Share News

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ గిరాకీ రెండింతలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:36 AM

దేశంలో కార్యాలయ స్థలాల (ఆఫీస్‌ స్పేస్‌)కు గిరాకీ బలంగా కొనసాగుతున్నదని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కోలియర్స్‌ ఇండియా పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికాని (జనవరి-మార్చి)కి హైదరాబాద్‌ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో...

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ గిరాకీ రెండింతలు

ఆరు ప్రధాన నగరాల్లో 35 శాతం వృద్ధి

ఈ త్రైమాసికానికి కోలియర్స్‌ అంచనా

న్యూఢిల్లీ: దేశంలో కార్యాలయ స్థలాల (ఆఫీస్‌ స్పేస్‌)కు గిరాకీ బలంగా కొనసాగుతున్నదని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కోలియర్స్‌ ఇండియా పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికాని (జనవరి-మార్చి)కి హైదరాబాద్‌ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ వార్షిక ప్రాతిపదికన 35 శాతం వృద్ధి చెందవచ్చని తాజా నివేదికలో అంచనా వేసింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, పుణె నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు నెలల్లో ఆరు నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 1.36 కోట్ల చదరపు అడుగుల స్థాయిలో ఉండవచ్చని అంటోంది. గత ఏడాదిలో ఇదే కాలానికి ఈ నగరాల్లో మొత్తం 1.01 కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాల లీజు ఒప్పందాలు కుదిరాయని కొలియర్స్‌ ఇండియా వెల్లడించింది. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ చాలా అధికంగా ఉందని, ఈ మూడు నెలలకు గాను 29 చదరపు అడుగులకు పెరగవచ్చని రిపోర్టు అంచనా వేసింది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన 13 లక్షల చదరపు అడుగుల లీజింగ్‌తో పోలిస్తే రెట్టింపు కన్నా అధికమిది.

ఈ త్రైమాసికానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గిరాకీ పెరగగా.. చెన్నైలో తగ్గనుందని, పుణెలో దాదాపుగా గత ఏడాది స్థాయిలోనే (8 లక్షల చదరపు అడుగులు) నమోదు కానుందని రిపోర్టు పేర్కొంది. ముంబైలో డిమాండ్‌ 90 శాతం వృద్ధితో 19 లక్షల చదరపు అడుగులకు, బెంగళూరులో 25 శాతం పెరుగుదలతో 40 లక్షల చదరపు అడుగులకు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 14 శాతం వృద్ధితో 25 లక్షల చదరపు అడుగులకు చేరుకోనుందని అంచనా. చెన్నైలో మాత్రం 6 శాతం తగ్గి 15 లక్షల చదరపు అడుగులకు పరిమితం కావచ్చని కొలియర్స్‌ ఇండియా పేర్కొంది. కాగా, ఈ త్రైమాసికంలో ఆరు నగరాల్లో కార్యాలయ స్థలం అద్దెకు తీసుకున్న కంపెనీల్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌ (బీఎ్‌ఫఎ్‌సఐ) రంగాల వాటా 58 శాతంగా ఉందని కొలియర్స్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ అండ్‌ రీసెర్చ్‌ హెడ్‌ విమల్‌ నాడార్‌ తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి కొత్త కార్యాలయ స్థలాలకు గిరాకీ బలంగా ఉందని ఫ్లెక్సీ ఆఫీస్‌ స్పేస్‌ ఆపరేటర్‌ అర్బన్‌ వాల్ట్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ అమల్‌ మిశ్రా అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, అందుబాటు ధరల్లో స్థలాలు అద్దెకు లభిస్తుండటం, నిపుణుల లభ్యత పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని అన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 02:36 AM