యే వ్యయం పెట్టుబడి పరిధిలోకి రాదు. ఈ పథకం ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకునే గ్లోబల్‌ కంపెనీలు కనీసం రూ.10,000 కోట్ల వార్షికాదాయం కలిగి ఉండాలి.

ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (పీఎంఏ) ఈ పథకాన్ని అమలు చేయనుంది. కంపెనీలకు పీఎంఏ కార్యదర్శి, నిర్వాహక, అమలు మద్దతును అందించనుంది.

దిగుమతి సుంకం రాయితీ కోసం ఆమోదిత దరఖాస్తుదారులు యేటేటా దిగుమతి అప్లికేషన్‌ను సమర్పించాలి.

పాలసీ మార్గదర్శకాలు

కనీసం 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడితో భారత్‌లో ఈవీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే గ్లోబల్‌ కంపెనీలకు ప్రభుత్వం దిగుమతి సుంకం రాయితీలు కల్పించనుంది.

కంపెనీలకు భారీ పరిశ్రమల శాఖ నుంచి అనుమతి లభించిన మూడేళ్లలో ప్లాంట్‌లో తయారీ ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే మూడేళ్లలో 25 శాతం కాంపొనెంట్లను దేశీయంగా సేకరించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ఈవాటాను 50 శాతానికి పెంచాల్సి ఉంటుంది.

కంపెనీకి అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి ఐదేళ్ల వరకు 35,000 డాలర్లు (రూ.29 లక్షలు) అంతకు పైగా విలువ చేసే కార్లను 15 శాతం కస్టమ్స్‌ సుంకం చెల్లించి దిగుమతి చేసుకునేందుకు అనుమతించనున్నారు. ప్రస్తుతం కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ) కార్ల దిగుమతిపై చెల్లించాల్సిన కస్టమ్స్‌ సుంకం.. ఇంజన్‌ సైజు, ధర, బీమా, రవాణా విలువ ఆధారంగా 70-100 శాతం స్థాయిలో ఉంది.

గరిష్ఠంగా 8,000 యూనిట్ల వరకు సుంకం రాయితీతో దిగుమతి చేసుకునే వీలుంటుంది. వినియోగించుకోని వార్షిక దిగుమతి పరిమితిని మరుసటి ఏడాదికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

కనీస పెట్టుబడితో పాటు దేశీయంగా విడిభాగాల సమీకరణ నిబంధనలను పాటింపునకు హామీగా బ్యాంక్‌ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీ ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే బ్యాంక్‌ గ్యారెంటీ అమలు చేయబడుతుంది.

Updated Date - Mar 16 , 2024 | 03:10 AM